రిజిస్ట్రేషన్లు బంద్
సాక్షి, కర్నూలు: రాష్ట్ర విభజన నేపథ్యంలో రిజిస్ట్రేషన్లకు స్వల్ప బ్రేక్ పడనుంది. జిల్లాలో ఈ నెల 30న సాయంత్రం 6 నుంచి.. జూన్ 2వ తేదీ ఉదయం 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకం కలగనుంది. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సెంట్రల్ సర్వర్‌ను విభజించాల్సి ఉండటంతో సేవలను నిలుపుదల చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. రెండు రోజుల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా నిలిచిపోనుంది. మీసేవ కేంద్రాల ద్వారా ఈసీలు, నకళ్ల జారీ సైతం స్తంభించనుంది.
రిజిస్ట్రేషన్ శాఖలో సీసీఏ(కార్డ్ సెంట్రలైజ్డ్ అప్లికేషన్) విధానం అమలు చేస్తున్నందున ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చేపట్టిన లావాదేవీల వివరాలు హైదరాబాద్‌లోని సెంట్రల్ సర్వర్‌లో నమోదవుతుంది. సాధారణంగా ప్రతిరోజూ జిల్లా వ్యాప్తంగా 500 పైబడి రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. ఈసీలు 800 వరకు జారీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు రోజుల పాటు ఈ సేవలన్నీ నిలిచిపోనున్నాయి. ఇదిలా ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ స్టాంపు ఫీజు, రిజిస్ట్రేషన్ల ఫీజు తగ్గించడంతో ఆదాయం భారీగా తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో గత ఏడాదిలో లక్ష్యాన్ని కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు కేటాయించిన లక్ష్యంలో 65 శాతం మాత్రమే సాధించడం గమనార్హం. ఇక రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం లక్ష్యాలను ఇప్పటికీ నిర్దేశించకపోయినా.. ఆ ప్రభావం శాఖ కార్యకలాపాలతో పాటు ఆదాయంపై చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.