Call Money harassment
-
పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు..
సాక్షి తాడేపల్లి : కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక బకింగ్‌హామ్‌కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వేములపూడి ప్రేమ్ కుమార్ (30) మృతదేహం మంగళవారం తెనాలి మండలం కొలకలూరు రైల్వే బ్రిడ్జి వద్ద లభించింది. విజయవాడ పటమటలో నివసించే ప్రేమ్ కుమార్ గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద డిసెంబర్ 28న బకింగ్‌హామ్ కెనాల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మంగళవారం కొలకలూరు రైల్వే బ్రిడ్జి సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన విజయవాడలోని ప్రేమ్‌కుమార్ భార్య దిశిదాకృష్ణ, బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ తరలించారు. వడ్డీ వ్యాపారి బతకనివ్వట్లేదు! ‘పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు. మనకిక న్యాయం జరగదు. బతకాలని ఉన్నా.. బతకనివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించు..’ అంటూ ఓ యువకుడు తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకిన ఘటన విజయవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమటకు చెందిన ప్రేమ్‌కుమార్, అతని సోదరి జ్యోతి కలిసి ఇద్దరి ఇళ్లను అదే ప్రాంతానికి చెందిన కాసుల వెంకట రంగారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి 2017వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొదట్లో రూ.3 వడ్డీ అని చెప్పిన రంగారావు.. ఆ తర్వాత వడ్డీ రేటును రూ.10కి పెంచాడు. చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం ప్రేమ్ కుమార్, జ్యోతి వడ్డీ మొత్తంతోపాటు అసలు మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించేశారు. చివరకు రూ.లక్ష అప్పు ఉండగా.. దానిని కూడా త్వరలో చెల్లిస్తామని, ఈలోపు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు తిరిగివ్వాలని రంగారావును కోరగా.. ఇంకా రూ.16 లక్షలు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లిస్తేనే పత్రాలిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ ఈ నెల 16న స్పందన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు ఆ ఫిర్యాదు పరిష్కరించాలని పటమట పోలీసులకు ఆదేశాలిచ్చారు. ఫలితం లేకపోవడంతో ప్రేమ్‌కుమార్ 23వ తేదీన మరోసారి స్పందనలో సీపీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌పై కిరాయి గుండాలతో దాడి చేయించాడు. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇక ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదని ఆవేదన చెందిన అతడు ఈనెల 28న సాయంత్రం తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్లో దూకేశాడు. చదవండి: కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ! -
కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ!
టీడీపీ పెద్దల పేరు చెప్పి కృష్ణాజిల్లాలో ఓ బడా వడ్డీ వ్యాపారి అరాచకం (సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘అసలు ఏమనుకుంటున్నావ్ మా గురించి.. మా వెనకాల ఎవరెవరు ఉన్నారో, మా పరపతి ఏంటో తెలుసుగా.. వాళ్లతో ఉన్న ఫొటోలు పంపాను.. చూశావుగా? ఇంతకూ ఆ డబ్బులు ఎవరివో నీకు అర్థమవుతోందా.. పెద్దవాళ్లకు ఒక్కసారి చెబితే మీ కుటుంబమంతా మటాష్ అయిపోతుంది.. మీ ఇంట్లోని ఆడవాళ్లు కటకటాల వెనకుంటారు. పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. అందుకే నోర్మూసుకుని చెప్పింది చేయ్.. అడిగింది ఇచ్చేయ్’’.. .. ఇది బరితెగించిన ఓ బడా ‘కాల్’నాగు బాగోతం. ‘పచ్చ’కావరంతో పెచ్చుమీరిన దౌర్జన్యానికి పరాకాష్ట ఇది. అధికారం అండతో.. పెద్ద మనుషుల ముసుగులో జలగలా పీక్కుతింటున్న అప్పులోడి అరాచకం ఇది. ఇలా.. హద్దులు మీరి కొనసాగుతున్న హెచ్చరికలకు బెంబేలెత్తిపోయిన విజయవాడకు చెందిన ఓ రియల్టర్ తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని ఇటీవల ‘స్పందన’లో వేడుకున్నారు. ఈ దారుణమైన కాల్‌మనీ కహానీ వివరాలు ఏంటంటే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి వర్లేపల్లి సీతారామమోహనరావు నుంచి భవన నిర్మాణం నిమిత్తం విజయవాడకు చెందిన రియల్టరు యార్లగడ్డ రవికిరణ్ కుటుంబం రూ.1.25 కోట్లను 2010 ఏప్రిల్‌లో అప్పుగా తీసుకుంది. చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం ఇందుకుగాను సెక్యూరిటీ కింద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి–16ని ఆనుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామ పరిధిలోని 81/2, 81/5, 81/7 సర్వే నెంబర్లలో ఉన్న ఏడు ఎకరాల స్థిరాస్తిని వడ్డీ వ్యాపారి తన భార్య అయిన లక్ష్మి, అమెరికాలో ఉంటున్న కుమారుడు శశికాంత్ వర్లేపల్లి, బంధువుల పేరిట జీపీఏ కమ్ సేల్ అగ్రిమెంట్‌ను ఏడు డాక్యుమెంట్లుగా చేయించుకున్నారు. దాంతోపాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్, లెడ్జర్‌పై సంతకాలు, బ్యాలెన్స్ అమౌంట్ రిసిప్ట్లు కూడా ముందుగానే తీసుకున్నారు. 2012 నుంచి 2014 మధ్య కాలంలో అసలుతోపాటు వందకు రూ.20 చొప్పన వడ్డీ చెల్లించడంతో అగ్రిమెంట్ల క్యాన్సిలేషన్ డీడ్స్ చేశారని.. కానీ, రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేయకుండా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని రవికిరణ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో బాధ్యతలు చేపట్టాక కుంచనపల్లి వద్ద ఎన్‌హెచ్–16ను ఆనుకుని ఉన్న ఏడు ఎకరాలను డెవలప్మెంట్ కింద సినీనటుడు, నాటి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి ప్రాపర్టీస్.. భూ యజమాని రవికిరణ్‌కు చెందిన బెస్ట్ ఫారŠూచ్యన్ సంస్థ మధ్య చర్చలు జరిగాయి. తన వ్యాపార ఒప్పందం కోసం అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్ చేయాలని వడ్డీ వ్యాపారిని రవికిరణ్ కోరగా.. తాను రూ.1.25 కోట్లు అప్పు ఇచ్చినందునే జయభేరి సంస్థతో ఒప్పంద అవకాశం వచ్చిందని, తనకూ వడ్డీతో పాటు మరింత లాభం చేకూర్చితేనే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్‌తో పాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్లు, బ్యాలెన్స్ అమౌంట్ రిసిప్ట్లు తిరిగి ఇచ్చేస్తానంటూ సీతారామమోహన్‌రావు అడ్డం తిరిగారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ భారత్, అమెరికాలో వారి ఆర్థిక లావాదేవీలు చూస్తున్నందున తమనెవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. అంతటితో ఆగక.. తాము తలచుకుంటే డెవలప్మెంట్ ఒప్పందం జరగకుండా కూడా అడ్డుకోగలమని హెచ్చరించారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చేసేదేంలేక ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే బెస్ట్ ఫారూచ్యన్లో మూడు శాతం వాటా ఇచ్చామని.. ఆ తరువాతే జయభేరి ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదిరిందని రవికిరణ్ అందులో వివరించారు. చదవండి: బాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు మొత్తం వాటా ఇవ్వాలని ఒత్తిడి ఒప్పందం ప్రకారం ఏడు ఎకరాలలో 9.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగాలి. అందులో 40 శాతం కింద భూ యజమానికి 3.60 లక్షల చ.అ వస్తుంది. ఇందులో బెస్ట్ ఫారŠూచ్యన్ కంపెనీ వాటా 1.30 లక్షల చ.అ. ఒక చ.అ ధర రూ.5,500 చొప్పున ఈ కంపెనీకి రూ.71.50 కోట్లు సమకూరుతుంది. తనకు రాసిచ్చిన మూడు శాతం కాకుండా బెస్ట్ ఫారŠూచ్యన్ వాటా మొత్తం తనకే ఇవ్వాలని సీతారామమోహన్‌రావు గత సర్కారు పెద్దల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవికిరణ్ ఆరోపించారు. అంతేకాదు.. శశికాంత్‌కు చంద్రబాబు, లోకేశ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియజెప్పేందుకు వారిద్దరితో శశికాంత్ ఉన్న ఫొటోలను తరచూ పంపేవారని తెలిపారు. అలాగే, భారత్, అమెరికాలో తాము వడ్డీలకు తిప్పుతున్న దాంట్లో ఎక్కువ మొత్తం లోకేశ్‌కు చెందినదేనని చెప్పేవారని రవికిరణ్ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అప్పటి డీజీపీ ఠాకూర్‌తో పలు దఫాలు ఫోన్లో మాట్లాడించారని కూడా తెలిపారు. మరోవైపు.. తనకన్నా ముందు గోదావరి జిల్లాకు చెందిన విద్యా సంస్థల యాజమాని అయిన మాజీ ఎమ్మెల్సీ.. ప్రముఖ దర్శకుడు, విజయవాడకు చెందిన మరో ఇద్దరు రియల్టర్లు, గుడివాడలోని ఇంజనీరింగ్ కాలేజీ యజమానితో పాటు పలువురు తనలాగే మోసపోయారన్నారు. పోలీసు ఉన్నతాధికారుల తీరెలా ఉందంటే.. ఈనెల 16న సీఎం కార్యాలయం వద్ద స్పందనలో రవికిరణ్ ఫిర్యాదు చేయగా విజయవాడ సీపీకి రిఫర్ చేశారు. 20న పటమట పోలీసుల నుంచి రవికిరణ్‌కు ఫోన్ వచ్చింది. ఆరో టౌన్ స్టేషన్‌కు బదిలీ అయింది. ఆ తరువాత స్పందన లేదు. 23న తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల చర్యలేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి ఫిర్యాదిదారు తీసుకెళ్లారు. పరిశీలించాలని ఏఐజి రాజశేఖర్‌కు సూచనలు వెళ్లాయి. ఫిర్యాదు విచారణకు అర్హమైనదిగా నిర్ధారించారు. 26న గుంటూరు అర్బన్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదును పంపి విచారించాలని డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశించారు. తనపై రవికిరణ్ ఫిర్యాదు చేశారని తెలుసుకున్న సీతారామమోహన్‌రావు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై పరిశీలించాలని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వీఎస్ఎన్ వర్మకు ఆదేశాలు వెళ్లాయి. కాగా, ఈ ఫిర్యాదు విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కొందరు రంగంలోకి దిగి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులో పార్టీ పెద్దల పేర్లు కూడా ఉన్నందున తాము ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని అంటున్నట్లు తెలియవచ్చింది. ఈ విషయమై డీజీపీ గౌతమ్ సవాంగ్ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇదే విషయమై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును అడగ్గా తనకు ఫిర్యాదు అందిందని, వాస్తవాలను తెలుసుకుంటామన్నారు. -
ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం
-
ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం
సాక్షి, విజయవాడ : కాల్‌మనీ వ్యవహారం మరో నిండు ప్రాణం బలిగొంది. విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి ఆదివారం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడేముందు తన చావుకు కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ అంటూ ఫోన్లో వీడియో తీసి వాట్సప్‌లో తన కుటుంబసభ్యులకు షేర్ చేశాడు. వారికి రూ. 4 లక్షల 16వేల రూపాయలు కట్టానంటూ ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఇదే విషయమై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వీడియోలో తెలిపాడు. అయితే పోలీసుల ముందే ఆ నలుగురు తనను కులం పేరుతో దూషించినా పోలీసులు ఏం పట్టనట్లు వ్యవహరించారని ప్రేమ్ ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. కాగా, ప్రేమ్ మరణానికి కారణమైన నలుగురిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ కుటుంబసభ్యులు పేర్కొన్నారు. -
ఎంతటి దా‘రుణం’
తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వేధింపులకు తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్ఎన్ కాలనీలో వీరమళ్ల కనకదుర్గ బలి కావడంతో మిగిలిన బాధితుల్లో చలనం వచ్చింది. వడ్డీ వ్యాపారుల దారుణాలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఒక్క గురువారం నాడే సుమారు 30 మంది రూరల్ పోలీసులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలనీ బాధితుల మయం తామర తంపరలుగా వస్తున్న ఈ ఫిర్యాదులపై వాస్తవ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు రూరల్ ఏఎస్సై కమ్ముల వెంకటేశ్వరరావు కేఎస్ఎన్ కాలనీకి వెళ్లారు. బాధితుల నుంచి సంపూర్ణ సమాచారాన్ని లిఖితపూర్వకంగా సేకరించారు. ఈ కాలనీలో సుమారు 300కు పైగా ఇళ్లున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించి.. వారికి పునరావాసంగా ఈ కాలనీలో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉండగా జాతీయ రహదారి బైపాస్ పక్కన ఇక్కడ స్థిరపడ్డారు. వీరంతా అవసరార్థం అప్పులు చేసి వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకున్నారు. పదేళ్ల క్రితం ఇక్కడ చిరు వ్యాపారంగా రూపుదిద్దుకున్న వడ్డీ దందా నేడు మహా రక్కసిగా మారి పచ్చని కుటుంబాల్లో విషం చిమ్ముతోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతంలోని చాలామంది వడ్డీ వ్యాపారులకు కేఎస్ఎన్ కాలనీ వడ్డీల వర్షం కురిపించే కల్పవల్లిగా మారింది. పెద్దల ముసుగులో ఉన్న కొందరు ఈ దందాకు సహకారం అందిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. వంద ఇళ్లు వడ్డీ వ్యాపారుల పాలు రూ.వెయ్యి అప్పు ఇచ్చి.. రూ.లక్ష ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని కొందరు, బెదిరించి ఆస్తిని తనఖా చేయించుకున్నారని మరికొందరు.. ఇలా ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గురువారం రావడం కనిపించింది. పదేళ్లుగా ఈ కాలనీలోని సుమారు వంద గృహాలు వడ్డీ వ్యాపారుల సొంతమైనట్టు సమాచారం. అక్కడి నుంచి అనేక చేతులు మారినట్టు తెలిసింది. పట్టణంలోని ప్రధాన కూడలికి సమీపంలో ఒక మహిళ నూటికి ఆరు రూపాయల వడ్డీపై కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితులు రుణవిముక్తి పొందలేక.. వ్యాపారుల వేధింపులు తాళలేక చావే శరణ్యమనే స్థితికి వచ్చినట్టు తెలిసింది. కనకదుర్గ ఉదంతం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులు లోతైన దర్యాప్తుచేసి వడ్డీ జలగల పీచమణచాలని బాధిత కుటుంబాలు ప్రాథేయపడుతున్నాయి.