సెల్ఫీలతో ముఖంపై ముడతలు
లండన్: అధిక సంఖ్యలో సెల్ఫీలు తీసుకునేవారి చర్మం పాడవుతుందనీ, ముఖంపై ముడతలు పడతాయని చర్మవైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ఫోన్ల నుంచి వచ్చే రేడియేషన్ వల్ల చర్మం తొందరగా వృద్ధాప్య ఛాయలను పొందుతుందని అంటున్నారు. చర్మానికి దెబ్బతిన్న చోట బాగుచేసుకునే సహజగుణం ఉంటుంది. రేడియేషన్ కారణంగా చర్మం ఆ గుణాన్ని కోల్పోతుంది. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే నీలం రంగు కాంతి కూడా చర్మానికి హాని కలిగించగలదన్నారు.
అక్కడా ప్రాణవాయువు!
టోక్యో: ఆక్సిజన్ ఉన్న సుదూర గెలాక్సీని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది బిగ్‌బ్యాంగ్ జరిగిన 70 కోట్ల ఏళ్ల తర్వాత ఏర్పడింది. దీని ద్వారా అంతరిక్ష ప్రాథమిక చరిత్రను తెలుసుకోవచ్చని అంటున్నారు. చిలీలోని అటకామా ఎడారిలో ఉన్న రేడియో టెలిస్కోపుల ద్వారా దీన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ గెలాక్సీలోని భారీ రసాయన మూలకాల ద్వారా నక్షత్రాల ఏర్పాటు, విశ్వపునఃఅయనీకరణరహస్యాలను ఛేదించవచ్చంటున్నారు. ఇందులో సూర్యుని కంటే ఎన్నో రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉండొచ్చని అంచనా.
టాయిలెట్ ఉంది టీచర్!
బరంపురం: పాఠశాలలో హాజరు (అటెండెన్స్) వేసుకునేటప్పుడు పిల్లలు సాధారణంగా ప్రెజెంట్/ఎస్ టీచర్ అని చెబుతారు. ఒడిశాలోని గంజాం జిల్లా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న పిల్లలు మాత్రం ‘మా ఇంట్లో మరుగుదొడ్డి ఉంది/లేదు టీచర్’ అంటూ కొత్త పద్ధతిలో హాజరు పలుకుతున్నారు. ఎందుకంటే, ఈ రకంగానైనా ప్రజలు శౌచాలయాలు నిర్మించుకునేలా చేసి బహిరంగ మల విసర్జనను నిర్మూలించాలనేది అక్కడి అధికారుల ప్రణాళిక. గంజాంను బహిరంగ మలవిసర్జన లేని జిల్లాగా మార్చేందుకు అన్ని పాఠశాలల్లో దీన్ని చేపట్టినట్లు డీఈఓ తెలిపారు. జిల్లాలో 30% ఇళ్లలోనే మరుగుదొడ్లు ఉన్నాయి.