కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ! | Call Money Rocket In Krishna District: Top Moneylender blackmail, extortion | Sakshi
Sakshi News home page

కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ!

Published Mon, Dec 30 2019 8:18 AM | Last Updated on Mon, Dec 30 2019 8:34 AM

Call Money Rocket In Krishna District: Top Moneylender blackmail, extortion - Sakshi

టీడీపీ పెద్దల పేరు చెప్పి కృష్ణాజిల్లాలో ఓ బడా వడ్డీ వ్యాపారి అరాచకం

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) ‘‘అసలు ఏమనుకుంటున్నావ్‌ మా గురించి.. మా వెనకాల ఎవరెవరు ఉన్నారో, మా పరపతి ఏంటో తెలుసుగా.. వాళ్లతో ఉన్న ఫొటోలు పంపాను.. చూశావుగా? ఇంతకూ ఆ డబ్బులు ఎవరివో నీకు అర్థమవుతోందా.. పెద్దవాళ్లకు ఒక్కసారి చెబితే మీ కుటుంబమంతా మటాష్‌ అయిపోతుంది.. మీ ఇంట్లోని ఆడవాళ్లు కటకటాల వెనకుంటారు. పిల్లల భవిష్యత్తు నాశనమవుతుంది. అందుకే నోర్మూసుకుని చెప్పింది చేయ్‌.. అడిగింది ఇచ్చేయ్‌’’..  

.. ఇది బరితెగించిన ఓ బడా ‘కాల్‌’నాగు బాగోతం. ‘పచ్చ’కావరంతో పెచ్చుమీరిన దౌర్జన్యానికి పరాకాష్ట ఇది. అధికారం అండతో.. పెద్ద మనుషుల ముసుగులో జలగలా పీక్కుతింటున్న అప్పులోడి అరాచకం ఇది. ఇలా.. హద్దులు మీరి కొనసాగుతున్న హెచ్చరికలకు బెంబేలెత్తిపోయిన విజయవాడకు చెందిన ఓ రియల్టర్‌ తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించాలని ఇటీవల ‘స్పందన’లో వేడుకున్నారు. ఈ దారుణమైన కాల్‌మనీ కహానీ వివరాలు ఏంటంటే.. కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన వడ్డీ వ్యాపారి వర్లేపల్లి సీతారామమోహనరావు నుంచి భవన నిర్మాణం నిమిత్తం విజయవాడకు చెందిన రియల్టరు యార్లగడ్డ రవికిరణ్‌ కుటుంబం రూ.1.25 కోట్లను 2010 ఏప్రిల్‌లో అప్పుగా తీసుకుంది. 

చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం

ఇందుకుగాను సెక్యూరిటీ కింద కోల్‌కత–చెన్నై జాతీయ రహదారి–16ని ఆనుకుని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామ పరిధిలోని 81/2, 81/5, 81/7 సర్వే నెంబర్లలో ఉన్న ఏడు ఎకరాల స్థిరాస్తిని వడ్డీ వ్యాపారి తన భార్య అయిన లక్ష్మి, అమెరికాలో ఉంటున్న కుమారుడు శశికాంత్‌ వర్లేపల్లి, బంధువుల పేరిట జీపీఏ కమ్‌ సేల్‌ అగ్రిమెంట్‌ను ఏడు డాక్యుమెంట్లుగా చేయించుకున్నారు. దాంతోపాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్, లెడ్జర్‌పై సంతకాలు, బ్యాలెన్స్‌ అమౌంట్‌ రిసిప్ట్‌లు కూడా ముందుగానే తీసుకున్నారు. 2012 నుంచి 2014 మధ్య కాలంలో అసలుతోపాటు వందకు రూ.20 చొప్పన వడ్డీ చెల్లించడంతో అగ్రిమెంట్ల క్యాన్సిలేషన్‌ డీడ్స్‌ చేశారని.. కానీ,  రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్‌ చేయకుండా రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని రవికిరణ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. 
2014లో చంద్రబాబు సీఎం అయ్యాక.. 
ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో బాధ్యతలు చేపట్టాక కుంచనపల్లి వద్ద ఎన్‌హెచ్‌–16ను ఆనుకుని ఉన్న ఏడు ఎకరాలను డెవలప్‌మెంట్‌ కింద సినీనటుడు, నాటి తెలుగుదేశం ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి ప్రాపర్టీస్‌.. భూ యజమాని రవికిరణ్‌కు చెందిన బెస్ట్‌ ఫారŠూచ్యన్‌ సంస్థ మధ్య చర్చలు జరిగాయి. తన వ్యాపార ఒప్పందం కోసం అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్లను క్యాన్సిల్‌ చేయాలని వడ్డీ వ్యాపారిని రవికిరణ్‌ కోరగా.. తాను రూ.1.25 కోట్లు అప్పు ఇచ్చినందునే జయభేరి సంస్థతో ఒప్పంద అవకాశం వచ్చిందని, తనకూ వడ్డీతో పాటు మరింత లాభం చేకూర్చితేనే రిజిస్ట్రేషన్‌ క్యాన్సిల్‌తో పాటు ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్లు, బ్యాలెన్స్‌ అమౌంట్‌ రిసిప్ట్‌లు తిరిగి ఇచ్చేస్తానంటూ సీతారామమోహన్‌రావు అడ్డం తిరిగారు. 

అదే సమయంలో చంద్రబాబు, లోకేశ్‌లతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ భారత్, అమెరికాలో వారి ఆర్థిక లావాదేవీలు చూస్తున్నందున తమనెవరూ ఏమీ చేయలేరని హెచ్చరించారు. అంతటితో ఆగక.. తాము తలచుకుంటే డెవలప్‌మెంట్‌ ఒప్పందం జరగకుండా కూడా అడ్డుకోగలమని హెచ్చరించారని రవికిరణ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చేసేదేంలేక ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండానే బెస్ట్‌ ఫారూచ్యన్‌లో మూడు శాతం వాటా ఇచ్చామని.. ఆ తరువాతే జయభేరి ప్రాపర్టీస్‌తో ఒప్పందం కుదిరిందని రవికిరణ్‌ అందులో వివరించారు.  

చదవండిబాబుకే అప్పు ఇచ్చాం.. నన్ను ఏం చేయలేరు

మొత్తం వాటా  ఇవ్వాలని ఒత్తిడి 
ఒప్పందం ప్రకారం ఏడు ఎకరాలలో 9.30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం జరగాలి. అందులో 40 శాతం కింద భూ యజమానికి 3.60 లక్షల చ.అ వస్తుంది. ఇందులో బెస్ట్‌ ఫారŠూచ్యన్‌ కంపెనీ వాటా 1.30 లక్షల చ.అ. ఒక చ.అ ధర రూ.5,500 చొప్పున ఈ కంపెనీకి రూ.71.50 కోట్లు సమకూరుతుంది. తనకు రాసిచ్చిన మూడు శాతం కాకుండా బెస్ట్‌ ఫారŠూచ్యన్‌ వాటా మొత్తం తనకే ఇవ్వాలని సీతారామమోహన్‌రావు గత సర్కారు పెద్దల అండతో బెదిరింపులకు పాల్పడుతున్నారని రవికిరణ్‌ ఆరోపించారు. 

అంతేకాదు.. శశికాంత్‌కు చంద్రబాబు, లోకేశ్‌లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలియజెప్పేందుకు వారిద్దరితో శశికాంత్‌ ఉన్న ఫొటోలను తరచూ పంపేవారని తెలిపారు. అలాగే, భారత్, అమెరికాలో తాము వడ్డీలకు తిప్పుతున్న దాంట్లో ఎక్కువ మొత్తం లోకేశ్‌కు చెందినదేనని చెప్పేవారని రవికిరణ్‌ తన ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. అప్పటి డీజీపీ ఠాకూర్‌తో పలు దఫాలు ఫోన్‌లో మాట్లాడించారని కూడా తెలిపారు. మరోవైపు.. తనకన్నా ముందు గోదావరి జిల్లాకు చెందిన విద్యా సంస్థల యాజమాని అయిన మాజీ ఎమ్మెల్సీ.. ప్రముఖ దర్శకుడు, విజయవాడకు చెందిన మరో ఇద్దరు రియల్టర్లు, గుడివాడలోని ఇంజనీరింగ్‌ కాలేజీ యజమానితో పాటు పలువురు తనలాగే మోసపోయారన్నారు.   

పోలీసు ఉన్నతాధికారుల తీరెలా ఉందంటే.. 

  • ఈనెల 16న సీఎం కార్యాలయం వద్ద స్పందనలో రవికిరణ్‌ ఫిర్యాదు చేయగా విజయవాడ సీపీకి రిఫర్‌ చేశారు. 
  • 20న పటమట పోలీసుల నుంచి రవికిరణ్‌కు ఫోన్‌ వచ్చింది. ఆరో టౌన్‌ స్టేషన్‌కు బదిలీ అయింది. ఆ తరువాత స్పందన లేదు. 
  • 23న తాము ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసుల చర్యలేదని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దృష్టికి ఫిర్యాదిదారు తీసుకెళ్లారు. పరిశీలించాలని ఏఐజి రాజశేఖర్‌కు సూచనలు వెళ్లాయి. ఫిర్యాదు విచారణకు అర్హమైనదిగా నిర్ధారించారు.
  • 26న గుంటూరు అర్బన్‌ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదును పంపి విచారించాలని డీజీపీ గౌతం సవాంగ్‌ ఆదేశించారు. 
  • తనపై రవికిరణ్‌ ఫిర్యాదు చేశారని తెలుసుకున్న సీతారామమోహన్‌రావు.. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును కలిసి ఫిర్యాదు చేశారు.
  • దీనిపై పరిశీలించాలని టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ వీఎస్‌ఎన్‌ వర్మకు ఆదేశాలు వెళ్లాయి.  
  • కాగా, ఈ ఫిర్యాదు విషయంలో చూసీచూడనట్లు వెళ్లాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్దలు కొందరు రంగంలోకి దిగి పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఫిర్యాదులో పార్టీ పెద్దల పేర్లు కూడా ఉన్నందున తాము ఏదోలా సర్దుబాటు చేసుకుంటామని అంటున్నట్లు తెలియవచ్చింది. ఈ విషయమై డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించామన్నారు. ఇదే విషయమై విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావును అడగ్గా తనకు ఫిర్యాదు అందిందని, వాస్తవాలను తెలుసుకుంటామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement