బాలికను వేధించిన ఇద్దరిపై ‘నిర్భయ’ కేసు
రంగారెడ్డి జిల్లా : ఓ బాలికను వేధించిన ఇద్దరిపై రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. జవహర్‌నగర్‌లోని మార్వాడిలైన్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన భానుగడ్డ తరుణ్‌కుమార్ (22), అతడి స్నేహితుడు కీసర గ్రామానికి చెందిన నిఖిల్(19)లు కొంతకాలంగా బాలికను వేధించసాగారు. తనను ప్రేమించాలని నిఖిల్ నిత్యం విద్యార్థినిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని బాలిక ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.