cabin
-
ట్రక్కు క్యాబిన్లలో ఏసీ తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్
సరకు రవాణా చేసే ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 2025 అక్టోబర్ 1, ఆ తర్వాత తయారయ్యే ఎన్2, ఎన్3 కేటగిరి ట్రక్కులలో డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్లు తప్పనిసరి చేస్తూ కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. 3.5 టన్నుల నుంచి 12 టన్నులు బరువుండే ట్రక్కులు ఎన్2 కేటగిరీ కిందకు, 12 టన్నులు దాటిన ట్రక్కులు ఎన్3 కేటగిరీ కిందకు వస్తాయి. డ్రైవర్లకు మెరుగైన పని వాతావరణం కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రక్కు క్యాబిన్లలో ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలను తప్పనిసరి చేసేందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు ఆమోదం లభించినట్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గత జులైలోనే తెలిపారు. దేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటైన రవాణా రంగంలో ట్రక్ డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి పని పరిస్థితులు, మానసిక స్థితికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
స్పైస్‌జెట్ నిర్వాకం: క్యాబిన్లో పొగలు, దేవుడికి మొక్కుకోండి! వణికిపోయిన ప్రయాణీకులు
సాక్షి,హైదరాబాద్: వరుస సాంకేతిక లోపాల సంఘటనలతో రెగ్యులేటరీ చర్యలను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌కు సంబంధించి మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విమానం గాల్లో ఉండగానే క్యాబిన్లో పొగలు కమ్ముకోవడంతో ప్రయాణీకులు వణికిపోయారు. చివరికి హైదరాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండ్ కావడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. (అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు) గోవా-హైదరాబాద్ SG 3735 విమానంలో అక్టోబర్ 12న బుధవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. అయితే ఇంత జరిగినా ఏమీ జరగలేదన్నట్టుగా వివరాలను గోప్యంగా ఉంచడం వివాదం రేపింది. “Q400 విమానం సురకక్షితంగా ల్యాండ్ అయింది.. ప్రయాణికులు సురక్షితంగా దిగిపోయారు” అని స్పైస్‌జెట్ సెలవిచ్చింది. అయితే ఈ ఘటనపై ప్రయాణీకుల అనుభవాలు మాత్రం భయంకరంగా ఉన్నాయి. దీంతో ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ విచారణకు అదేశించింది. ఈ ఘటనలో ఒక ప్రయాణికురాలికి గాయాలు కాగా, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని వైద్య కేంద్రానికి తరలించినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. ఊపిరి ఆడడం లేదని ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్‌లోని ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి, చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసినట్టు వెల్లడించాయి. హైదరాబాద్బాద్కు ఐటీ ఉద్యోగి శ్రీకాంత్ తనకెదురైన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫస్ట్‌టైం విమానం ట్రిప్‌కు బయలుదేరారు శ్రీకాంత్. ఇంతలోఅకస్మాత్తుగా ముందు క్యాబిన్‌లోనూ,ఆ తరువాత విమానంలోనూ పొగలు వ్యాపించాయి. దేవుడికి మొక్కుకోమని చెప్పడం చాలా బాధకలిగించిందని చెప్పారు. తనతోపాటు ప్రయాణీకులంతా ఒక్కసారిగా దిగ్గ్ర్భాంతికి లోనయ్యామని, చాలామంది ప్రాణ భయంతో కేకలు పెట్టారని వెల్లడించారు. “వాష్‌రూమ్‌లో ఏదో జరిగింది. సిబ్బంది హడావిడిగా, చిన్నగా మాట్లాడుకుంటూ కనిపించారు. మరో 20 నిమిషాల్లో మా చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఇంతలో లైట్లు వేశారు. మాట్లాడొద్దని చెప్పారంటూ” మరొక ప్రయాణీకుడు అనిల్ తన అనుభవాన్ని షేర్ చేశారు. ఎమర్జెన్సీ డోర్ తెరుచుకున్నాక "జంప్ అండ్ రన్" అంటూ అరిచారని మరొకరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫోటోలను తొలగించమని ఎయిర్‌లైన్ సిబ్బంది బలవంతం చేసారట. దీనికి నిరాకరించడంతో తన ఫోన్ కూడా లాక్కున్నారని శ్రీకాంత్ వాపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటికే ఎనిమిది వరుస సాంకేతిక లోపాలకు సంబంధించిన ఘటనలతో స్పైస్‌జెట్ విమానాలపై డీజీసీఏ ఆంక్షలు విధించింది. 50 శాతం విమానాలు మాత్రమే నడపాలన్న ఆదేశాలను ఇటీవల మరో నెలపాటు పొడిగించింది. @narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib — Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022 -
వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్లో పొగలు
న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్ ఫెయిల్ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఐసోలేషన్ గదులుగా రైలు కేబిన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో రైళ్లను ఐసోలేషన్, క్వారంటైన్ వార్డులుగా మార్చే ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత లాలాగూడ వర్క్‌షాపులో ఓ రైలు బోగీలోని రెండు కేబిన్లను ఐసోలేషన్ గదులుగా మార్చారు. డిమాండ్ ఆధారంగా ఇలాంటి మరిన్ని కేబిన్లను రూపొందించనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు. కేబిన్‌లో అప్పర్, మిడిల్, సైడ్ బెర్తులను తొలగించి 2 లోయర్ బెర్తులను మాత్రమే ఉంచా రు. ప్రత్యేకంగా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దోమ లు రాకుండా కిటికీలకు మెష్‌లు ఏర్పాటు చేశారు. ఒకవైపు ఉన్న టాయిలెట్‌ను తొలగించి బాత్రూమ్గా మార్చారు. -
కొలిమిపై కొలువు
సాక్షి, హైదరాబాద్: రైల్వే లొకోపైలెట్లు నిప్పుల కొలిమిపై విధులు నిర్వహిస్తున్నారు. వేలాదిమంది ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే లొకోపైలెట్లకు విధి నిర్వహణలో కనీస సదుపాయాలు లభించడం లేదు. ఎలాంటి విరామం లేకుండా వందలకొద్దీ కిలోమీటర్లు రైళ్లు నడిపే డ్రైవర్లు అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య విలవిలలాడుతున్నారు. బయటి ఉష్ణోగ్రతల కంటే కనీసం 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నడుమ రైళ్లను నడుపుతున్నారు. అన్ని రైలింజన్లలో ఏసీ సదుపాయాన్ని, టాయిలెట్లను ఏర్పాటు చేయాలని పదేళ్ల క్రితం రైల్వేబోర్డు నిర్ణయించినప్పటికీ ఇప్పటివరకు అమలుకు నోచుకోలేదు. భద్రతా రంగానికి చెందిన లొకోపైలెట్లలో సిబ్బంది కొరత కారణంగా పనిభారం సైతం రెట్టింపైంది. దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని డివిజన్లలో 3.500 మందికిపైగా లొకోపైలెట్లు, సహాయ లొకోపైలెట్లు, షంటర్లు పని చేయవలసి ఉండగా ప్రస్తుతం సుమారు 2,500 మంది మాత్రమే ఉన్నట్లు కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. లొకోపైలెట్ల సమస్యలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఉగ్గబట్టుకోవలసిందే... టాయిలెట్ సదుపాయం లేకపోవడం వల్ల కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. ‘రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరితే బల్లార్ష వరకు ఉగ్గబట్టుకొని బండి నడపాల్సి వస్తోంది. కనీసం ఐదున్నర గంటలపాటు ఇలా ఆపుకోవలసిందే. దీంతో విధి నిర్వహణలో ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంటుంది’అని ఒక సీనియర్ డ్రైవర్ అన్నారు. లొకోపైలెట్లు ప్రతిక్షణం వెంటాడే ఒత్తిడి, నిద్రలేమి వల్ల రైల్వే మాన్యువల్ విధించిన ఆరోగ్యసూత్రాలకు విరుద్ధమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోందని రైల్వే ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో గోడు వెళ్లబోసుకున్నారు. సిబ్బంది కొరత కారణంగా గూడ్స్ రైళ్లు నడపాల్సిన వాళ్లు ఎక్స్‌ప్రెస్‌లు, మెయిల్ సర్వీసులు నడుపుతున్నారు. షంటర్లు(ఇంజిన్లను ఒక చోట నుంచి మరో చోటకు మార్చేవారు) ఎంఎంటీఎస్‌లు, ప్యాసింజర్ రైళ్లు నడుపుతున్నారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఇది ప్రమాదకరమే. ఏదీ ఏసీ... లొకోపైలెట్లకు ఇంజిన్ కేబిన్లలోనే కనీస సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని 2007లోనే రైల్వేబోర్డు నిర్ణయించింది. డబ్ల్యూఏజీ–7, డబ్ల్యూఏజీ–9 కేటగిరీకి చెందిన అన్ని ఎలక్రిక్ లొకో రైళ్లలో తప్పనిసరిగా ఏసీ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. కానీ ఇది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. ‘కొన్ని రైళ్లలో పరిమితంగా ఏసీలు ఏర్పాటు చేశారు. కానీ వాటి మెయింటెనెన్స్ కోసం సిబ్బందిని నియమించలేదు. దీంతో బయట 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే ఇంజిన్ క్యాబిన్లో 52 డిగ్రీల ఉష్ణోగ్రతలో బండ్లు నడపాల్సి వస్తోంది’అని సికింద్రాబాద్ నుంచి విశాఖ వైపు పని చేసే లొకోపైలెట్ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బయట నుంచి వచ్చే వేడి గాలులు, ఇంజిన్ వేడి కారణంగా లొకోలు వడదెబ్బకు గురవుతున్నారు. అధికరక్తపోటు, డయాబెటీస్ వంటి సమస్యలున్న వారు మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు ఎంఎంటీఎస్ నడిపే డ్రైవర్ ఒకరు తెలిపారు. సెలవులకు ‘సెలవ్’... ఒక్కో లొకోపైలెట్ విధి నిర్వహణలో 8 గంటలు మాత్రమే పనిచేయాలి. ఆ తరువాత 6 గంటల విశ్రాంతి తీసుకొని తిరిగి 8 గంటలు పనిచేసి మరో 6 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. డ్యూటీ ముగిసిన తరువాత 16 గంటలపాటు విశ్రాంతి ఉండాలి. ప్రతి 72 గంటలకు ఒక రోజు సెలవు చొప్పున, ప్రతి 14 రోజులకు ఒక 24 గంటల పూర్తి విశ్రాంతి చొప్పున లొకోపైలెట్ లింక్ (విధి నిర్వహణ) ఉండాలి. కానీ దీనికి పూర్తి విరుద్ధంగా 6 గంటలకు బదులు 4 గంటల విశ్రాంతికే పరిమితమవుతున్నారు. సెలవులు లభించకపోవడంతో కుటుంబాలతో తగినంత సమయం గడపడం లేదు. పిల్లల ఆలనాపాలన, చదువులు, వాళ్ల అభివృద్ధి వంటి అంశాల్లో భాగస్వాములు కాలేకపోతున్నారు. -
జెట్ ఎయిర్ వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
బెంగళూరుః కర్నాటక రాజధాని బెంగళూరు విమానాశ్రయంనుంచీ ఉదయం బయల్దేరిన జెట్ ఎయిర్ వేస్ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో పొగలు రావడంతో.. విషయాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన అధికారులు బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశారు. మంగుళూరుకు చెందిన 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం ఉదయం బెంగళూరు ఎయిర్ పోర్టునుంచి టేకాఫ్ అయ్యింది. ఆకాశంలోకి ఎగిరిన కొద్దిసేపటికే ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ లో పొగలు రావడాన్ని సిబ్బంది గమనించి, అధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని వెనక్కు రప్పించారు. 9W 2839 జెట్ ఎయిర్ వేస్ విమానం లో సాంకేతిక లోపాలు ఏర్పడటంతో బెంగళూరు ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ప్రయాణీకులంతా క్షేమంగానే ఉన్నట్లు జెట్ ఎయిర్ వేస్ అధికారులు తెలిపారు.