ఇళ్ల పట్టాల వ్యవహారం మళ్లీ మొదటికి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/ సదాశివపేట: ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అట్టహాసంగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 5,300 మందికి పట్టాల పంపిణీ చేయగా వీటిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని, అనర్హులకు, జిల్లాయేతరులకు కూడా పట్టాలిచ్చారని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లారు.
రెవెన్యూ రికార్డుల నుంచి సేకరించిన ప్రాథమిక ఆధారాలను కూడా ఆయన ముఖ్యమంత్రికి అందజేశారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ పాత పట్టాల కేటాయింపును రద్దు చేసి, తిరిగి అర్హులైన వారికి కొత్త పట్టాలు ఇవ్వాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ శరత్‌ను ఆదేశించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
2013లో అట్టహాసంగా పంపిణీ
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి 2013 అక్టోబర్ 5న సదాశివపేట పట్టణానికి ఆనుకొని ఉన్న సిద్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని స్థలాన్ని ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున కేటాయించి 5,300 మందికి పట్టాలను పంపిణీ చేశారు. ఇందుకోసం 160 మంది రైతుల నుంచి 184 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా సేకరించారు. రైతుల ఆధీనంలో ఉన్న ఈ భూమికి ఎకరాలకు రూ.3 లక్షల చొప్పున నష్టపరిహారంతో పాటు భూమి కోల్పోయిన వారికి ఇంటి స్థలం ఇచ్చేందుకు రెవిన్యూ అధికారులు అంగీకరించారు.
కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం కేవలం రూ. 5.52 కోట్లు మాత్రమే నిధులను మంజూరు చేయడంతో గత అక్టోబర్‌లో ఎకరానికి రూ. 2.56 లక్షల చొప్పున అధికారులు చెల్లించారు. ఒప్పందం మేరకు మిగిలిన డబ్బు కూడా చెల్లించాలని రైతులు ఆందోళన చేస్తుండగానే.. 130 ఎకరాల భూమిలో గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖల అధికారులు లే అవుట్‌ను రూపొందించారు. మరో 54 ఎకరాల్లో లేఅవుట్ చేయవలసి ఉంది.
ఆది నుంచీ వివాదమే
2007లో కూడా ఈదులవాగు సమీపంలోని ప్రభుత్వ భూమిలో 2,000 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఇక్కడ గృహ నిర్మాణం చేసేందుకు అనువుగా లేదన్న కారణంతో ఈదుల వాగు పట్టాలు రద్దు చేసి వారికి కూడా ఇక్కడే పట్టాలిచ్చారు. ఇక మిగిలిన 3,300 పట్టాల్లో దాదాపు 80 శాతం పట్టాలు అక్రమార్కుల చేతిల్లోకే వెళ్లిపోయినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. 1,300 పట్టాల్లో అప్పటి తహశీల్దార్ శంకరప్ప ఎలాంటి అర్హతా పత్రాలను పరిశీలించకుండా ఎమ్మెల్యే సూచనల మేరకు అనర్హులకు పట్టాలు మంజూరు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
వీళ్లు కాకుండా సంగారెడ్డి పట్టణం, అందోల్ నియోజకవర్గంలోని మునిపల్లి మండలం, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వ్యక్తులు కూడా పట్టాలు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాకుండా పట్టణంలోని 23 వార్డుల పరిధిలోని కాంగ్రెస్ ముఖ్య నాయకులకు ఒక్కొక్కరికి 20 చొప్పున ఖాళీ పట్టా సర్టిఫికెట్లను అందజేయగా, వాళ్లు తమకిష్టమైన వారికి, డ బ్బులు ఇచ్చిన వారిపేర్లతో పట్టాలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో ఈ అక్రమాలపై ఎమ్మెల్యే చింత ప్రభాకర్ జిల్లా కలెక్టర్‌కు, ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడంతో వాటిని రద్దు చేయాలని సర్కార్ నిర్ణయించింది.