Cattle feed
-
పశుపోషకులకు కొండంత భరోసా
సాక్షి, అమరావతి: నాణ్యమైన దాణాను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పశుపోషకులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. పశు పోషణ ఖర్చును భారీగా తగ్గించి.. పాడిరంగాన్ని లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా ఏపీ పశు దాణా చట్టం –2020 తీసుకొచ్చింది. దీని పరిధిలోకి దాణా తయారీ, సరఫరా, అమ్మకం కార్యకలాపాలన్నింటినీ తెచ్చింది. అంతేకాకుండా పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లపెంపకందార్లకు నాణ్యతా ప్రమాణాలు కలిగిన.. కల్తీలేని దాణా, ఖనిజ లవణ మిశ్రమాన్ని నిర్దేశించిన ధరలకు అందించేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే 1,680 మంది తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, స్టాకిస్ట్‌లకు ఈ చట్టం కింద లైసెన్స్‌లు జారీ చేసింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తూ నాసిరకం దాణా తయారీ, విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతోంది. లైసెన్సుల జారీ, శాంపిల్స్ తనిఖీల ద్వారా ఇప్పటివరకు రూ.5.25 కోట్లు వసూలు చేసింది. పశువుల ఆహార అవసరాలకే 70 శాతం ఖర్చు రాష్ట్రంలో 46 లక్షల ఆవులు, 62.19 లక్షల గేదెలు, 1.76 లక్షల గొర్రెలు, 55 లక్షల మేకలు, 10.78 లక్షల పౌల్ట్రీ సంపద ఉంది. మూగజీవాలకు ఏటా 65 లక్షల మెట్రిక్ టన్నుల పశుగ్రాసం అవసరం కాగా ఏటా సగటున 70.92 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతోందని అంచనా. పశుపోషణ కోసం చేసే ఖర్చులో 70 శాతం వాటి ఆహార అవసరాల కోసమే ఉంటోంది. గతంలో నాణ్యత విషయంలో దాణా తయారీదారులు గోప్యత పాటించడం పశుపోషకులకు ఆశనిపాతంగా ఉండేది. దాణాలో.. తేమ, ముడి మాంసకృత్తులు, ముడి కొవ్వు పదార్థాలు, ముడి పీచు పదార్థాలు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఉంటాయి. ఇలా తయారైన దాణాను అధిక మోతాదులో వినియోగిస్తే తప్ప ఆశించిన స్థాయిలో ఉత్పాదన వచ్చేది కాదు. ముడి మాంసకృత్తులను పెంచడానికి కొంతమంది తయారీదారులు చట్టవిరుద్ధమైన పనులు చేసేవారు. దీంతో పెట్టుబడి భారం పెరగడంతోపాటు నాణ్యమైన పాల ఉత్పత్తి రాక పశుపోషకులు ఆర్థికంగా నష్టపోయేవారు. మరోవైపు ఆరోగ్యవంతమైన పశువులు సైతం దీర్ఘకాలిక రోగాల బారిన పడేవి. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకే ప్రభుత్వం ఏపీ పశు దాణా చట్టం తెచ్చింది. ఈ చట్టం 2021 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. చట్టం అమలుకు ప్రత్యేక కమిటీలు పశు దాణా చట్టం అమలు కోసం ప్రత్యేకంగా పశుదాణా నాణ్యత, నియంత్రణ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ‘కంట్రోలింగ్ అథారిటీ, కలెక్టర్, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారుల నేతృత్వంలో జిల్లా స్థాయి లైసెన్సింగ్ అథారిటీలను నియమించింది. పశుదాణా నాణ్యతను తనిఖీ చేసేందుకు స్థానిక పశువైద్యులకు యానిమల్ ఫీడ్ ఇన్స్పెక్టర్లుగా బాధ్యతలు అప్పగించింది. వీరు క్షేత్ర స్థాయి తనిఖీల్లో సేకరించిన శాంపిల్స్‌కు ప్రభుత్వం గుర్తించిన ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు చేస్తున్నారు. తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు ఏపీ యానిమల్ ఫీడ్ యాక్ట్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ పేరిట ప్రత్యేకంగా ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఇప్పటివరకు 1,680 మంది దాణా తయారీదారులు, అమ్మకందార్లకు లైసెన్సులు ఇచ్చింది. ఈ చట్టం అమల్లోకి వచ్చాక గతంతో పోలిస్తే నాసిరకం దాణా తయారీ, సరఫరా, అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని పశుపోషకులు చెబుతున్నారు. నాణ్యత లేని దాణా తయారుచేస్తే క్రిమినల్ కేసులు.. పశు దాణా చట్టం అమల్లోకి వచ్చాక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నాం. నాణ్యత లేని దాణా తయారీదారులు, నిరీ్ణత ప్రమాణాలు పాటించనివారు, తప్పుడు ప్రకటనలు ఇచ్చే కంపెనీలపై ఈ చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. చట్టాన్ని ఉల్లంఘించినట్టు తేలితే కనీసం ఏడేళ్లు జైలుశిక్ష, తగిన జరిమానా పడుతుంది. – డాక్టర్ అమరేంద్రకుమార్ డైరెక్టర్, పశుసంవర్ధక శాఖ -
ప్రొటీన్ ఉంటే.. ‘పాడి’పంటే!
సాక్షి, అమరావతి: పాడి పశువులకు ప్రొటీన్ ఎంతో అవసరం. పశువుల సమగ్ర ఎదుగుదలకు ఇది తోడ్పడుతుంది. పిండోత్పత్తి, పాల దిగుబడి, రోగ నిరోధక శక్తికి మాంసకృత్తులు కావాల్సి ఉంటుంది. నెమరువేసే జంతువుల్లో.. ప్రత్యేకించి పాడి పశువుల అన్నాశయాల్లో మేలు చేసే సూక్ష్మజీవులు(రూమెన్) అభివృద్ధి చెందాలంటే కనీసం 7 శాతం క్రూడ్ ప్రొటీన్(సీపీ) కావాలి. పది కిలోల పాల ఉత్పత్తికి కిలో క్రూడ్ ప్రొటీన్ అవసరమని పశు సంవర్థక శాఖ వైద్యాధికారి డాక్టర్ డి.నాగేశ్వరరావు చెప్పారు. ఈ సందర్భంగా పశువులకు ప్రొటీన్లు అందించే దాణా గురించి వివరించారు. వేరుశనగ చెక్కలో 45 శాతం సీపీ ఉంటుంది. కాల్షియం, విటమిన్ బీ–12 అధికంగా ఉంటాయి. రూమెన్ సూక్ష్మ జీవుల కోసం ప్రొటీన్ ఎక్కువగా లభిస్తుంది. సోయాబీన్ మీల్లో పుష్కలంగా పోషకాలుంటాయి. దీనిలో నాణ్యమైన ప్రొటీన్ లభిస్తుంది. పాలు పెరగడానికి ఇది తోడ్పడుతుంది. 40 శాతం సీపీ ఉంటుంది. పొద్దు తిరుగుడు చెక్కలో 40 శాతం ప్రొటీన్ ఉంటుంది. ఈ చెక్కలో పాలీ అన్ శాచ్యురేటెడ్ ఫాటి ఆసిడ్స్ ఉన్నాయి. ఆవులకు ఆహారంగా దీనిని ఆహారంగా ఇచ్చాక తద్వారా లభించే పాలను మనుషుల ఆరోగ్యం కోసం వినియోగిస్తుంటారు. ఈ పాలు తాగితే గుండె జబ్బులు దూరమవుతాయంటారు. పత్తి చెక్క, కొబ్బరి పిండి, ఆవ పిండి వంటి వాటిని కూడా పాడి పశువులకు వినియోగిస్తారు. కాల్షియం తక్కువగా, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. కొబ్బరి పిండిని పాడిపశువులకు ఉత్తమ దాణాగా చెబుతుంటారు. దీనిలో ప్రొటీన్ నాణ్యమైంది. 90 శాతం వరకూ పొట్టలోనే జీర్ణమవుతుంది. కొబ్బరి పిండిని దాణాగా వాడటం వల్ల పశువుల్లో వెన్న బిరుసుగా ఉండి నాణ్యమైన నెయ్యి వస్తుంది. ఇటీవలి కాలంలో ప్రాచుర్యం పొందిన పశువుల దాణా బ్రూవర్స్ గ్రెయిన్. సారా తయారీలో ఉపయోగించే తృణ ధాన్యాల నుంచి వచ్చే పిప్పి లాంటి పదార్థాలు.. నెమరువేసే జంతువులకు మంచి ఆహారం. క్రూడ్ ప్రొటీన్ 25, 30 శాతం, పీచు 25 నుంచి 27 శాతం వరకూ ఉంటుంది. తెలగ పిండిలో సీపీ 40 శాతం వరకూ ఉంటుంది. పైగా ఇది మంచి విరేచనకారి. ఎరుపు, నలుపు రకాల్లో ఇది దొరుకుతుంది. చేపపొడి పశువుల ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో అమినో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. చూడిని నిలబెడుతుంది. పచ్చి గడ్డి, జనుము, పిల్లి పెసర, అలసంద, పారగడ్డి, హైబ్రీడ్ నేపియర్, తవుడు, జొన్న చొప్ప, రాగి పిండి వంటి వాటిల్లో కూడా ప్రొటీన్ ఉంటుంది. -
మూగజీవాలకు పశుగ్రాసం కొరత
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో మూగజీవాలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. ఈ మేరకు పశుసంవర్ధక శాఖ అంచనా వేసింది. 16 జిల్లాల్లోని, 70 మండలాల్లో ఈ ప్రభావం ఉండనుంది. వాస్తవానికి అన్ని జిల్లాల్లోని మూగజీవాలకు మేత కష్టాలు తప్పేలా లేవు. వేసవి వచ్చినపుడే పశుగ్రాసం గుర్తు రావడం, ముందస్తు ప్రణాళికలు వేసుకోకపోవడంతోనే పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. వేసవిలో పశుగ్రాసం కొరత సాధారణమేనని కొందరు అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. పశుసంవర్ధకశాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4.27 కోట్ల పశువులు ఉన్నాయి. వీటికి జనవరి నుంచి జూన్ వరకు 111.27 లక్షల మెట్రిక్ టన్నుల మేత అవసరం కాగా, 109.77 లక్షల మెట్రిక్ టన్నుల గ్రాసం మాత్రమే అందుబాటులో ఉంది. ఎండు మేతను తీసుకుంటే 101.11 లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉండగా, 82.57 టన్నులు అందుబాటులో ఉందని పశుసంవర్థక శాఖ తన నివేదికలో పేర్కొంది. 16 జిల్లాల్లో అధికం జనగాం, ఆదిలాబాద్, కొత్తగూడెం, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, మేడ్చల్, నల్లగొండ, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కొరత తీవ్రంగా ఉంది. కొత్తగూడెం జిల్లాలో మూడు మండలాలు, భూపాలపల్లిలో రెండు, మహబూబాబాద్‌లో రెండు, మంచిర్యాల్లో ఐదు, నల్లగొండలో 18, నిర్మల్‌లో మూడు, సిరిసిల్లలో రెండు, రంగారెడ్డిలో 16, వికారాబాద్‌లో 6, యాదాద్రి భువనగిరిలోని 13 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు పేర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో సరిపోను గ్రాసం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే గొర్రెలకు పచ్చదనం లేక మేత దొరకని పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ సబ్సిడీ గొర్రెల పంపిణీ జరుగుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. వాటి మేతకు ప్రత్యామ్నాయం చూపకుండా ఇస్తే వేసవిలో అవి చనిపోతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి సాధారణంగా వేసవిలో పశుగ్రాసం కొరత ఉంటుంది. అయినప్పటికీ కొరత తీర్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాం. పశువుల తాగునీటికోసం కొత్తగా 8 వేల నీటి తొట్లను నిర్మిస్తున్నాం. ఇప్పటికే 12 వేల నీటి తొట్లు అందుబాటులో ఉన్నాయి. పంచాయతీరాజ్ శాఖ సహకారంతో అదనపు తొట్లు నిర్మిస్తున్నాం. – డాక్టర్ ఎస్.రామచందర్, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు -
పశువులంటే ప్రాణం... పొద్దుగాలే లేచి
సాక్షి, డెహ్రాడూన్ : అది అల్మోరా జిల్లా ప్రభుత్వాసుపత్రి.. ప్రతీ నాలుగైదు రోజులకోకసారి తీవ్ర గాయాలతో మహిళలు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారంతా చిరుతల దాడుల్లోనే గాయపడి అక్కడ చేరటం విశేషం. వీరంతా తమ పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన సమయంలోనే ఇలాంటి దాడులు చోటుచేసుకోవటం విశేషం. పది రోజుల క్రితం ఆల్మోరా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిల్ఖా గ్రామానికి చెందిన పూజా దేవి పశువుల కోసం గడ్డి తెచ్చేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. అక్కడ ఓ చిరుతపులి ఆమెపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ఉమా దేవి ఆమెను రక్షించే క్రమంలో గాయపడింది. వారి కేకలు విన్న చుట్టు పక్కల స్థానికులు పరిగెత్తుకుంటూ వెళ్లి చిరుతను తరిమారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడినప్పటికీ.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇది తమకు చాలా ఏళ్లుగా అలవాటైపోయిందని ఉమా దేవి చెబుతున్నారు. మాకు పశువులంటే ప్రాణం. అవే మాకు జీవనాధారం. గడ్డి లేకపోతే అవి ఎలా బతుకుతాయి. అందుకే అడవికి వెళ్లక తప్పటం లేదు అని ఆమె చెప్పారు. కొండ ప్రాంతంలో జీవనాధరం లేకపోతే చాలా కష్టం. గిరిజనులు.. పైగా నిరక్షరాస్యులు. వేరే పని లేకపోవటంతో అక్కడ చాలా మట్టుకు పశు సంరక్షణ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబాలకు తిండి పెట్టే మూగ జీవాల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు అని జోయ్ హల్కే అనే మహిళా షూటర్ చెబుతున్నారు. సమస్య దశాబ్దం పైదే ... ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా 600 మంద చిరుతల బారిన పడి చనిపోగా, 3100 మంది గాయపడ్డారు. అంటే సగటున ఏడాదికి 35 మంది చిరుత పంజాకు బలవుతున్నారన్న మాట. వీరిలో 30 శాతం మంది పురుషులు, 20 శాతం మంది పిల్లలు, ఇక మిగిలిన 50 శాతం మహిళలే కావటం గమనార్హం. ఆల్మోరా, పౌరీ జిల్లాల్లో ఈ దాడులు ఏటా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా 150 చిరుతలను మ్యాన్ ఈటర్లుగా గుర్తించి వాటిలో 40ని మట్టుపెట్టగలిగారు. మరో 40 చిరుతలను బంధించగలిగారు. గ్రామస్థులను అడవుల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నయ మార్గాలు లేకపోవటంతో వాళ్లు వాళ్ల జీవితాలను పణంగా పెడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఖటి అనే అటవీ అధికారి చెబుతున్నారు. -
కోట్ల టర్నోవర్ దిశగా రాందేవ్ 'పతంజలి'
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారధ్యంలోని పతంజలి గ్రూపు 10,000 కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో దూసుకు పోతోంది. మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలో పాలతోపాటు మరిన్ని పాల ఉత్పత్తులు, పశువుల దాణా, ప్రకృతి సిద్ధమైన ఎరువులు మార్కెట్లోకి విడుదల చేస్తామని బాబా రాందేవ్ ఆదివారం చండీగడ్ లో ప్రకటించారు. దీనికోసం కంపెనీ మూడు లేదా నాలుగు ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులు అందించడంతో పాటు రైతుల సాధికారత కోసం సహజ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్టు రాందేవ్ చెప్పారు. యూరియా లేకుండా పశు దాణాతోపాటు సహజ సిద్ధమైన ఎరువులనూ పెద్ద ఎత్తున తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పతంజలి గ్రూపు టర్నోవర్ రూ.10,000 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు. అటు సంచలనాత్మకంగా మారిన పతంజలి ఆవనూనె ప్రచార ప్రకటనపై కూడా రాం దేవ్ స్పందించారు. ఆ ప్రకటన నిలిపివేసినట్టు చెప్పారు. కేవలం రసాయన ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆయిల్ ప్రజలకు అనారోగ్యకరమైందని మాత్రమే తాము చెప్పామన్నారు. జండు, డాబర్, హమ్ దర్ద్ లాంటి వాటిని తాము టేక్ ఓవర్ చేయమని తెలిపారు. దేశీయ కంపెనీలు వృద్ధి చెందాలన్నారు. దేశీయ కంపెనీల మధ్య పోటీకి బదులుగా అంతర్జాతీయ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో పిండి, ఔషధం, బియ్యం సహా దాదాపు 250కి పైగా ఉత్పత్తులను 'నో లాభం నో నష్టం' పద్ధతిలో విక్రయించినట్టు చెప్పారు. దేశంలో సరఫరా అవుతున్న పశువుల ఆహారంలో 1-4శాతం యూరియా, 50 శాతం కంటే ఎక్కువ బోవిన్ ఉంటోందని, ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. అందుకే పతంజలి గ్రూప్ పంటలకు సూక్ష్మ పోషక, విటమిన్లు కలిగిన సహజ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తాము ఆరు రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. సహజ మందులు, సహజ ఆహారం, సహజ సౌందర్య సాధనాలు, పాల ఉత్పత్తులు , పశువుల దాణా, సహజ ఎరువుల ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయరు చేయనున్నట్టు పేర్కొన్నారు అనారోగ్యకరమైన ఉత్పత్తులను పతంజలి ఎపుడూ తయారు చేయదని స్పష్టం చేశారు. అలాగే మద్యం, మాంసాహారం మానవులకు హాని చేస్తాయన్నారు. అలాగే తాము బ్రెడ్ తయారు చేయడంలేదని తెలిపారు. -
వామ్మో.. వయ్యారిభామ!
* పంటలు, పశువులు, మానవాళికి ప్రమాదకరంగా మారిన మొక్కలు * మేల్కోకపోతే ఇబ్బందులు తప్పవంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు ‘వయ్యారిభామ’ అందమైన ఈ పేరు వింటేనే అన్నదాత ఆందోళనకు గురవుతాడు. ఈ మొక్కకు నిలువెల్లా విషమే ఉంటుంది. దీని ద్వార మనుషులకు, పశు సంపదకు, పంటలకు కలిగే నష్టం ఎంతో తీవ్రమైనది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా వ్యాప్తిచెందిన వీటి మనుగడను నివారించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏరువాక అధికారులు హెచ్చరిస్తున్నారు. మెదక్ రూరల్: అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల ద్వారా 1970వ సంవత్సరంలో వయ్యారిభామ మన దేశానికి వచ్చినట్లు గుర్తించారు. గడిచిన 44 ఏళ్లలో ఈ మొక్కలు ఊరూ, వాడా పల్లె, పట్టణం అనే తేడాలేకుండా విస్తరించిపోయాయి. ఏటికేడు వీటి బెడద అధికం కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ విషపు మొక్కలను నివారించకపోతే భారీ నష్టాలు తప్పని సంగారెడ్డి ఏరువాక కో ఆర్డినేటర్ ఏ శ్రీనివాస్, ఫోన్: 9989623819 తెలిపారు. ఆయన అందించిన సలహాలు, సూచనలు... వయ్యారిభామతో కలిగే నష్టాలు ఒక్కో మొక్క నుంచి లక్షకు తగ్గకుండా విత్తనాలను గాల్లోనే ఇతర ప్రాంతాలకు చేరుతాయి. ఈ మొక్క అవశేషాలు కాళ్లకు, చేతులకు తగిలినా ఎలర్జీ (దురద) వస్తుంది. పూత దశలో గాలి ద్వారా ఎగిసిపడే దీని పుప్పొడిని మనుషులు పీలిస్తే ఆస్తమ బారిన పడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. పసిపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. పశువులు గడ్డితో పాటు ఈ మొక్కను మేసినట్లయితే అనారోగ్యం బారిన పడతాయి. వయ్యారిభామను తిన్న పశువుల పాలను తాగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది. ఇది పంట పొలంలో పెరిగితే పంటకు వాడే రసాయన, సేంద్రియ ఎరువుల్లోని 60 శాతం సారాన్ని ఈ మొక్కనే తీసుకుని పంట ఎదుగుదలను పూర్తిగా నివారిస్తుంది. ఫలితంగా దిగుబడి ఘననీయంగా తగ్గుతుంది. నివారణ చర్యలు - పంటపొలాల్లో మొలిచిన వయ్యారిభామ మొక్కలను పూతపూయక ముందు బురదలో కలియదున్ని పొలంలో నీరు పెడితే మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది. - వయ్యారిభామ పూత దశకు ముందే వేళ్లతో సహా పీకి తగులబెట్టాలి. - దీన్ని కాలబెడుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి. - తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిభామను నివారించే శక్తి తంగేడు మొక్కకు ఉంటుంది. - పొలాల గట్లు, జంజరు భూముల్లోలో ఉన్న తంగేడు చెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించవద్దు. ఎండుతున్న మక్క శేన్లు ‘‘ఏం ఎల్లన్నా.. ఏం జేస్తన్నవే.. ఏముంది తమ్మీ.. వాన దేవునికి మన మీద దయ గల్గుతలేదాయె.. ఏశిన పంటలు ఎండిపోవట్టె.. తెచ్చిన అప్పులోళ్లకు ఏం కట్టాల్నో.. ఎట్లా ఇయ్యాల్నో.. మనుసున వడ్తలేదు తమ్మీ.. రాత్రి నిద్రవడ్తలేదాయె.. పొద్దంతా బాయికాడికొస్తె వాడిపోతున్న మక్కజొన్న, పత్తి శేనును సూశి పుట్టెడు దుఃఖం రావట్టె’’.. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లికి చెందిన ఇద్దరు రైతుల మధ్య గురువారం జరిగిన సంభాషణ ఇది.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా వర్షాధార పంటలు మాత్రం జానెడు కూడా పెరగలేదు. దీనికి తోడు పదిహేను రోజుల నుంచి వానల జాడ లే క వేసిన పంటలు సైతం మాడిపోతున్నాయి. ఈ సమయంలో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ మండల వ్యవసాయ అధికారి ప్రతాప్‌ను, ఫోన్: 8886612489 అడగగా ‘వర్షాభావం వల్ల పంటలు వాడిపోతుంటే లీటర్ నీటికి 5గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే మొక్కలు ఎండిపోకుండా ఉంటాయని తెలిపారు. ఇన్నావే.. ఎల్లన్నా.. మన సారు గీ ముచ్చట నీ కోసమే గాదు.. రైతులందరి కోసం జెప్పిండు.. ఇంకెందుకు ఆలిశం.. సారు జెప్పినట్టు జెయ్... - దౌల్తాబాద్ వరిలో మొగి (శిఖ) పురుగు నివారణకు... ప్రశ్న: వరి పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి, కొన పట్టుకుని పీకితే ఊడి వస్తుంది. దీని నివారణకు ఏం చేయాలో తెలియజేయండి. - నర్సింహారెడ్డి, దేవులపల్లి, ఫోన్: 9959409250 జవాబు: వరి పంటలో మొక్కలు ఎండిపోయి, చేతితో పీకితే కాండం వరకు ఊడి వస్తుందంటే మొగిపురుగు (శిఖపురుగు) సోకినట్లు తెలుస్తోంది. పంట మార్పిడి పాటించకపోవడం, యంత్రాలతో వరి కోత కోయడం వల్ల మిగిలిపోయిన వరి మొదలు సరిగా తొలగించక పోవడం, వేసవి దుక్కులు సరిగా చేయక పోవడంవల్ల ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణ కోసం కాట్రాఫ్ హైడ్రో క్లోరైడ్ త్రీజీ గుళికలను ఎకరాకు 4 నుంచి 6 కిలోలు చొప్పున పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 400 నుంచి 600 గ్రాముల కాట్రాఫ్ హైడ్రో క్లోరైడ్ పౌడర్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళలో స్ప్రే చేయాలి - ప్రేంరాజ్, ఏఈఓ కౌడిపల్లి, ఫోన్ నంబర్ 9505151043 -
క్షీర సంక్షోభం
ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలివీ.. - పాడి పశువులకు అధిక మొత్తంలో రాయితీ కల్పించాలి. - పశువులకు పౌష్టికాహారం, పశువుల దాణాను చౌకగా అందించాలి. - సన్న, చిన్న కారు రైతులకు పచ్చిమేతలు ఉచితంగా ఇవ్వాలి. - పాడిని వదిలించుకోకుండా కాపాడుకునే స్థితిని ప్రభుత్వం కల్పించాలి. ఒంగోలు టూటౌన్: క్షీర సంక్షోభం తారస్థాయికి చేరుతోంది. పాలసేకరణ దారుణంగా పడిపోతోంది. వినియోగదారులకు విక్రయించే పాలలో సగం కూడా నేరుగా రైతుల నుంచి ఒంగోలు డెయిరీ సేకరించలేకపోతోంది. జిల్లాలో పాలడెయిరీకి పాలు పోయడం క్రమేణా తగ్గుతోంది. ఈ ప్రభావం మొత్తం పాలధరల పెంపుపై పడుతోంది. - జిల్లాలో ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఒంగోలు డెయిరీ)తో పాటు మొత్తం 72 ప్రైవేట్ డెయిరీలున్నాయి. ఒంగోలు డెయిరీ పరిధిలో 1050 కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతోంది. నెలకు సుమారుగా 16 నుంచి 18 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. దీనిలో ఒంగోలు డెయిరీ 60 వేల లీటర్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 45 వేల లీటర్లు సేక రించే సరికే చతికిల పడుతోంది. - ఉత్పత్తికన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాలధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో భాగంగానే జిల్లా డెయిరీ గత నెల 11న పాల ధరలను పెంచింది. అరలీటర్ డబుల్ టోన్డ్ పాలు పాత ధర రూ.18 ఉంటే రూపాయి పెంచి రూ.19 చేశారు. ఫుల్క్రీమ్ పాలు అరలీటర్ రూ.23 ఉండగా రూ.24కు పెంచారు. ఈ లెక్కన లీటర్ రూ.48 చేరింది. హోమోజినైజ్డ్ఫుల్ క్రీమ్ పాలు అరలీటరు రూ.23 నుంచి రూ.24 పెరిగింది. అదే విధంగా హోమోజినైజ్డ్టోన్డ్ పాలు రూ.19 నుంచి రూ.20 పెంచారు. - పెరుగు ధరలు పెంచకుండా కొంత ఊరట కలిగించారు. ప్రైవేట్ దుకాణాలలో మాత్రం కొన్ని చోట్ల అరలీటర్ ప్యాకెట్ రూ.25 అమ్ముతూ వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. పాల వినియోగం పెరగడంతో పాలపొడిపై ఆధారపడాల్సి వస్తోంది. డెయిరీ పాలకవర్గం పెట్టుకున్న లక్ష లీటర్ల లక్ష్యం కలగానే మిగిలింది. - జిల్లాలో మొత్తం 13,88,975 లక్షల వరకు ఆవులు, గేదేలు ఉన్నాయి. సుమారుగా లక్ష వరకు పాడి గేదెలు, పాడి ఆవులు ఉన్నాయి. పశుక్రాంతిపథకం, రాష్ట్రీయ కృషి యోజన, మినీ డెయిరీలు, జీవక్రాంతి తదితర పథకాలున్నా ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరడం లేదు పెరిగిన దాణా..మేత ఖర్చులు : మూడేళ్లుగా దాణా, మేతల ధరల పెంపు అధికమైంది. 2010 సంవత్సరంలో తవుడు రూ.11 నుంచి రూ.13 వరకు పెరిగింది. మరుసటి ఏడాది కిలో ధర రూ.14 నుంచి రూ.16 కి పెరిగింది. 2012లో తవుడు మొదటి రకం ధర కిలో రూ.22 ఉండగా, రెండవ రకం రూ. 19 పలికింది. 2013లో కిలో రూ.27 ఉండగా, కొబ్బరి పిట్టు రూ.27 పెరిగింది. నువ్వులు కిలో రూ.32, వేరుశనగ చెక్క రూ.32, సెంటు విస్తీర్ణంలో పచ్చగడ్డి కొనుగోలు ధర రూ.200 నుంచి రూ.600 పెరిగింది. గేదెకు ఒక ఏడాదికి ట్రాక్టర్ గడ్డి కావాలి. రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. గత రెండు సంవత్సరాల్లో అదికాస్తా రూ.10 వేలు అయింది. పశువుల పోషణ ఆర్థికంగా పెనుభారమై పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వెన్నశాతంలో మాయాజాలం: పాలవెన్న శాతంలో ప్రైవేట్ డెయిరీల మాయాజాలం అంతా ఇంతా అని చెప్పలేం. ఈ విషయంలో ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే సహకార డెయిరీలు కొంత నయమనిపిస్తున్నాయి. 10 శాతం వెన్న ఉన్న లీటరు పాలకు ఒంగోలు డెయిరీ రూ.43.50 ఇస్తుంటే, అదే పదిశాతం వెన్న ఉన్న పాలకు ప్రైవేట్ డెయిరీలు రూ.40.50 ఇస్తున్నాయి. దీంతో పశుపోషకులకు నష్టాలు తప్పడం లేదు. తగ్గిన పాల దిగుబడి: మండుతున్న ఎండలకు పాడిపశువులు అల్లాడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది. దీనికి తోడు పచ్చగడ్డి కనుచూపు మేరలో కనిపించడం లేదు. వర్షాలు లేక పొలాలు బీడులయ్యాయి. దీంతో పాల దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఒక గేదె రోజులో 4 లీటర్ల కంటే తక్కువగానే ఇచ్చే పరిస్థితి ఉంది.