సాక్షి, విజయవాడ : కాల్‌మనీ వ్యవహారం మరో నిండు ప్రాణం బలిగొంది. విజయవాడలో కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక ప్రేమ్ అనే వ్యక్తి ఆదివారం కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, తాను ఆత్మహత్యకు పాల్పడేముందు తన చావుకు కారణం కాసుల రంగారావు, కోలా కిరణ్, కోలా రాంబాబు, తుపాకుల మహేష్ అంటూ ఫోన్‌లో వీడియో తీసి వాట్సప్‌లో తన కుటుంబసభ్యులకు షేర్ చేశాడు. వారికి రూ. 16 లక్షల రూపాయలు కట్టానంటూ ఆ వీడియోలో కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. అయితే ఇదే విషయమై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వీడియోలో తెలిపాడు. అయితే పోలీసుల ముందే ఆ నలుగురు తనను కులం పేరుతో దూషించినా పోలీసులు ఏం పట్టనట్లు వ్యవహరించారని ప్రేమ్ ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. కాగా, తన భర్త మరణానికి కారణమైన నలుగురిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలంటూ కుటుంబసభ్యులు పేర్కొన్నారు.