భూసమీకరణపై హైకోర్టుకు 300 మంది రైతులు
హైదరాబాద్: రైతులు మూకుమ్మడి న్యాయపోరాటానికి సమాయత్తం అవుతున్నారు. భూ సమీకరణకు వ్యతిరేకంగా సోమవారం హైకోర్టులో పిటిషన్లు వేయనున్నారు. రాజధాని నిర్మాణానికి రైతుల అంగీకారం లేకుండా భూములు సమీకరిస్తున్నారనీ, సారవంతమైన భూములను మినహాయించాలని కోరుతూ 300మంది రైతులు హైకోర్టును సోమవారం ఆశ్రయించనున్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్)పై సోమవారం విచారణ జరగనుంది. సీఆర్డీఏ చట్టం రాజ్యాంగవిరుద్ధమేగాక, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకమంటూ విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, ప్రముఖ పాత్రికేయులు ఎ.బి.కె.ప్రసాద్, సీనియర్ న్యాయవాది సి.సదాశివరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించనుంది. సీఆర్డీఏ చట్టంవల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని అత్యంత సారవంతమైన భూములు నాశనమవుతున్నాయని, దీనివల్ల రైతాంగం తమ జీవోనోపాధిని కోల్పోతున్నారని, పర్యావరణం కూడా దెబ్బతింటుందని, అందువల్లే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నామని పిటిషనర్లు వివరించారు.