car robbery
-
భార్యను తీసుకొని ఆసుపత్రికి వెళితే.. కారుతో డ్రైవర్ ఉడాయింపు
సాక్షి, నెల్లూరు: కారుతో ఉడాయించిన డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. ఆత్మకూరులో లైన్మెన్గా పనిచేస్తున్న అదే మండలం అప్పారావుపాళేనికి చెందిన పెంచలయ్యకు హ్యుండయ్ వెన్యూ కారు ఉంది. యాక్టింగ్ డ్రైవర్‌గా అప్పారావుపాళేనికి చెందిన బాలకృష్ణ పనిచేసేవారు. డయాలసిస్ నిమిత్తం పెంచలయ్య, ఆయన భార్యను ఆస్పత్రికి కారులో సోమవారం తీసుకొచ్చారు. వారు ఆస్పత్రి లోపలికి వెళ్లగా, అదునుగా భావించిన బాలకృష్ణ కారుతో ఉడాయించాడు. రాత్రి ఏడు గంటలకు బయటకొచ్చిన పెంచలయ్య ఆయనకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. బెంగళూరు సమీపంలోని టోల్‌ప్లాజాను కారు దాటినట్లు పెంచలయ్య ఫోన్‌కు మంగళవారం ఉదయం మెసేజ్ వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్గామిట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వీడు గజదొంగ గంగన్నా!.. పోలీసులకే కాల్ చేసి సవాల్?
సాక్షి, హైదరాబాద్: అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ లగ్జరీ కార్లను అపహరిస్తున్న చోరుడిని పట్టుకోవడంలో పోలీసులు చేతులెత్తేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బంజారాహిల్స్ రోడ్ నెం. 2లోని పార్క్ హయత్ హోటల్లో గత జనవరి 26న రాత్రి కన్నడ నిర్మాత వి.మంజునాథకు చెందిన ఫార్చునర్ కారు (కేఏ 04 ఎంఎక్స్ 1000)ను దొంగిలించి పరారైన ఈ దొంగను పట్టుకోవడానికి స్థానిక పోలీసులు యత్నిస్తుండగానే మళ్లీ గత మే నెలలో నాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో, ఆగస్టు 5వ తేదీన బౌరంపేటలో రెండు కార్లను అపహరించాడు. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! ► పార్క్ హయత్ హోటల్లో దొంగతనం చేసిన తర్వాత నిందితుడి కోసం బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి గాలించగా ఇంటర్‌స్టేట్ కార్ల దొంగ సత్యేంద్రసింగ్ షెకా వత్‌గా గుర్తించారు. గతంలో ఢిల్లీ, మహా రాష్ట్ర, గుజరాత్ పోలీసులు ఇతగాడిని అరెస్ట్ చేసినట్లు కూడా తేలింది. బెయిల్‌పై విడుదలైన షెకావత్ కన్ను హైదరాబాద్‌పై పడింది. ► నాలుగు నెలల క్రితమే బంజారాహిల్స్ పోలీసులు ఈ కార్ల దొంగను పట్టుకోవడానికి రాజస్థాన్‌కు వెళ్లారు. ‘నన్ను పట్టుకునే దమ్ము ఉందా’ అంటూ పోలీసులకే సవాల్ విసి రాడు. ‘నేను ఇక్కడే ఉన్నాను. పట్టుకోండి చూద్దాం’ అంటూ ఇంటర్నెట్ వాట్సాప్ కాల్లో సవాల్ విసిరి తప్పించుకున్నాడు. ► పోలీసులు వారం రోజుల పాటు అక్కడ తిష్టవేసి షెకావత్ తండ్రిని ప్రశ్నించారు. అతని భార్యతో కూడా మాట్లాడారు. వారి కదలికలపై దృష్టి పెట్టిన విషయాన్ని షెకావత్ గుర్తించి నేరుగా బంజారాహిల్స్ పోలీసులకే ‘నన్ను పట్టుకోవడం మీ తరం కాదంటూ మరోసారి సవాల్ విసిరాడు. మీరు వాడుతున్న టెక్నాలజీ చాలా పాతదని అప్డేట్ అవ్వాలని ఆ తర్వాతే తనను పట్టుకోగలుగుతారని హెచ్చరించారు. దీంతో పోలీసులు వెనక్కి వచ్చారు. చదవంండి: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు ► నిందితుడిని పట్టుకునేందుకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, బంజారాహిల్స్ పోలీసులు ప్రయత్నాలు సాగిస్తుండగానే నగర శివార్లలో మరో రెండు ఖరీదైన కార్లను చోరీ చేయడం కలకలం రేపింది. నాచారం పరిధిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు చెందిన ఇసుజు వాహనాన్ని తస్కరించిన షెకావత్ కోసం నాచారం పోలీసులు ఇటీవల జైపూర్ వెళ్లారు. ► భర్తకు సహకరిస్తున్న షెకావత్ భార్యను అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చేందుకు ప్రయతి్నంచారు. ఆమెకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో వారి ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆగస్టు 5న దుండిగల్ పోలీస్ స్టేషన్పరిధిలోని బౌరంపేటలో ఓ గేటెడ్ కమ్యూ నిటీలో నివాసం ఉంటున్న గ్లాండ్ ఫార్మా సంస్థకు చెందిన డీజీఎం రవీంద్ర వర్మ కారును కూడా టెక్నాలజీ సహాయంతో షెకావత్ తస్క రించాడు. ఈ కేసులో కూడా సైబరాబాద్ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. చదవండి: ప్రియుడి ఘాతుకం: నడిరోడ్డుపై యువతి దారుణ హత్య ►ఇప్పటిదాకా దేశంలోని పలు నగరాల్లో షెకావత్ వందకుపైగా కార్లను తస్కరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. తస్కరించిన కార్లను డ్రగ్ డీలర్లు, ఉమెన్ ట్రాఫికింగ్ కోసం పని చేస్తున్న వారికి అమ్ముతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ► దొంగిలించిన కార్లను స్వయంగా నడుపుకొంటూ వెళ్లి గుర్తు తెలియని ప్రాంతంలో కొన్నాళ్లు ఉంచిన తర్వాత తాపీగా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. పలు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్న షెకావత్‌ను ఎవరు పట్టుకుంటారో వేచి చూడాల్సిందే. -
మాయగాడు; చదువు బీటెక్.. చోరీల హైటెక్
సాక్షి, గచ్చిబౌలి: బీటెక్ చదివిన పరిజ్ఞానం భవిష్యత్‌కు ఉపయోగించలేదు.. నకిలీ ఐడీ కార్డుల తయారీకి ఉపయోగించి చోరీల బాట పట్టాడు ఓ యువకుడు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఏడు రాష్ట్రాల్లో చోరీలు చేయడం గమనార్హం. జల్సాలకు అలవాటు పడి అదేపనిగా చోరీలు చేయడం అతడి నైజంగా మారింది. ఇప్పటికే పలుమార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పులేదు. అద్దెకార్లు, బైక్‌లను చోరీ చేసిన అంతరాష్ట్ర దొంగను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్‌లో శుక్రవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. సీసలీ గ్రామం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన గుడాటీ మహేష్ నూతన్ కుమార్(27) బీటెక్(ఈఈఈ) 2016లో పూర్తి చేశాడు. భీమవరం టౌన్లో మొబైల్ టెక్నీషన్గా కొద్ది రోజులు పనిచేసి హైదరాబాద్‌కు వచ్చాడు. మలక్‌పేట్‌లో మొబైల్ టెక్నీషన్గా పనిచేస్తూ నకిలీ తాళం చెవిలతో షాపులు తెరిచి చోరీలకు పాల్పడ్డాడు. మలక్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం మళ్లీ భీమవరం వెళ్లాడు. కెమెరా చోరీ చేయడంతో పాలకోడేరు పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు పంపారు. జైలు నుంచి బయటకు రాగానే మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాడు. బోల్ట్ టాటా కారు, ల్యాప్‌టాప్, రూ.25 వేల నగదు చోరీ చేయడంతో ఎస్ఆర్నగర్ పోలీసులు మూడు కేసులు నమోదు చేసి 2019 డిసెంబర్లో జైలుకు పంపారు. షేరింగ్ రూమ్‌లో చేరి.. జైలు నుంచి బయటకు వచ్చి పంజాగుట్టలో షేరింగ్ యాప్ ద్వారా గది అద్దెకు తీసుకున్నాడు. రూమ్మేట్ నాగేంద్ర ప్రసాద్‌తో స్నేహంగా మెలిగి రూ.1.60 లక్షల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ కార్డులు చోరీ చేసి అక్కడి నుంచి ఉడాయించాడు. అక్కడి నుంచి జూలైలో బెంగళూర్‌కు వెళ్లి షేరింగ్ రాయల్ బ్రదర్స్‌లో నాగేంద్ర ఆధార్ కార్డును ఎడిట్ చేసి తన ఫొటో పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ అద్దెకు తీసుకున్నాడు. బైక్ జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్లో బుల్లెట్‌పై నేరుగా వైజాగ్ వెళ్లాడు. అక్కడ షేరింగ్ రూమ్‌లో అద్దెకు దిగి రెండు నెలలు ఉన్నాడు. రూమ్ మేట్ చైతన్యకు చెందిన రూ.30 వేల నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తస్కరించి బుల్లెట్‌పై పూణె వెళ్లాడు. షేరింగ్ రూమ్‌లో చేరి సతీష్ అనే వ్యక్తికి చెందిన రూ.1.80 లక్షలు నగదు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ చోరీ చేసి హైదరాబాద్‌కు వచ్చి చెంగిచెర్లలో నివాసం ఉన్నాడు. చదవండి: చుట్టూ సీసీ కెమెరాలు.. కానీ కారు మాయం..! 2020 అక్టోబర్‌లో కేరళ వెళ్లి కొచ్చిలో సతీష్ ఐడీ కార్డులు ఎడిట్ చేసి జూమ్ కార్స్లో వోక్స్వ్యాగన్ పోలో కారును అద్దెకు తీసుకున్నాడు. జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి, నకిలీ నెంబర్ ప్లేట్‌తో చెంగిచెర్లకు వచ్చాడు. డిసెంబర్లో చెన్నై వెళ్లి రేవ్ కార్స్లో చైతన్య ఐడీ కార్డులు పెట్టి స్విఫ్ట్ కారును అద్దెకు తీసుకొని ఉడాయించారు. 2021 జనవరిలో మైసూర్ వెళ్లి డ్రైవీజీలో సతీష్ ఐడీ కార్డులతో బలేనో కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి నకిలీ నంబర్ ప్లేట్‌తో పరారయ్యాడు. అనంతరం కోల్కత్తకు వెళ్లి నాగేంద్ర ప్రసాద్ ఐడీ కార్డులతో రేవ్కార్స్లో ఇన్నోవా క్రిస్టా కారును అద్దెకు తీసుకొని జీపీఎస్ ట్రాకర్‌ను తొలగించి పరారయ్యాడు. ఓఎల్ఎక్స్లో డ్రైవర్ కావాలని ప్రకటన ఇవ్వడంతో తుఫ్రాన్‌పేట్, చౌటుప్పల్ మండల్‌కు చెందిన కిరణ్ సంప్రదించగా అతడి ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఐడీ ప్రూఫ్‌లు తీసుకున్నాడు. జల్సాలు చేసేవాడు అవి ఎడిట్ చేసి 15 రోజుల క్రితం మాదాపూర్ పీఎస్ పరిధిలో జూమ్ కార్స్లో ఇచ్చి స్విఫ్ట్ కారును చోరీ చేశాడు. చోరీ చేసిన కార్లను 30 నుంచి 40 శాతం ధరకే విక్రయించే వాడు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎస్వోటీ పోలీసులకు పట్టుబడ్డాడు. సమావేశంలో సైబరాబాద్ ఇన్చార్జి డీసీపీ విజయ్‌కుమార్, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, సీఐలె రవీంద్ర ప్రసాద్, నవీన్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. 9 కేసుల్లో నిందితుడు నిందితుడు మహేష్ నూతన్ కుమార్ ఏడు రాష్ట్రాల్లో 9 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. మాదాపూర్, మహరాణిపేట, శిల్‌పూర్ పీఎస్ వెస్ట్ బెంగాల్, పాలరివట్టం పీఎస్ కొచ్చి, హింజేవాడి పీఎస్ పూణె, రాజాజీనగర్ పీఎస్ బెంగళూర్, అన్నా సాగర్ పీఎస్ తమిళనాడు, హెబ్బల్ పీఎస్ మైసూర్, రామమూర్తినగర్, బెంగళూర్లలో కేసులు నమోదయ్యాయి. ఆరు కేసుల్లో అరెస్ట్ చోరీల కేసుల్లో మలక్‌పేట్, పాలకోడురు, ఎస్ఆర్నగర్లో మూడు కేసుల్లో, మదివాల, బెంగళూర్ పీఎస్ పరిధిలోలో ఆరు కేసుల్లో అరెస్ట్ అయ్యారు. నిందితుడి నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టా, వోక్స్వాగన్ పోలో, మారుతి బెలేనో, రెండు స్విఫ్ట్ కార్లు, వెర్నా కారు, రాయల్ ఎన్ఫీల్డ్ను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు సెల్ఫోన్లు, ఏడిట్ చేసిన ఐడీ కార్డులు, నకిలీ నెంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు. చదవండి: ఓయో రూమ్ తీసుకుందామనుకుంటే.. అంతలోనే! -
దొంగతనం కోసం వెళ్తే చివరికి ఎముకలే మిగిలాయి..
నాంపల్లి: ఈ నెల 5న అదృశ్యమైన ఓ కారు డ్రైవరు బీదరు అడవుల్లో శవమయ్యాడు. కుటుంబసభ్యులకు శవం కాకుండా ఎముకలు మాత్రమే లభించాయి. చెట్ల పొదల్లో లభ్యమైన శవాన్ని అడవి పందులు పీక్కు తిన్నాయి. అంత్యక్రియలకు ఎముకలు తప్ప ఏ ఇతర శరీర భాగాలు దొరకలేదు. చివరకు వాటినే తెచ్చి అంత్యక్రియలు చేశారు. ఈ విషాదకరమైన సంఘటన నాంపల్లి పోలీసు స్టేషన్లో జరిగింది. ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన శివకుమార్(28), బీదర్‌కు చెందిన ఇంతియాజ్ ఖనమ్ (24) ఫేస్బుక్లో ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకొని ఢిల్లీకి మకాం మార్చారు. ఉపాధి కోసం నేరాలబాట పట్టారు. ఈ నెల 4న రైలులో హైదరాబాదుకు చేరుకున్నారు. అఫ్జల్‌గంజ్‌లోని శ్రీసాయి లాడ్జిలో బస చేశారు. కార్లను అద్దెకు తీసుకుని స్క్రాబ్‌కు వేసి సొమ్ముచేసునేందుకు పథకాన్ని రచించారు. ఈ నెల 5న నాంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఓ కారును అద్దెకు తీసుకున్నారు. డ్రైవర్ అస్లం ఖాన్(48)తో కలిసి బీదర్‌కు బయలుదేరారు. మార్గమధ్యలో రవి అనే స్నేహితుడిని శివకుమార్ కారులో తీసుకెళ్లారు. మణ్యకెళ్లి అడవిలో డ్రైవర్ వెనుక సీటులో కూర్చున్న శివకుమార్ వైరుతో డ్రైవర్ అస్లం ఖాన్ గొంతుకు వేసి బిగించి హత్యచేశారు. ఇందుకు రవి, ఇంతియాజ్ ఖనమ్ సహకరించారు. మృతదేహాన్ని చెట్ల పొదల్లో వదలి నిందితులు కారును బీదరులోని ఓ స్క్రాబ్ దుకాణం యజమానికి రూ.14వేలకు అమ్మేశారు. తిరిగి నగరానికి వచ్చారు. నాంపల్లి టిప్పుఖాన్ సరాయిలో నివాసం ఉండే అస్లం ఖాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ కెమెరాలు, లాడ్జిలో లభించిన ఆధారాలను సేకరించిన పోలీసులు చివరికి ఎంజీబీఎస్ దగ్గర నిందితులను అదుపులోకి తీసుకున్నారు.నేరాన్ని చేసినట్లుగా విచారణలో ఒప్పుకోవడంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కిలాడీ పోలీస్ అరెస్ట్
పుట్లూరు: దొంగల భరతం పడుతూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన ఓ పోలీసు ట్రాక్ తప్పాడు. వ్యసనాలకు బానిసై నిండా అప్పుల్లో మునిగిపోయాడు. అద్దెకు కార్లను తీసుకుని వాటిని కూడా తాకట్టు పెట్ట్టగా.. బాధితులు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం కిలాడీ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. ఎస్ఐ మోహన్‌కుమార్‌గౌడ్ తెలిపిన వివరాలమేరకు... పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటరమేష్ జూదానికి బానిసై అప్పులు చేశాడన్నారు. వాటిని తీర్చడం కోసం కార్లను బాడుగకు తీసుకుని వాటిని తాకట్టు పెట్టాడని తెలిపారు. ఇలా 20 కార్లను రోజువారీ బాడుగకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టి జూదం ఆడాడని పేర్కొన్నారు. అయితే బాడుగకు తీసుకున్న కార్లకు రోజువారీ అద్దె చెల్లించకపోవడంతో వారు కార్లను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఈ సమయంలో తాను పోలీస్‌ను అంటూ బెదిరించడంతో బాధితులు జూలై 20వ తేదీన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. రూ. 45 లక్షలా 57 వేల రూపాయలకు కార్లను కొదవ పెట్టినట్లు గుర్తించామన్నారు. మంగళవారం పుట్లూరు మండలంలోని ఎ.కొండాపురం వద్ద కానిస్టేబుల్ వెంకటరమేష్ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. త్వరలోనే బాధితులకు వారి కార్లను అప్పగిస్తామన్నారు. -
స్విగ్గి బాయ్.. దర్జా కోసం కారు చోరీ
కేపీహెచ్‌బీకాలనీ: సమాజంలో ధనవంతుడిగా కనిపించాలనే కోరికతో ఓ యువకుడు కారును దొంగిలించి దర్జాగా తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేసన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన మేరకు..బిహార్ రాష్ట్రానికి చెందిన ఈర్షద్ ఆలం కుటుంబం నగరానికి వచ్చి పటాన్చెరు ప్రాంతంలో ఉంటున్నారు. ఇతని కుమారుడు అదిల్ హాసన్(23) కేపీహెచ్‌బీకాలనీలోని హోలిమేరి డిగ్రీ కాలేజిలో రెండవ సంవత్సరం వరకూ చదివి మానేశాడు. తరువాత స్విగ్గిలో డెలివరి బాయ్‌గా పనిచేస్తున్నాడు. అయితే అందరి ముందు బాగా డబ్బున్న వాడిగా కనిపించాలనే కోరికతో కారు ఉంటే అందరూ తనను బాగా డబ్బున్న వాడు అనుకుంటారని భావించాడు. ఈ నెల 19న బైక్‌పై నిజాంపేట చౌరస్తా వద్ద గల పిస్తా హౌస్ వద్దకు వచ్చి బైక్‌ను పార్కు చేశాడు. అనంతరం కార్లు నిలిపే చోటుకు వచ్చి వాలెట్ పార్కింగ్ డ్రైవర్‌గా నమ్మించి అక్కడకు వచ్చిన మారుతి స్విఫ్ట్ కారును సెల్లార్లో పార్కు చేస్తానంటూ కారు యజమాని వద్ద తాళాలు తీసుకున్నాడు. కానీ కారును సెల్లార్లో పార్కు చేయకుండా కారును దొంగిలించుకువెళ్ళాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం నిజాంపేట చౌరస్తా వద్ద మఫ్టీలో ఉన్న పోలీస్‌లు వాహనాలు తనిఖీ చేస్తుండగా అటువైపుగా కారులో వచ్చిన అదిల్ హాసన్ కారుకు చెందిన పేపర్లు చూపించకుండా తప్పించుకుపోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు పట్టుకొని విచారింగా నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి కారును స్వాధీనం చేసుకున్నారు. -
వివాహిత కారు చోరీ.. విచారణకు సీఐ డుమ్మా
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని హబ్సిగూడలో నివసించే వివాహిత కారును చోరీ చేసి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కరీంనగర్ కమిషనరేట్‌కు చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ దేవరెడ్డి పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఆయన కోరిన గడువు ప్రకారం సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) పోలీసుస్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారికి వివరణ ఇవ్వాల్సి ఉంది. దేవరెడ్డి రాకపోవడంతో ఆయనపై న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేయాలని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఏం జరిగిందంటే.. హబ్సిగూడలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివసించే రాగిడి లక్ష్మారెడ్డి భార్య రాగిడి రజనీకి చెందిన 2013లో చోరీకి గురైంది. దీనిపై ఆమె అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తన వాహనం ఆచూకీ కనిపెట్టడానికి భర్తతో కలిసి ప్రయత్నాలు ప్రారంభించిన ఆమె అనేక కీలకాంశాలు గుర్తించారు. 2015 ఏప్రిల్ 4న దేవరెడ్డి సదరు వాహనానికి ఫ్రూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఏడాది కాలానికి బీమా తీసుకున్నారని, ఆ సందర్భంలో యజమాని పేరు, వివరాలను ‘రజనీ.ఆర్ కేరాఫ్ దేవరెడ్డి’గా పేర్కొన్నారని తెలుసుకున్నారు. దేవరెడ్డి అధీనంలో ఉన్న ఆ కారు ప్రమాదానికి గురికాగా.. 2018 జనవరిలో ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ కూడా పొందారు. ఆ సమయంలో రజనీ సంతకాలను దేవరెడ్డి ఫోర్జరీ చేశారు. ఈ విషయాలు వెలుగులోకి రావడంతో గత ఏడాది అన్ని ఆధారాలనూ జోడిస్తూ రజనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి పిటిషన్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశాలు.. దీన్ని విచారించిన కోర్టు కారు వ్యవహారానికి సంబంధించి ఇన్స్పెక్టర్ దేవరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు గత ఏడాది మార్చి 25న ఓయూ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇందులో దేవరెడ్డిని నిందితుడిగా పేర్కొంటూ చోరీ, ఫోర్జరీ, చీటింగ్ ఆరోపణలు చేర్చారు. దర్యాప్తులో భాగంగా ఓయూ పోలీసులు ఫ్రూచర్ జనరాలి ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 2018 జనవరిలో క్లెయిమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, పత్రాలు సంపాదించారు. ఆ సమయంలో ఇన్స్పెక్టర్ దేవరెడ్డి తన డ్రైవింగ్ లైసెన్సును దాఖలు చేశారని, క్లెమ్ ఫామ్స్‌పై రజనీ మాదిరిగా సంతకం ఉన్నట్లు గుర్తించారు. దీంతో రజని నుంచి సంతకాల నమూనాలు తీసుకున్న పోలీసులు వాటితో పాటు క్లయిమ్ ఫామ్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ రెండింటినీ విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫారంపై సంతకం చేసింది రజనీ కాదని తేల్చారు. నిందితుడిగా నిర్ధారణ.. ఇటీవల ఈ నివేదిక అందుకున్న ఓయూ పోలీసులు దాని ఆధారంగా దేవరెడ్డిని నిందితుడిగా ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో గత సోమవారం (మే 18) లోపు తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తూ నోటీసులు (సీఆర్పీసీ 41ఎ) జారీ చేశారు. గత సోమవారం ఉస్మానియా యూనివర్శిటీ (ఓయూ) పోలీసుల ఎదుట హాజరైన దేవరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇవ్వడానికి వారం రోజుల గడువు కోరుతూ లేఖ అందించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేసు దర్యాప్తు అధికారి ఆ మేరకు గడువు ఇవ్వడంతో దేవరెడ్డి తిరిగి వెళ్లారు. దీని ప్రకారం సోమవారం హాజరుకావాల్సి ఉండగా ఆయన రాలేదు. దీంతో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నివేదిక ఆధారంగా దేవరెడ్డిపై అభియోగపత్రాలు దాఖలు చేయాలని ఓయూ పోలీసులు యోచిస్తున్నారు. నగరంలోని మెట్టుగూడలో ఉన్న ఆలుగడ్డ బావి ప్రాంతానికి చెందిన దేవరెడ్డి ప్రస్తుతం కరీంనగర్ పోలీసు కమిషనరేట్‌లో సీఐగా పని చేస్తున్నారు. -
కన్ను పడిందంటే కారు మాయం
యశవంతపుర: కీ ప్రోగ్రామింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి వాహనాలను అపహరిస్తున్న ముగ్గురు నిందితులను బాగలగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళూరుకు చెందిన దిలీప్ శంకరన్, శాజీ కేశవన్, కేరళకు చెందిన అలీ అహమ్మద్‌లను అరెస్ట్ చేసి 9 కార్లను స్వాధీనం చేసుకున్నారు. బాగలగుంట పోలీసుస్టేషన్ పరిధిలో ఐదు, అన్నపూణేశ్వరినగర, మహాలక్ష్మీపుర –1, సుబ్రమణ్యపుర రెండు కార్లను దొంగలించినట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ఇళ్ల ముందు ఉంచి న కార్లను దొంగలించి నంబర్లను మార్చి తక్కువ ధరలకు అమ్మేవారని పోలీసుల విచారణలో తేలింది. ఖరీదైన కార్లకు కీ ప్రోగ్రామింగ్‌సాఫ్ట్‌వేర్ తాళాన్ని ఉపయోగించి దొంగ లించేవారు. కార్లను ఎలా దొంగలించాలో ముగ్గురు నిందితులు యూట్యూబ్‌లో వీడియోలను చూసి తెలుసుకుని కార్లను దొంగలించేవారు. బెంగళూరులో దొంగలించిన కార్లను మంగళూరు, కేరళకు తరలించి అమ్మేవారని పోలీసులు తెలిపారు. వచ్చిన డబ్బులతో విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి ఎక్కువ కార్లను దొంగలించేవారని పోలీసులు తెలిపారు. -
బంధువుల మెప్పు కోసం...
డెహ్రడూన్ : బంధువుల మెప్పు కోసం.. వారి ముందు ధనవంతులుగా గుర్తింపు పొందడం కోసం దొంగతనానికి పాల్పడ్డారు ఓ జంట. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. డెహ్రడూన్‌కి చెందిన సప్న(26) పేద కుటుంబానికి చెందిన మహిళ. ఇమెకు 2009లో వివాహం అయ్యింది. కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త నుంచి విడిపోయి వర్మ అనే మరో వ్యక్తితో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సప్న సోదరునికి వివాహం నిశ్చయమయ్యింది. పెళ్లికి వచ్చే తన బంధువుల ముందు తాను గొప్పగా కన్పించడం కోసం కారులో వెళ్లాలని భావించింది. ఇందుకోసం డెహ్రడూన్‌కు చెందిన శుభం శర్మ అనే టాక్సీ డ్రైవర్‌ను కలిసి తమను ఢిల్లీ తీసుకెళ్లి.. తిరిగి డెహ్రడూన్‌కి చేర్చేలా కిరాయి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3న సప్న, వర్మలు మరో స్నేహితురాలితో కలిసి టాక్సీలో ఢిల్లీ బయలు దేరారు. కొంత దూరం ప్రయాణించిన తరువాత సప్న, వర్మ తమ దగ్గర ఉన్న తుపాకీతో టాక్సీ డ్రైవర్‌ను బెదిరించి కారు తీసుకుని పారిపోయారు. టాక్సీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం సప్న, వర్మలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
కారు అపహరణ
కర్నూలు, డోన్ రూరల్: మండల పరిధిలోని జగదుర్తి సమీపంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారు అపహరించినట్లు పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల మేరకు.. టీఎస్ 14ఏ 5164 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారును ముగ్గరు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు తెలిపారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బెంగుళూరుకు వెళ్లాలని ముగ్గురు వ్యక్తులు కారు బాడుగకు తీసుకున్నారని, కారు ఓనర్, కమ్ డ్రైవర్ అయిన విష్ణు బాడుగకు ఒప్పుకుని బెంగుళూరుకు వెళ్తుండగా.. డోన్ మండల పరిధిలోని జగదుర్తి గ్రామం వద్ద మూత్రం పోయడానికని దిగిన వెంటనే అతడిపై దాడి చేసి, కారు అపహరించుకుని వెళ్లారని తెలిపారు. వెంటనే తేరుకున్న విష్ణు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడని, సీఐ రాజగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ శ్రీహరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. -
సినీ నిర్మాత కారు అపహరణ
తిరువొత్తియూరు: పూందమల్లిలో డ్రైవర్‌పై దాడి చేసి సినీ నిర్మాతకు చెందిన కారును చోరీ చేసిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూందమల్లి, వేలప్పన్ చావడికి చెందిన రామచంద్రన్ (70). తెలుగు, కన్నడం సినీ నిర్మాత ఇతని కారు డ్రైవర్ చంద్రన్ (24). బుధవారం రాత్రి రామచంద్రన్ బంధువులను సెంట్రల్ నుంచి తీసుకురావడానికి చంద్రన్ కారులో వెళుతున్నారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ఐదుగురికి చెందిన ఓ ముఠా కారును నిలిపి నజ్రత్పేటకు వెళ్లాలని కోరారు. చంద్రన్ వారికి సమాధానం చెప్పేలోపు వారు చంద్రన్‌పై దాడి చేసి అతన్ని కింద పడదోసి కారు సహా పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు. -
కారుపై మోజుతో చోరీ
మలక్‌పేట: కారుపై కోరికతో ఓ మైనర్ బాలుడు తన బంధువుల ఇంట్లో చోరీ చేశాడు.ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. డీఐ గుజ్జ రమేష్ తెలిపిన మేరకు..కర్ర సత్యనారాయణ కుటుంబంతో కలిసి సలీంనగర్‌లోని ప్రణవ అపార్ట్మెంట్లో 302 ఫ్లాంట్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 3 తేదిన భార్య భర్తలు ఉద్యోగాలకు వెళ్లగా పిల్లలు బంధువుల ఇంటికి వెళ్లారు. సాయంత్రం 8 గంటలకు అందరూ ఇంటికి చేరుకున్నారు. అయితే ఇంట్లో ఉన్న 16 తులాల బంగారు నగలు,రూ.38 వేలు నగదు కన్పించలేదు. ఇంటికి వేసినా తాళాలు, బీరువా తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా అదే అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న బాధితుని బంధువు కుమారుడు (17) నిందితుడిగా తేలింది.అతను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కారు కొనుకోవాలనే ఆశతో మైనర్‌బాలుడు ఓ పథకం ప్రకారం చోరీ చేశాడు. బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించి, బంగారు అభరణాలు, 25 వేలు నగదు రీకవరీ చేసినట్లు డీఐ తెలిపారు. సమావేశంలో డీఎస్సై శివశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రియురాలి కోసం కారు చోరీ
బంజారాహిల్స్ : ప్రియురాలితో షికారు చేసేందుకు ఓ యువకుడు కారు దొంగిలించి కటకటాల పాలైన సంఘటన బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బంజారాహిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రవికుమార్, డీఎస్ఐ నాగరాజు గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... కర్మన్‌ఘాట్‌కు చెందిన నెల్లవెట్ల ప్రశాంత్‌రెడ్డి, ఓంసాయి మెడికల్స్‌లో సేల్స్‌మెన్‌గా పని చేస్తూ జ్ఞానిజైల్‌సింగ్ నగర్లో ఉంటున్నాడు. ఆదిలాబాద్ జిల్లా, చంద్రాపూర్ ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. తనకు పెళ్లి కుదిరిందని ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటూ గత నెల 25న సదరు యువతి ఫోన్ చేయడంతో ఆమె ను తీసుకెళ్లేందుకు తన యజమాని రాజేందర్‌రెడ్డి స్కోడా కారును దొంగిలించి ప్రియురాలి ఇంటికి వెళ్లాడు. ఆమెతో కలిసి ప్రియురాలితో గోవా వెళ్లేందుకు పథకం వేశాడు. ముందుగా విజయవాడ కనకదుర్గను దర్శించుకొని అక్కడి నుంచి స్నేహితుడు రాజ్‌కుమార్ సహాయంతో గోవాకు బయలుదేరుతుండగా, బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోన్‌నంబర్ ఆధారంగా కారు నార్కట్‌పల్లి నుంచి హైదరాబాద్‌కు వస్తున్నట్లు గుర్తించారు. చంపాపేట్‌లో నిఘా వేసి నిందితుడిని అరెస్ట్ చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కారు చోరీ
కర్నూలు : కర్నూలు ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి స్కార్పియో వాహనం చోరీకి గురైంది. ఆయన నివాసంలో పార్క్ చేసిన వాహనాన్ని దుండగులు శుక్రవారం ఆర్థరాత్రి అపహరించుకు పోయారు. ఆ విషయాన్ని శనివారం ఉదయం గుర్తించిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా కర్నూలు జిల్లా ఎస్పీ ఎ. రవికృష్ణ నివాసానికి కూతవేటు దూరంలోనే ఎస్వీ మోహన్‌రెడ్డి నివాసం ఉంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మూడు రోజుల క్రితమే స్కార్పియో వాహనాన్ని కొనుగోలు చేశారు. కాగా కర్నూలు నగరంలో చోరీలు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. చోరీలపై నగర ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినా పోలీసులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సాక్షాత్తూ ఎమ్మెల్యే వాహనమే చోరీకి గురికావడం సంచలనం సృష్టిస్తోంది. -
బాలకృష్ణ వాడుతున్న కారు చోరీ
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'లయన్' సినిమా షూటింగ్ లో కారు చోరీకి గురైంది. షూటింగ్ కోసం ఆయన వాడుతున్న కారును ఎత్తుకెళ్లారంటూ హయత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న 'లయన్' సినిమాకు సత్యదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలకృష్ణ సరసన త్రిష, రాధికా ఆప్టే నటిస్తున్నారు.