తాడేపల్లిగూడెం : కాల్‌మనీ వేధింపులకు తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు శివారు కేఎస్‌ఎన్ కాలనీలో వీరమళ్ల కనకదుర్గ బలి కావడంతో మిగిలిన బాధితుల్లో చలనం వచ్చింది. వడ్డీ వ్యాపారుల దారుణాలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. ఒక్క గురువారం నాడే సుమారు 30 మంది రూరల్ పోలీసులను ఆశ్రయించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఆ కాలనీ బాధితుల మయం
తామర తంపరలుగా వస్తున్న ఈ ఫిర్యాదులపై వాస్తవ సమాచారాన్ని క్షేత్ర స్థాయిలో సేకరించేందుకు రూరల్ ఏఎస్సై కమ్ముల వెంకటేశ్వరరావు కేఎస్‌ఎన్ కాలనీకి వెళ్లారు. బాధితుల నుంచి సంపూర్ణ సమాచారాన్ని లిఖితపూర్వకంగా సేకరించారు. ఈ కాలనీలో సుమారు 300కు పైగా ఇళ్లున్నాయి. పట్టణంలోని రైల్వేస్టేషన్ తదితర ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకుని ఉన్న వారిని ఖాళీ చేయించి.. వారికి పునరావాసంగా ఈ కాలనీలో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్యేగా ఉండగా జాతీయ రహదారి బైపాస్ పక్కన ఇక్కడ స్థిరపడ్డారు. వీరంతా అవసరార్థం అప్పులు చేసి వడ్డీ వ్యాపారుల ఉచ్చులో చిక్కుకున్నారు. పదేళ్ల క్రితం ఇక్కడ చిరు వ్యాపారంగా రూపుదిద్దుకున్న వడ్డీ దందా నేడు మహా రక్కసిగా మారి పచ్చని కుటుంబాల్లో విషం చిమ్ముతోంది. తాడేపల్లిగూడెం, పెంటపాడు ప్రాంతంలోని చాలామంది వడ్డీ వ్యాపారులకు కేఎస్‌ఎన్ కాలనీ వడ్డీల వర్షం కురిపించే కల్పవల్లిగా మారింది. పెద్దల ముసుగులో ఉన్న కొందరు ఈ దందాకు సహకారం అందిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
వంద ఇళ్లు వడ్డీ వ్యాపారుల పాలు
రూ.వెయ్యి అప్పు ఇచ్చి.. రూ.లక్ష ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని కొందరు, బెదిరించి ఆస్తిని తనఖా చేయించుకున్నారని మరికొందరు.. ఇలా ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి గురువారం రావడం కనిపించింది. పదేళ్లుగా ఈ కాలనీలోని సుమారు వంద గృహాలు వడ్డీ వ్యాపారుల సొంతమైనట్టు సమాచారం. అక్కడి నుంచి అనేక చేతులు మారినట్టు తెలిసింది. పట్టణంలోని ప్రధాన కూడలికి సమీపంలో ఒక మహిళ నూటికి ఆరు రూపాయల వడ్డీపై కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితులు రుణవిముక్తి పొందలేక.. వ్యాపారుల వేధింపులు తాళలేక చావే శరణ్యమనే స్థితికి వచ్చినట్టు తెలిసింది. కనకదుర్గ ఉదంతం దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. పోలీసులు లోతైన దర్యాప్తుచేసి వడ్డీ జలగల పీచమణచాలని బాధిత కుటుంబాలు ప్రాథేయపడుతున్నాయి.
ఎంతటి దా‘రుణం’
Published Fri, Jan 22 2016 12:19 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement
Advertisement