లెక్చరర్ కేసులో హైడ్రామా
ఏలూరు: చీటింగ్ కేసులో కటకటాలపాలైన సీఆర్ రెడ్డి కళాశాల లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ కేసులో హైడ్రామా చోటు చేసుకుంది. గౌస్ మొయిద్దీన్ కస్టడీలోకి తీసుకునే ముందు వైద్య పరీక్షలు నిమిత్తం పోలీసులు గురువారం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాదాపు మూడు గంటలపాటు గౌస్‌కు ఆసుపత్రిలో వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. మరింత మెరుగైన వైద్య పరీక్షల కోసం గౌస్‌ను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని స్థానిక ఆసుపత్రి వైద్యులు పోలీసులకు సూచించారు. గౌస్‌ను గుంటూరు తరలిస్తే కస్టడి సమయం పూర్తిగా వైద్య పరీక్షలకే సరిపోతుందని పోలీసులు భావిస్తున్నారు.
దీంతో పోలీసులు మళ్లీ మేజిస్ట్రేట్‌ను ఆశ్రయించనున్నారు. గౌస్ కస్టడీలోకి తీసుకునేందుకు తమకు మరింత సమయం కావాలని పోలీసులు మేజిస్ట్రేట్‌కు విన్నవించనున్నారు. గౌస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి.... ఈ రోజు సాయంత్రం నుంచి నవంబర్ 1 వతేదీ వరకు కస్టడీలోకి తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్ పోలీసులను బుధవారం ఆదేశించిన సంగతి తెలిసిందే.
గౌస్ మొయిద్దీన్ స్థానిక సీఆర్ రెడ్డి కళాశాలలో పోలిటికల్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆయన పోలీసు ఉన్నతాధికారులో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నాడు. అయితే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వారి వద్ద నుంచి భారీ ఎత్తున్న నగదు తీసుకునే వాడు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పలు మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉద్యోగం ఇప్పించకుండా నగదు అడిగితే బెదిరించడంతో పలువురు నిరుద్యోగులు పోలీసులను ఆశ్రయించార. ఈ నేపథ్యంలో అక్టోబర్ 23న పోలీసులు గౌస్ నివాసంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా పలు విలువైన డాక్యుమెంట్లుతోపాటు నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.