Caste Verification Documents
-
హెన్నీ క్రిస్టీనా కుల ధ్రువీకరణను మళ్లీ తేల్చండి
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్పర్సన్ హెన్నీ క్రిస్టీనా, ఆమె భర్త కత్తెర సురేష్ కుమార్ల కులాన్ని మరోసారి తేల్చాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు ఆదేశించింది. వారి కుల ధ్రువీకరణపై పిటిషనర్ తాజాగా సమర్పించే ఆధారాలను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నిర్ణయం తీసుకునే ముందు క్రిస్టీనా, సురేష్‌ల వాదన కూడా వినాలని కలెక్టర్‌కు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్రిస్టీనా, సురేష్ ఎస్సీలు కారని, అయినా ఎస్సీలుగా చలామణి అవుతున్నారని, వారి కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ కొల్లిపర గ్రామానికి చెందిన మండ్రు సరళకుమారి గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ మంగళవారం మరోసారి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. క్రిస్టీనా, సురేష్ కుమార్ బాప్టిజం తీసుకోవడం ద్వారా క్రైస్తవ మతంలోకి మారారని, అందువల్ల వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని తెలిపారు. వారికిచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేయాలన్న పిటిషనర్ ఫిర్యాదును కలెక్టర్ తోసిపుచ్చారన్నారు. వారు బాప్టిజం తీసుకున్నట్లు అప్పట్లో ఆధారాలు దొరకలేదని, ఇప్పుడు ఆ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. -
AP: ఇక ఎన్నైనా సర్టిఫికెట్లు.. సచివాలయాల్లో సరికొత్త సేవలు
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పలు రకాల సర్టిఫికెట్ల జారీలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం తీసుకువస్తోంది. కుల ధ్రువీకరణ, కుటుంబ సభ్యుని నిర్ధారణ ధ్రువీకరణ తదితర కొన్ని రకాల సర్టిఫికెట్ల కోసం పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఆ సర్టిఫికెట్లు జారీ చేయడానికి సరికొత్త సేవలు ప్రవేశపెట్టనుంది. మొదటిసారి దరఖాస్తు చేసుకున్నప్పుడు సంబంధిత అధికారులు ఆమోదం తెలిపి జారీ చేసిన సర్టిఫికెట్లు మళ్లీ కావాల్సి వచ్చినప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో అప్పటికప్పుడు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకుగాను ఒకసారి ఒక వ్యక్తికి జారీ చేసే వివిధ రకాల సర్టిఫికెట్ల వివరాలను ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ సర్టిఫికెట్లకు సంబంధించి దరఖాస్తుదారుడు కోరుకుంటే ఒకేసారి మూడు నాలుగు ఒరిజనల్ సర్టిఫికెట్లు కూడా జారీ చేసే విధానం తీసుకురాబోతున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికారులు తెలిపారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఒకసారి జారీ చేస్తే.. గరిష్టంగా నాలుగేళ్ల వరకు చెల్లుబాటులో ఉంటాయని, ఆ నిర్ణీత గడువు మేరకు ఆ సర్టిఫికెట్లు జారీకి ఈ విధానం వర్తిస్తుందని చెబుతున్నారు. కాగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్తగా ప్రవేశపెట్టే ఈ విధానం ద్వారా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ ఎక్కువగా అవసరమయ్యే విద్యార్థులు, నిరుద్యోగులు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని అధికారులు వెల్లడించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేస్తున్న సర్టిఫికెట్లలో నిబంధనల ప్రకారం అవకాశం ఉన్న అన్నింటికి ఈ విధానం వర్తింపచేసేలా అధికారులు ఆలోచన చేస్తున్నారు. వాట్సాప్ ద్వారా కూడా సర్టిఫికెట్లు.. ఆన్లైన్లో బస్సు, రైలు టిక్కెట్లు వంటివి బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ కాపీ లింకు మెసేజ్ రూపంలో సంబంధిత దరఖాస్తుదారుడు వాట్సాప్‌కు చేరుతోంది. ఆ తరహాలోనే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా జారీ చేస్తున్న సరిఫికెట్లను కూడా సంబంధిత అధికారుల ఆమోదం పొందిన వెంటనే దరఖాస్తుదారుల మొబైల్ నంబర్లకు కాపీ లింకును కూడా పంపే విధానానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు అధికారులు వెల్లడించారు. -
ఆ అధికారం కలెక్టర్‌దే!
సాక్షి, హైదరాబాద్: కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌కే ఆ అధికారం ఉం టుందని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో తప్పు డు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా కానిస్టేబుల్ ఉద్యోగం పొందిన వ్యక్తిపై చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. అయితే ఆ వ్యక్తి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ రద్దు చేశాకే అతనిపై చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన ఎస్.అజయ్ చందర్ తాను బీసీ–బీ (గాండ్ల) కులానికి చెందిన వ్యక్తినంటూ 2013లో కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించాడు. దీనికి సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించారు. అయితే అజయ్ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కాదని, అతను తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారంటూ స్పెషల్ బెటాలియన్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ అధికారులు అజయ్ చందర్ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం అసలైందో.. కాదో.. తేల్చాలని నిర్మల్ మండల తహసీల్దార్‌ను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు విచారణ జరిపిన తహసీల్దార్, అజయ్ చందర్ గాండ్ల కులస్తుడు కాదని, అతను రెడ్డి గాండ్లకు చెందిన వ్యక్తిని తేల్చారు. రెడ్డి గాండ్ల కులం బీసీ–బీ కిందకు రాదని స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులకు తహసీల్దార్ ఈ జనవరి 9న నివేదిక సమర్పించారు. ఈ నివేదికను సవాల్ చేస్తూ అజయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కరుణాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనల ప్రకా రం కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కే ఉందన్నారు. పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్ రద్దు చేయలేదని, అందువల్ల అతనిపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోజాలరన్నారు. ప్రభుత్వ న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసే అధికారం కలెక్టర్‌కే ఉందన్న విషయాన్ని అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తహసీల్దార్ ఇచ్చిన నివేదిక చెల్లదంటూ రద్దు చేశారు. అయితే జిల్లా కలెక్టర్ చట్ట ప్రకారం వ్యవహరించి, కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తే, తర్వాత పిటిషనర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
అదనపు కలెక్టర్లకు కుల ధ్రువీకరణ బాధ్యత
సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశం * పరిశీలన కమిటీలను రద్దుచేసిన ప్రభుత్వం * విద్యార్థులు,నిరుద్యోగులకు మేలు చేయనున్న నిర్ణయం సాక్షి, ముంబై: కులధ్రువీకరణ పత్రాలు పరిశీలించే అధికారం జిల్లా అదనపు కలెక్టర్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశించారు. అంతేగాకుండా ఈ పత్రాలు పరిశీలించేందుకు ఇదివరకు నియమించిన కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంవల్ల నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. కులధ్రువీకరణ పత్రాలు పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు ప్రజలకు తలనొప్పిగా మారాయి. పరిశీలన కోసం సంబంధిత కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు, కులపత్రాలు యేళ్ల తరబడి అక్కడే పెండింగ్‌లో పడి ఉంటున్నాయి. చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టు తిరిగినప్పటికీ పనులు కావడం లేదు. సకాలంలో కులధ్రువీకరణ పత్రాలు అందకపోవడంతో నిరుద్యోగులు తమ కోటాలోకి వచ్చే ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. అనేక సందర్భాలలో ఈ సర్టిఫికెట్ లేకపోవడంవల్ల వచ్చిన ఉద్యోగం చేజారిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అభ్యర్థులకు సైతం ఇదే పరిస్థితి ఎదురవుతోంది. అదేవిధంగా విద్యార్థులు పైతరగతుల అడ్మిషన్ల కోసం ఇబ్బందులుపడుతున్నారు. కుల ధ్రువీకర ణ పత్రాలు వెంట లేకపోవడంవల్ల రిజర్వేషన్ కోటాలో సీటు సంపాదించుకోలేకపోతున్నారు. దీంతో విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిపోతోంది. అలాగే పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు ఫీజుల చెల్లింపులో రాయితీ ఇవ్వలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజు మొత్తం చెల్లించి అడ్మిషన్ పొందాల్సి వస్తోంది. ఇలా సామాన్య ప్రజలతోపాటు అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జిల్లాల కార్యాలయాల్లోని అదనపు కలెక్టర్లకు వాటిని పరిశీలించే అధికారం ఇవ్వాలని ఫడ్నవిస్ ఆదేశాలు జారీచేశారు. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు వేగవంతంగా, పారదర్శకంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.