Cancer Care Center
-
అమెరికాలో శివరాజ్‌కుమార్.. క్యాన్సర్‌కు శస్త్రచికిత్స పూర్తి
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల భైరతి రంగల్ చిత్రంలో కనిపించిన ఆయన వైద్య చికిత్స కోసం అమెరికాకు వెళ్లారు. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు. ఏయిర్పోర్ట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ సర్జరీ కోసం యూఎస్ వెళ్తున్నట్లు ప్రకటించారు.అయితే తాజాగా ఆయనకు సర్జరీ విజయవంతంగా పూర్తయినట్లు ఆయన కూతురు నివేదిత శివరాజ్‌కుమార్ వెల్లడించారు. దేవుని దయతో మా నాన్నకి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని ట్విటర్ ద్వారా లేఖ విడుదల చేసింది. అంతేకాకుండా ఆయన భార్య గీతా మాట్లాడిన వీడియోను ఓ అభిమాని ట్విటర్లో షేర్ చేశారు. మరికొద్ది రోజుల్లో శివ రాజ్‌కుమార్ తన అభిమానులతో మాట్లాడతారని తెలిపింది. ఈ సందర్భంగా మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన భార్య గీతా శివరాజ్‌కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 24న యూఎస్‌లోని మియామీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో మూత్రాశయ క్యాన్సర్‌కు విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.ప్రస్తుతం శివరాజ్‌కుమార్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు లేఖలో ఆయన కుమార్తె ప్రస్తావించారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలు, మద్దతుకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. సర్జరీకి ముందు శివ రాజ్‌కుమార్‌కు ఆరోగ్యం చేకూరాలని కోరుతూ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిసారిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ చిత్రం నవంబర్ 15న విడుదలైంది. ఆయన ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో నటిస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ ఆర్సీ16లోనూ కనిపించనున్నారు. Thank You #Geethakka ❤🙏🏼 You Stood with Anna ❤❤❤ Take Rest and Get Well Soon #Shivanna ❤🥹 We Will be waiting for to welcome you on Jan 26th 😍Special thanks to doctor's🙏🏼 #DrShivarajkumar #Shivarajkumar #ShivaSainya @NimmaShivanna ❤❤❤ @ShivaSainya pic.twitter.com/isgcCcC520— ShivaSainya (@ShivaSainya) December 25, 2024 It is the prayers and love of all the fans and our loved ones that have kept us going through tough times. Thank you for your support!✨ pic.twitter.com/eaCF7lqybc— Niveditha Shivarajkumar (@NivedithaSrk) December 25, 2024 -
Andhra Pradesh: కీలక ముందడుగు.. సమగ్ర క్యాన్సర్ కేర్‌కు రోడ్ మ్యాప్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటు.. వ్యాధి నియంత్రణ, నివారణకు కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్‌ను అమలుచేయడానికి రోడ్‌మ్యాప్ ఖరారైంది. ఇందులో భాగంగా తొలిదశ కింద 2022–24లో ఏడు ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో రూ.119.58 కోట్లతో మౌలిక వనరుల అభివృద్ధికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెండో దశలో మిగిలిన ఆస్పత్రుల్లో క్యాన్సర్ వైద్య సదుపాయాలను ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స మౌలిక సదుపాయాలను ఏపీ కోల్పోయింది. దీనికితోడు గత టీడీపీ సర్కార్ హయాంలో ప్రభుత్వాస్పత్రులను పూర్తిగా నిర్లక్ష్యంచేశారు. దీంతో క్యాన్సర్ చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న సీఎం వైఎస్ జగన్.. ప్రభుత్వ రంగంలో క్యాన్సర్ చికిత్స సదుపాయాలు, బలోపేతం, వ్యాధి నియంత్రణ చర్యలపై దృష్టిసారించారు. అంతేకాక.. వ్యాధిని సమర్థవంతంగా నియంత్రించడానికి క్యాన్సర్‌ను నోటిఫైడ్ జబ్బుల జాబితాలోకి చేర్చారు. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును కాంప్రెహెన్సివ్ క్యాన్సర్ కేర్ సలహాదారుగా నియమించారు. ఈయనతో పాటు మరికొందరు మేధావుల నుంచి సలహాలు, సూచనలు సేకరించారు. ఈ క్రమంలో ప్రజలకు ప్రాథమిక క్యాన్సర్ చికిత్స అందుబాటులోకి తేవడంతో పాటు, క్యాన్సర్ రోగులు చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే పనిలేకుండా అడ్వాన్స్డ్ చికిత్సను అందుబాటులోకి తేవడంపై చర్యలకు ఉపక్రమించారు. రూ.74.08 కోట్లతో పరికరాల ఏర్పాటు విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాల పరిధిలోని చినకాకాని క్యాన్సర్ ఆస్పత్రి, అనంతపురం, కాకినాడ జీజీహెచ్‌లకు లినాక్, సీటీæ సిమ్యులేటర్, బ్రాకీథెరపీ, మామోగ్రామ్ పరికరాలు, గుంటూరు జీజీహెచ్‌కు మామోగ్రామ్, ఇతర పరికరాలు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు రూ.61.93 కోట్లు ఖర్చుచేయనుంది. అదే విధంగా రూ.12.15 కోట్లతో శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు జీజీహెచ్లలోనూ లినాక్, ఇతర పరికరాలు సమకూర్చడానికి ఏర్పాట్లుచేయనున్నారు. ఈ క్రమంలో ఆయా ఆస్పత్రుల్లో లినాక్, సీటీ సిమ్యులేటర్ పరికరాల ఏర్పాటుకు బంకర్ల నిర్మాణం, ఇతర పనులు రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆధునిక టెక్నాలజీతో రేడియేషన్ క్యాన్సర్ బాధితులకు రేడియేషన్ థెరపీ అందించడానికి ప్రస్తుతం నడుస్తున్న ఆధునిక టెక్నాలజీలో లినాక్ కీలకమైనది. క్యాన్సర్ చికిత్సకు పేరొందిన టాటా మెమోరియల్, సహా ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లో లినాక్ను వినియోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 ప్రభుత్వ బోధనాసుపత్రులు ఉన్నాయి. వీటిలో కేవలం గుంటూరు జీజీహెచ్‌లో మాత్రమే క్యాన్సర్ చికిత్సకు వినియోగించే అధునాతన లినాక్ అందుబాటులో ఉంది. గుంటూరు మినహా మిగిలిన చోట్ల క్యాన్సర్‌కు కోబాల్ట్ థెరపీ యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో క్యాన్సర్ కణితి ఉన్న ప్రాంతంతోపాటు శరీరంలోని ఇతర భాగాలు రేడియేషన్‌కు ప్రభావితం అవుతాయి. అదే లినాక్ ద్వారా రేడియేషన్‌లో కణితిపై ఎక్కువ డోసుతో రేడియేషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. మిగిలిన రూ.45.5 కోట్లతో ఇలా.. ఇక ఏడు బోధనాస్పత్రుల్లో ఆపరేషన్ థియేటర్ల అభివృద్ధి, సర్జికల్ పరికరాలు సమకూర్చడానికి రూ.21కోట్లు కేటాయించారు. అదే విధంగా పాథాలజీ యూనిట్ల అభివృద్ధికి రూ.10.50 కోట్లు.. మందులు, కీమోథెరపీకి అవసరమయ్యే సదుపాయాల కల్పనకు రూ.14 కోట్లు ఖర్చుచేస్తారు. అదే విధంగా వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బందికి పాలియేటివ్ కేర్, ప్రివెంటివ్ అంకాలజీలో ప్రత్యేక శిక్షణనిస్తారు. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం తొలి నుంచి మా ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే రూ.16వేల కోట్లకు పైగా నిధులతో నాడు–నేడు కింద 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం, ప్రభుత్వాస్పత్రుల బలోపేతం చేస్తున్నాం. తాజాగా మరో రూ.119.58 కోట్ల కాంప్రెహెన్సివ్ కేర్ అమలుకు శ్రీకారం చుట్టాం. – విడదల రజిని, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి అత్యాధునిక పరికరాలు సమకూరుస్తున్నాం రూ.119.58 కోట్లతో తొలిదశ కాంప్రెహెన్సివ్ కేర్ అభివృద్ధికి అనుమతులిచ్చాం. ఇదికాకుండా కర్నూలు జీజీహెచ్, విశాఖ కేజీహెచ్‌లకు రూ.71 కోట్లతో అత్యాధునిక పరికరాలు సమకూర్చడానికి చర్యలు తీసుకున్నాం. ఈ రెండు ఆస్పత్రులకు లినాక్, బ్రాకీథెరపీ, పెట్‌సీటీ, సీటీ సిమ్యులేటర్ పరికరాలు సమకూర్చనున్నాం. పరికరాల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. – ఎంటీ కృష్ణబాబు, ముఖ్యకార్యదర్శి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ -
అన్ని క్యాన్సర్లకూ ఆరోగ్యశ్రీ
దేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. క్యాన్సర్ బాధితుల సంరక్షణ, చికిత్సపై సీఎం జగన్ దూరదృష్టి అభినందనీయం. రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి సీఎం శ్రీకారం చుట్టారు. – డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు సాక్షి ప్రతినిధి, తిరుపతి: క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా ఆరోగ్యశ్రీని వర్తింపజేసి, పేదలందరికీ ఉచితంగా వైద్య సౌకర్యం అందించాలనేదే తమ లక్ష్యమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో టాటా సంస్థ అద్భుతమైన క్యాన్సర్ ఆస్పత్రిని తిరుపతిలో ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. తిరుపతి జూపార్క్ రోడ్లో టీటీడీ సహకారంతో టాటా సంస్థ ఆధ్వర్యంలో రూ.190 కోట్లతో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (స్వీకార్)ను గురువారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రేడియాలజీ విభాగంలో రోగుల కోసం అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేసిన క్యాబిన్లు, వైద్య పరికరాలను, చికిత్సా విధానాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి భరోసా ఇవ్వడమే లక్ష్యమని, రానున్న రోజుల్లో ఆంకాలజీ విభాగంలో అన్ని రకాల సేవలు వర్తింపజేయాలని భావిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సమగ్రమైన క్యాన్సర్ చికిత్స అందించాలన్నది తమ లక్ష్యమని, ఇందులో భాగంగా అన్ని రకాల క్యాన్సర్లకు ఒకే గొడుగు కింద ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్క రోగి కూడా క్యాన్సర్‌తో చనిపోకూడదని, చికిత్స కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లకూడదనేది తమ అంతిమ లక్ష్యమని చెప్పారు. క్యాన్సర్ కేర్, అడ్వాన్స్డ్ ఆసుపత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్, చిత్రంలో మంత్రులు, ఆసుపత్రి బృందం క్యాన్సర్ చికిత్సపై దృష్టి పెట్టిన ఏకైక రాష్ట్రం ఏపీ ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మూడు సమగ్ర క్యాన్సర్ ఆసుపత్రుల నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. క్యాన్సర్ సంరక్షణ, చికిత్సపై సీఎం దూరదృష్టి అభినందనీయమన్నారు. పీడియాట్రిక్ ఆంకాలజీ సెంటర్, ప్రివెంటివ్ ఆంకాలజీ, సెంటర్ ఫర్ పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తూ.. భారతదేశంలో క్యాన్సర్ చికిత్స ప్రాముఖ్యతను గుర్తించిన ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని చెప్పారు. టాటా ట్రస్ట్ సీఈవో ఎన్.శ్రీనాథ్, స్వీకార్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ వీఆర్.రమణన్, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కేఎస్ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్యాన్సర్‌పై యుద్ధం..మాస్ స్క్రీనింగ్ దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరో ముఖ్యమైన అంశంపై దృష్టిపెట్టింది. దేశంలో గుండెపోటు తర్వాత ఎక్కువ మరణాలు సంభవిస్తున్న క్యాన్సర్ మహమ్మారిపై యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్ కేర్)గా నియమించింది. ఆయన ప్రభుత్వానికి పలు సలహాలు, సూచనలు తెలియజేశారు. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి (ఓరల్) క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార (సర్వైకల్), రొమ్ము (బ్రెస్ట్) క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. గుంటూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో ఇటీవల వైద్య ఆరోగ్య శాఖ పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. గ్రామంలో సచివాలయం యూనిట్‌గా మొబైల్ మెడికల్ యూనిట్ (ఎంఎంయూ) సాయంతో ముగ్గురు గైనకాలజీ, ముగ్గురు అంకాలజీ వైద్యులు గత శనివారం స్క్రీనింగ్ నిర్వహించారు. గ్రామంలో 2,400 మంది జనాభా ఉండగా వీరిలో 30 నుంచి 60 ఏళ్లు పైబడిన మహిళలు 640 మందికి ఉన్నారు. వీరందరికీ స్క్రీనింగ్ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుని గ్రామ వలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ, ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. 240 మంది మహిళలు స్క్రీనింగ్‌కు ముందుకొచ్చారు. ప్రాథమిక పరీక్షల అనంతరం రొమ్ము క్యాన్సర్ అనుమానిత లక్షణాలున్న 70 మందికి వైద్యులు ఎంఎంయూలోనే మామోగ్రామ్ పరీక్ష చేశారు. అదేవిధంగా 117 మందికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నిర్ధారణకు సంబంధించిన పాప్‌స్మియర్ పరీక్ష నిర్వహించారు. రిపోర్ట్‌లన్నింటీని గుంటూరు జీజీహెచ్‌లోని నాట్కో క్యాన్సర్ కేర్ విభాగానికి తరలించారు. ఇక్కడి నిపుణుల పరిశీలన అనంతరం బయాప్సీ ద్వారా వ్యాధిని నిర్ధారించనున్నారు. అదే విధంగా స్వచ్ఛందంగా వచ్చిన 27 మంది పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు చేయగా ఇద్దరికి అనుమానిత లక్షణాలున్నట్లు గుర్తించారు. ఈ పైలట్ ప్రాజెక్టులో గుర్తించిన అంశాల వారీగా రాష్ట్రవ్యాప్తంగా మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు వైద్య శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌కుమార్ నేతృత్వంలోని కోర్ కమిటీ ప్రణాళిక సిద్ధంచేసింది. మాస్ స్క్రీనింగ్ నిర్వహణకు మూడు విధానాలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. సచివాలయం యూనిట్‌గా స్క్రీనింగ్ నిర్వహణ సచివాలయం యూనిట్‌గా మాస్ స్క్రీనింగ్ నిర్వహణ చేపట్టబోతున్నాం. అనంతరం గుర్తించిన క్యాన్సర్ రోగులను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ద్వారా దగ్గరలోని నెట్వర్క్ ఆసుపత్రికి తరలిస్తాం. ఆసుపత్రిలో వీరికి ప్రభుత్వమే ఉచితంగా క్యాన్సర్ చికిత్స అందిస్తుంది. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న రోగుల ఆరోగ్య పరిస్థితిని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఎంలు వాకబు చేస్తారు. – నవీన్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి -
ఘనంగా ‘డీఎస్ రీసెర్చ్’ వార్షికోత్సవం
ముంబై: కేన్సర్ నిర్మూలనకు విశేష కృషిచేస్తున్న డీఎస్ రీసెర్చ్ సెంటర్ ముంబై శాఖ ఏడో వార్షికోత్సం గురువారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా బాంద్రాలోని డా.ఎర్నెస్ట్ బోర్జెస్ మెమొరియల్ హోమ్‌కు వెళ్లిన డీఎస్ రీసెర్చ్ బృందం అక్కడి కేన్సర్ పేషెంట్లతో సరదాగా గడిపింది. మిమిక్రీ కళాకారుడు సాగర్ పటేల్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డీఎస్ రీసెర్చ్ కేంద్రంలో చికిత్స పొంది కేన్సర్ నుంచి బయటపడిన వారు అక్కడి పేషెంట్లలో స్ఫూర్తి నింపేలా ప్రసంగించారు. -
కేన్సర్ కేర్‌పై టాటా ట్రస్ట్‌తో ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: కేన్సర్ వ్యాధి, గుర్తింపు, నివారణ చర్యల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సమగ్ర క్యాన్సర్ కేర్ మేనేజ్మెంట్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం టాటా మెమోరియల్ ట్రస్ట్‌తో అండర్ స్టాండింగ్ మెమోరాండంపై సంతకాలు చేసింది. క్యాన్సర్‌ను ప్రాథమికంగానే గుర్తించాలనే ప్రథాన లక్ష్యంతో పాటు అన్ని స్థాయిల్లోనూ ఆరోగ్య సంరక్షణ అందిచాలనేది లక్ష్యంగా పెట్టుకుంది. శంషాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి కే టి రామారావు, ఆరోగ్య మంత్రి సి. లక్ష్మా రెడ్డి, టాటా గ్రూపు చైర్మన్ రతన్ టాటా సమక్షంలో దీనిపై సంతకాలు చేశారు. ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, టాటా మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా, నగరంలోని రెండు ప్రముఖ సూపర్-స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎంఎన్‌జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్ ) రెఫరల్ ఆధారంగా క్లిష్టమైన కేసులను పరిశీలిస్తాయి. దీనికి అదనంగా, జిల్లా ప్రధాన కార్యాలయంలోని ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ, కీమోథెరపీ లాంటి సేవలు లభించనున్నాయి. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేన్సర్‌కు సంబంధించిన రాష్ట్రంలో అత్యధికంగా క్యాన్సర్‌కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రారంభ దశలో వివిధ రకాలైన క్యాన్సర్లను మేము నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తద్వారా నోటి, రొమ్ము , గర్భాశయ కేన్సర్లను ఆరంభ దశలో గుర్తించి, విశ్లేషించడంతోపాటు, రోగులకు మెరుగైన సేవలందించేందకు సహాయపడుతుందన్నారు. క్యాన్సర్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించిందని ప్రిన్సిపల్ కార్యదర్శి శాంతి కుమారి చెప్పారు. రోగులపై మెడికల్ పరీక్షలు జరిపారని ఆమె పేర్కొన్నారు. నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ రోగులకు క్యాన్సర్ చికిత్స అందుబాటులో ఉందని చెప్పారు. క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో టాటా ట్రస్ట్ పబ్లిక్ హెల్త్ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం పట్ల టాటా గ్రూపు ఛైర్మన్ రతన్ టాటా సంతోషం వ్యక్తం చేశారు. తాజా ఒప్పందంతో కేన్సర్ రోగులకు ప్రస్తుత ప్రజారోగ్య వ్యవస్థలోనే మెరుగైన చికిత్స లభిస్తుంది. క్యాన్సర్ రోగులు క్లిష్ట సమయాల్లో తప్ప.. ఇతర విషయాలకు హైదరాబాద్‌కు రావాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. అసోం, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో కేన్సర్ కేర్ కార్యక్రమాల అమలు వివిధ దశల్లో ఉన్నాయని టాటా వివరించారు. -
అమరావతిలో అమెరికన్ క్యాన్సర్ కేర్ సెంటర్
త్వరలో విశాఖకు విస్తరణ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ కొత్త క్యాన్సర్ కేర్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇక్కడి ఎన్నారై హాస్పిటల్లో వంద పడకల ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో పూర్తి స్థాయిలో క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నామని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (ఏఓఐ) ఒక ప్రకటనలో తెలిపింది. పాశ్చాత్య దేశాల ప్రమాణాలకు తీసిపోకుండా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను పూర్తి స్థాయిలో అందించడమే లక్ష్యమని ఏఓఐ ఈడీ జోసెఫ్ ఏ.నికొలస్ తెలిపారు. త్వరలో విశాఖపట్టణం, తదితర నగరాలకు విస్తరించనున్నామని పేర్కొన్నారు.