
సాక్షి తాడేపల్లి : కాల్‌మనీ వేధింపులు తట్టుకోలేక బకింగ్‌హామ్‌కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్న వేములపూడి ప్రేమ్ కుమార్ (30) మృతదేహం మంగళవారం తెనాలి మండలం కొలకలూరు రైల్వే బ్రిడ్జి వద్ద లభించింది. విజయవాడ పటమటలో నివసించే ప్రేమ్ కుమార్ గుంటూరు జిల్లా సీతానగరం సమీపంలోని కొండవీటివాగు హెడ్‌స్లూయిస్ వద్ద డిసెంబర్ 28న బకింగ్‌హామ్ కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆచూకీ కోసం గాలిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది మంగళవారం కొలకలూరు రైల్వే బ్రిడ్జి సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. అనంతరం తాడేపల్లి తహసీల్దార్ శ్రీనివాసులురెడ్డికి సమాచారం ఇవ్వడంతో ఆయన విజయవాడలోని ప్రేమ్‌కుమార్ భార్య దిశిదాకృష్ణ, బంధువులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పటమట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ తరలించారు.
వడ్డీ వ్యాపారి బతకనివ్వట్లేదు!
‘పండూ.. వాడు పోలీసుల్ని కూడా కొనేశాడు. మనకిక న్యాయం జరగదు. బతకాలని ఉన్నా.. బతకనివ్వట్లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నన్ను క్షమించు..’ అంటూ ఓ యువకుడు తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్‌లో దూకిన ఘటన విజయవాడలో కలకలం రేపిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. విజయవాడలోని పటమటకు చెందిన ప్రేమ్‌కుమార్, అతని సోదరి జ్యోతి కలిసి ఇద్దరి ఇళ్లను అదే ప్రాంతానికి చెందిన కాసుల వెంకట రంగారావు అనే వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి 2017వ సంవత్సరంలో రూ.6 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొదట్లో రూ.3 వడ్డీ అని చెప్పిన రంగారావు.. ఆ తర్వాత వడ్డీ రేటును రూ.10కి పెంచాడు.
చదవండి: ప్రాణం తీసిన కాల్‌మనీ వ్యవహారం
ప్రేమ్ కుమార్, జ్యోతి వడ్డీ మొత్తంతోపాటు అసలు మొత్తంలో రూ.5 లక్షలు చెల్లించేశారు. చివరకు రూ.లక్ష అప్పు ఉండగా.. దానిని కూడా త్వరలో చెల్లిస్తామని, ఈలోపు తమ ఇళ్లకు సంబంధించిన పత్రాలు తిరిగివ్వాలని రంగారావును కోరగా.. ఇంకా రూ.16 లక్షలు బకాయి ఉన్నారని, ఆ మొత్తం చెల్లిస్తేనే పత్రాలిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదే విషయాన్ని ప్రేమ్‌కుమార్ ఈ నెల 16న స్పందన కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. స్పందించిన సీపీ ద్వారకా తిరుమలరావు ఆ ఫిర్యాదు పరిష్కరించాలని పటమట పోలీసులకు ఆదేశాలిచ్చారు.
ఫలితం లేకపోవడంతో ప్రేమ్‌కుమార్ 23వ తేదీన మరోసారి స్పందనలో సీపీకి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత వడ్డీ వ్యాపారి ప్రేమ్‌కుమార్‌పై కిరాయి గుండాలతో దాడి చేయించాడు. ఈ విషయాన్ని కూడా స్థానిక పోలీసులకు చెప్పినా పట్టించుకోవట్లేదని ప్రేమ్‌కుమార్ కుటుంబ సభ్యులతో చెప్పాడు. ఇక ఎక్కడికి వెళ్లినా తనకు న్యాయం జరగదని ఆవేదన చెందిన అతడు ఈనెల 28న సాయంత్రం తన భార్యకు సెల్ఫీ వీడియో పంపించి బకింగ్‌హామ్ కెనాల్‌లో దూకేశాడు.
చదవండి: కాల్‌మనీ.. ఇదో దారుణ కహానీ!
Comments
Please login to add a commentAdd a comment