cadets
-
ఎన్నాళ్లో వేచిన ఉదయం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు త్వరలో ఫలించనున్నాయి. 10 నెలల నిరీక్షణకు తెరపడనుంది. అక్టోబర్ మొదటివారంలో దాదాపు 4,200 మంది అభ్యర్థులకు శిక్షణ మొదలుకానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పీటీసీ/డీటీసీల్లో కానిస్టేబుళ్లుగా శిక్షణ పొందుతున్న సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్డ్(ఏఆర్) అభ్యర్థులకు అక్టోబర్ 5 నుంచి 7వ తేదీ వరకు పాసింగ్ ఔట్ పరేడ్(పీవోపీ) జరగనుంది. ఆ వెంటనే టీఎస్ఎస్పీ అభ్యర్థుల శిక్షణను ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పదినెలలుగా మానసిక వేదన అనుభవిస్తున్న అభ్యర్థులు, వారి కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఫలితాలు వచ్చిన ఇన్నాళ్లకు.. వాస్తవానికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) 2018లో 17,156 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 2019 సెప్టెంబర్‌లో సివిల్, ఏఆర్, టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు పరీక్షలు నిర్వహించగా అక్టోబర్‌లోనే ఫలితాలు వచ్చాయి. అయితే, 12 వేల మందికిపైగా సివిల్, ఏఆర్ కేడెట్లకు 2020 జనవరిలో శిక్షణ ప్రారంభమైనా స్థలాభావంతో సుమారు 4,200 మంది టీఎస్ఎస్పీ అభ్యర్థులకు ఇంకా శిక్షణ మొదలుకాలేదు. ఈ మధ్యకాలంలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్య ర్థులు అనేక కష్టాలు అనుభవించారు. ఇద్దరు అభ్యర్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాదాపు ఆరుగురు అభ్యర్థులు వివిధ ప్రమాదాల్లో గాయపడ్డారు. కొందరు కరోనా బారినపడ్డారు. మరికొందరు ప్రభుత్వ, ప్రైవేటు జాబులకు రాజీనామా చేశారు. శిక్షణకు పిలుపు రాకపోవడంతో చాలామంది కూలీ పనులకు వెళ్తున్నారు. ఆరోగ్యం జాగ్రత్త.. అక్టోబర్‌లో శిక్షణ ప్రారంభం కానుండటంతో అభ్యర్థులంతా ఫిట్నెస్ను కాపాడుకోవాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఆరోగ్యంగా ఉండాలని, జ్వరాలు, అనారోగ్యాల బారిన పడకుండా జాగ్రత్త వహించాలంటున్నారు. శిక్షణ ప్రారంభానికి ముందు అభ్యర్థులందరికీ కరోనా పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించనున్నారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే, వారిని క్వారంటైన్‌కు పంపాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. -
పోలీస్ క్యాడెట్లకు ముందే శిక్షణ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కానిస్టేబుల్ శిక్షణ పొందుతున్న కేడెట్లకు ఈసారి నిర్ణీత సమయానికి ముందే శిక్షణ పూర్తి కానుంది. కరోనా దెబ్బకు సెమిస్టర్ సెలవులు లేకుండా నిరంతరాయంగా శిక్షణ కొనసాగుతుండటమే ఇందుకు కారణం. లాక్డౌన్ విధించిన తరువాత క్యాడెట్లు ఇంతవరకూ బాహ్య ప్రపంచాన్ని చూడలేదు. క్యాడెట్లు కరోనా బారిన పడకుండా దాదాపు 105 రోజులుగా అందరినీ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)తోపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. ఎవరికీ ఔటింగ్ ఇవ్వడం లేదు. క్యాడెట్లను చూసేందుకు అకాడమీలోకి వారి తల్లిదండ్రులు, భార్యాపిల్లలను కూడా అనుమతించడం లేదు. మరీ అత్యవసరమైతే తప్ప బయటికి పంపడం లేదు. ఒకవేళ వెళ్లినా 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతున్నారు. దీంతో వారంతా కేవలం ఫోన్లతోనే కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం తెలుసుకుంటున్నారు. ఈసారి క్యాడెట్లందరికీ శిక్షణ ముందే ముగియనుందన్న వార్త కాస్త ఊరటనిస్తోంది. మొదటి సెమిస్టర్ సెలవులు రద్దు.. రాష్ట్రంలో జనవరి 18న టీఎస్‌పీఏతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పీటీసీలలో దాదాపు 17,200 మంది పోలీసు కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. వీరికి అప్పట్లో కుటుంబ సభ్యులను కలుసుకునే వీలుండేది. మార్చి 8, 9వ తేదీల్లో క్యాడెట్లకు సెలవులు ఇచ్చారు. తరువాత అనుకోకుండా 22వ తేదీ నుంచి లాక్డౌన్ విధించారు. అప్పటి నుంచి క్యాడెట్లకు కరోనా సోకకుండా ఔటింగులు ఆపేశారు. కుటుంబ సభ్యులను కలవనీయడం లేదు. వీరికి రెండు సెమిస్టర్లలో సిలబస్ పూర్తి అవుతుంది. మే నెలలో 4,5,6,7 తేదీల్లో తొలిసెమిస్టర్ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం.. వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, బయటికి వెళితే.. కేడెట్ల ఆరోగ్యానికి ముప్పు ఉండటంతో సెలవులు రద్దు చేశారు. మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. వీరికి శిక్షణ ముగిసి పాసింగ్ ఔట్ పరేడ్ (పీవోపీ) అక్టోబరు 12న జరగాలి. సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వలేదు కాబట్టి పీవోపీ మరో వారం ముందుకు జరిగి అక్టోబరు 4 లేదా 5వ తేదీల్లో జరిగే అవకాశాలున్నాయని సమాచారం. దీనిపై ఇంకా ఉన్నతాధికారుల నుంచి ప్రకటన రావాల్సి ఉంది. జ్వరం, జలుబుతో పలువురు.. అకాడమీల్లో పలువురు క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారు. నగరంలోని యూ సుఫ్‌గూడలో శిక్షణ పొందుతున్న ఏఆర్ కానిస్టేబుల్ క్యాడెట్లు 16 మంది అనారోగ్యం బారిన పడ్డారు. వీరంతా జ్వరం, జలుబుతో బాధపడుతున్నారని సమాచారం. దీంతో ముందు జాగ్రత్తగా వీరిని ప్రత్యేక బ్యారెక్‌లలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరోవైపు టీఎస్‌పీఏలోనూ 50 మందికిపైగా క్యాడెట్లు అనారోగ్యం బారిన పడ్డారని తెలిసింది. టీఎస్‌పీఏలో కరోనా అనుమానితులకు గోల్గొండ, సరోజినీ ఆసుపత్రిలో కరోనా నిర్ధారిత పరీక్షలు చేయిస్తున్నారు. -
పోలీస్ అకాడమీలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడ మీ (టీఎస్పీఏ)లో ఓ అటెండర్ కు కరోనా పాజిటివ్ రావడంతో అకాడమీ సిబ్బంది, కేడెట్లలో ఆందోళన మొదలైంది. కాగా, అకాడమీలో ఒకే గదిలో 400 మంది వరకు కేడెట్లను కూర్చోబెట్టి తరగతులు నిర్వహిస్తూ భౌతిక దూరం తదితర కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అకాడమీలో 1,200 మంది ఎస్సైలు, 650 మంది వరకు విమెన్ పీసీ కేడెట్లు శిక్షణ పొందు తున్నారు. వీరు కాకుండా మరో 400 మంది సిబ్బంది బయట నుంచి వస్తారు. కేవలం 30 నుంచి 40 మంది మాత్రమే క్యాంపస్‌లో ఉంటా రు. లాక్డౌన్ విధించినా అకాడమీలో కొత్తవారిని రానీయలేదు. లాక్డౌన్ ఆంక్షలు తొలగించిన తరువాత హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరిగాయి. దీంతో టీఎస్పీఏ అటెండర్ ఉద్యోగికి కరోనా రావడంతో సిబ్బం దిలో కలకలం మొదలైంది. ఆందోళనకు కారణాలివే..! అకాడమీలో భౌతిక దూరం నిబంధన ఏ కోశానా అమలుకావడం లేదని సిబ్బంది వాపోతున్నారు. తరగతిలో 400 మందికిపైగా కేడెట్లు ఒకే హాల్లో కూర్చుంటున్నారు. ముఖానికి మాస్కులు వేసుకుంటున్నా.. అంత దగ్గరగా కూర్చోవడంతో కేడెట్లలో కరోనా ఆందోళన మొదలైంది. రెండు వేల మంది కేడెట్లు, 400 మంది సిబ్బందితో శ్రమదానం సైతం చేయించారు. కరోనా కేసు వెలుగుచూసినా ఎలాంటి మార్పు రాలేదు. అకాడమీలో శనివారం కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దీనికి అందరూ హాజరయ్యారు. కరోనా కేసు వెలుగుచూసిన నేపథ్యంలో ఆదివారం నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. రూ. 2,800 కట్టిన వారికి ప్రైవేటు సిబ్బంది పరీక్షలు చేస్తారని తెలపడంతో సిబ్బంది నీరుగారిపోయారు. -
వికటించిన అల్పాహారం
9 మంది ఎన్సీసీ క్యాడెట్లకు అస్వస్థత మందులు లేవన్న ప్రభుత్వాస్పత్రి సిబ్బందిపై ఆర్డీవో ఆగ్రహం పెద్దాపురం : కాకినాడ 18 ఆంధ్రా బెటాలియన్ ఎన్సీసీ శిక్షణ శిబిరంలో ఆదివారం ఉదయం 9 మంది ఎన్సీసీ మహిళా క్యాడెట్లు అస్వస్థతకు గురయ్యారు. శిబిరం వద్దకు ఉదయాన్నే వండిన అల్పాహారం వికటించడంతో వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎన్సిసి అధికారులు మనీష్‌గౌర్, యు.మాచిరాజు, కృష్ణారావు, సతీష్‌లు హుటాహుటీన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయంలో తెలుసుకున్న పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబులు క్యాడెట్ల ఆరోగ్య సమస్యపై ఆరా తీశారు. ఆస్పత్రిలో సిబ్బంది మందులు బయట నుంచి తీసుకు రమ్మన్నంటున్నారని క్యాడెట్లు ఫిర్యాదు చేయడంతో సిబ్బందిని పిలిచి వారిపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. మందుల కొరత లేదంటూనే మందులు లేవని సమాధానం చెప్పడమేమిటని మండిపడ్డారు. అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి గానీ రోగులపై సమాధానం చెప్పడం బాగోలేదని, ఇలా అయితే చర్యలు తీసకుంటామని హెచ్చరించారు. వెంటనే వైద్యులను రప్పించి క్యాడెట్లకు అవసరమైన మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆర్డీవో ఆదేశించారు. మంత్రి రాజప్ప ఆరా ఎన్సీసీ క్యాడెట్లు అస్వస్థతకు గురైన సమాచారం అందిన వెంటనే రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప క్యాడెట్లకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని చక్కదిద్దాలని ఆర్డీవో విశ్వేశ్వరరావు, వైద్యాధికారులకు సూచించారు. క్యాడెట్లకు మెరుగైన వైద్యాన్ని అందించాలని ఆదేశాలు జారీ చేశారు.