ఈ దేవి సీఎంకు షాక్ ఇస్తుందా?
చెన్నై: పెద్ద పెద్ద వేదికలు లేవు. భారీ సభలు లేవు. తండోపతండాలుగా తరలివచ్చే జనాలు లేరు. అయినా చెన్నై ఆర్కే నగర్లోని వీధివీధికి కాలినడకతో తిరుగుతూ.. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పలుకరిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు సీ దేవి. మేలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న తొలి ట్రాన్స్జెండర్ అభ్యర్థిగా ఆమె చరిత్ర సృష్టించబోతున్నారు. అంతేకాకుండా ఏకంగా అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలితను ఆమె ఢీకొనబోతున్నారు. జయలలితకు ఆర్కే నగర్ కంచుకోట. భారీ మెజారిటీతో ఆమె గెలువడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అయినా వెనుదీయని 33 ఏళ్ల సీ దేవి గట్టి ప్రచారమే చేస్తున్నారు. తమిళ జాతీయవాద పార్టీ అయిన నామ్ తమిలార్ కచ్చి తరఫున అభ్యర్థిగా దిగిన ఆమె ప్రతి ఒక్క ఓటరును పలుకరిస్తున్నారు.
నిజానికి ఆర్కే నగర్లో జయలలితను ఓడించడమనే ప్రసక్తే ఉండకపోవచ్చు. 2015 ఉప ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థి కన్నా 16 రెట్ల ఓట్లు అత్యధికంగా సాధించి బంఫర్ మెజారిటీతో జయలలిత విజయం సాధించారు. అయితే, ఈసారి జయమ్మ ఓటుబ్యాంకును గణనీయంగా దెబ్బతీయడమే దేవి లక్ష్యంగా పెట్టుకున్నారు. జయలలితపై పోటీచేయడానికి తానేమీ భయపడటం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు.
'ఈ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి పోటీ చేస్తారని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కానీ మా పార్టీ ఇక్కడ బలంగా ఉంది' అని ఆమె చెప్తున్నారు. స్థానిక నియోజకవర్గ సమస్యలైన నీటి కొరత, అందరికీ రేషన్ కార్డులు లేకపోవడం వంటి సమస్యలను ఆమె ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సీఎంపై పోటీచేయడం ఒక ఎత్తు అయితే, ఒక ట్రాన్స్జెండర్ పట్ల సమాజంలో ఉన్న ప్రతికూల అపనమ్మకాల కారణంగా ఆమె ఓటర్లు చేరువ కావడం మరొక ఎత్తు అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.