
పోలీసులు స్వాధీనం చేసుకున్న కార్లు (ఇన్‌సెట్) కానిస్టేబుల్ వెంకటరమేష్
పుట్లూరు: దొంగల భరతం పడుతూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన ఓ పోలీసు ట్రాక్ తప్పాడు. వ్యసనాలకు బానిసై నిండా అప్పుల్లో మునిగిపోయాడు. అద్దెకు కార్లను తీసుకుని వాటిని కూడా తాకట్టు పెట్ట్టగా.. బాధితులు ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం కిలాడీ పోలీస్‌ను అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ మోహన్‌కుమార్‌గౌడ్ తెలిపిన వివరాలమేరకు... పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న వెంకటరమేష్ జూదానికి బానిసై అప్పులు చేశాడన్నారు. వాటిని తీర్చడం కోసం కార్లను బాడుగకు తీసుకుని వాటిని తాకట్టు పెట్టాడని తెలిపారు.
ఇలా 20 కార్లను రోజువారీ బాడుగకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు పెట్టి జూదం ఆడాడని పేర్కొన్నారు. అయితే బాడుగకు తీసుకున్న కార్లకు రోజువారీ అద్దె చెల్లించకపోవడంతో వారు కార్లను తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తీసుకొచ్చారన్నారు. ఈ సమయంలో తాను పోలీస్‌ను అంటూ బెదిరించడంతో బాధితులు జూలై 20వ తేదీన ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామన్నారు. రూ. 45 లక్షలా 57 వేల రూపాయలకు కార్లను కొదవ పెట్టినట్లు గుర్తించామన్నారు. మంగళవారం పుట్లూరు మండలంలోని ఎ.కొండాపురం వద్ద కానిస్టేబుల్ వెంకటరమేష్‌ను అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి మూడు కార్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపామన్నారు. త్వరలోనే బాధితులకు వారి కార్లను అప్పగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment