క్షీర సంక్షోభం | Milk crisis | Sakshi
Sakshi News home page

క్షీర సంక్షోభం

Published Sat, Jul 12 2014 4:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM

Milk crisis

ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలివీ..
- పాడి పశువులకు అధిక మొత్తంలో రాయితీ కల్పించాలి.
- పశువులకు పౌష్టికాహారం, పశువుల దాణాను చౌకగా అందించాలి.
- సన్న, చిన్న కారు రైతులకు పచ్చిమేతలు ఉచితంగా ఇవ్వాలి.
- పాడిని వదిలించుకోకుండా కాపాడుకునే స్థితిని ప్రభుత్వం కల్పించాలి.

 ఒంగోలు టూటౌన్: క్షీర సంక్షోభం తారస్థాయికి చేరుతోంది.  పాలసేకరణ దారుణంగా పడిపోతోంది.  వినియోగదారులకు విక్రయించే పాలలో సగం కూడా నేరుగా రైతుల నుంచి ఒంగోలు డెయిరీ సేకరించలేకపోతోంది. జిల్లాలో పాలడెయిరీకి పాలు పోయడం క్రమేణా తగ్గుతోంది. ఈ ప్రభావం మొత్తం పాలధరల పెంపుపై పడుతోంది.
- జిల్లాలో ప్రకాశం పాల ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్ (ఒంగోలు డెయిరీ)తో పాటు మొత్తం 72 ప్రైవేట్ డెయిరీలున్నాయి. ఒంగోలు డెయిరీ పరిధిలో 1050 కేంద్రాల ద్వారా పాల సేకరణ జరుగుతోంది. నెలకు సుమారుగా 16 నుంచి 18 వేల లీటర్ల పాలు సేకరిస్తున్నారు. దీనిలో ఒంగోలు డెయిరీ 60 వేల లీటర్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే కేవలం 45 వేల లీటర్లు సేక రించే సరికే చతికిల పడుతోంది.
- ఉత్పత్తికన్నా డిమాండ్ ఎక్కువగా ఉండటంతో పాలధరలు పెంచాల్సిన పరిస్థితి వస్తోంది. అందులో భాగంగానే జిల్లా డెయిరీ గత నెల 11న పాల ధరలను పెంచింది. అరలీటర్ డబుల్ టోన్డ్ పాలు పాత ధర రూ.18 ఉంటే రూపాయి పెంచి రూ.19 చేశారు. ఫుల్‌క్రీమ్ పాలు అరలీటర్ రూ.23 ఉండగా రూ.24కు పెంచారు. ఈ లెక్కన లీటర్ రూ.48 చేరింది. హోమోజినైజ్డ్‌ఫుల్ క్రీమ్ పాలు అరలీటరు రూ.23 నుంచి రూ.24 పెరిగింది. అదే విధంగా హోమోజినైజ్డ్‌టోన్డ్ పాలు రూ.19 నుంచి రూ.20 పెంచారు.
- పెరుగు ధరలు పెంచకుండా కొంత ఊరట కలిగించారు. ప్రైవేట్ దుకాణాలలో మాత్రం కొన్ని చోట్ల అరలీటర్ ప్యాకెట్ రూ.25 అమ్ముతూ వినియోగదారులకు చుక్కలు చూపుతున్నారు. పాల వినియోగం పెరగడంతో పాలపొడిపై ఆధారపడాల్సి వస్తోంది. డెయిరీ పాలకవర్గం పెట్టుకున్న లక్ష లీటర్ల లక్ష్యం కలగానే మిగిలింది.
- జిల్లాలో  మొత్తం 13,88,975 లక్షల వరకు ఆవులు, గేదేలు ఉన్నాయి. సుమారుగా లక్ష వరకు పాడి గేదెలు, పాడి ఆవులు ఉన్నాయి. పశుక్రాంతిపథకం, రాష్ట్రీయ కృషి యోజన, మినీ డెయిరీలు, జీవక్రాంతి తదితర పథకాలున్నా ఆశించిన స్థాయిలో రైతుల దరి చేరడం లేదు

 పెరిగిన దాణా..మేత ఖర్చులు :
మూడేళ్లుగా దాణా, మేతల ధరల పెంపు అధికమైంది.  2010 సంవత్సరంలో తవుడు రూ.11 నుంచి రూ.13 వరకు పెరిగింది. మరుసటి ఏడాది కిలో ధర రూ.14 నుంచి రూ.16 కి పెరిగింది. 2012లో తవుడు మొదటి రకం ధర కిలో రూ.22 ఉండగా, రెండవ రకం రూ. 19 పలికింది. 2013లో కిలో రూ.27 ఉండగా, కొబ్బరి పిట్టు రూ.27 పెరిగింది. నువ్వులు కిలో రూ.32, వేరుశనగ చెక్క రూ.32, సెంటు విస్తీర్ణంలో పచ్చగడ్డి కొనుగోలు ధర రూ.200 నుంచి రూ.600 పెరిగింది. గేదెకు ఒక ఏడాదికి ట్రాక్టర్ గడ్డి కావాలి. రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెరిగింది. గత రెండు సంవత్సరాల్లో అదికాస్తా రూ.10 వేలు అయింది. పశువుల పోషణ ఆర్థికంగా పెనుభారమై పాడి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
 
వెన్నశాతంలో మాయాజాలం:
 పాలవెన్న శాతంలో ప్రైవేట్ డెయిరీల మాయాజాలం అంతా ఇంతా అని చెప్పలేం. ఈ విషయంలో ప్రైవేట్ డెయిరీలతో పోల్చితే సహకార డెయిరీలు కొంత నయమనిపిస్తున్నాయి. 10 శాతం వెన్న ఉన్న లీటరు పాలకు ఒంగోలు డెయిరీ రూ.43.50 ఇస్తుంటే, అదే పదిశాతం వెన్న ఉన్న పాలకు ప్రైవేట్ డెయిరీలు రూ.40.50 ఇస్తున్నాయి. దీంతో పశుపోషకులకు నష్టాలు తప్పడం లేదు.
 
తగ్గిన పాల దిగుబడి:
 మండుతున్న ఎండలకు పాడిపశువులు అల్లాడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల ప్రభావం పాల దిగుబడిపై పడుతోంది.
 దీనికి తోడు పచ్చగడ్డి కనుచూపు మేరలో కనిపించడం లేదు. వర్షాలు లేక పొలాలు బీడులయ్యాయి. దీంతో పాల దిగుబడి పూర్తిగా పడిపోయింది. ఒక గేదె రోజులో 4 లీటర్ల కంటే తక్కువగానే ఇచ్చే పరిస్థితి ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement