కోట్ల టర్నోవర్ దిశగా రాందేవ్ 'పతంజలి'
ముంబై: ప్రముఖ యోగా గురు బాబా రాందేవ్ సారధ్యంలోని పతంజలి గ్రూపు 10,000 కోట్ల టర్నోవర్ సాధించే లక్ష్యంతో దూసుకు పోతోంది. మరిన్ని ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. త్వరలో పాలతోపాటు మరిన్ని పాల ఉత్పత్తులు, పశువుల దాణా, ప్రకృతి సిద్ధమైన ఎరువులు మార్కెట్‌లోకి విడుదల చేస్తామని బాబా రాందేవ్ ఆదివారం చండీగడ్ లో ప్రకటించారు. దీనికోసం కంపెనీ మూడు లేదా నాలుగు ప్రాజెక్టులు చేపట్టబోతున్నట్టు వెల్లడించారు. వీటి ద్వారా వినియోగదారులకు కల్తీలేని పాల ఉత్పత్తులు అందించడంతో పాటు రైతుల సాధికారత కోసం సహజ ఉత్పత్తులను అందుబాటులోకి తెస్తున్నట్టు రాందేవ్ చెప్పారు. యూరియా లేకుండా పశు దాణాతోపాటు సహజ సిద్ధమైన ఎరువులనూ పెద్ద ఎత్తున తయారు చేయబోతున్నట్టు ప్రకటించారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి పతంజలి గ్రూపు టర్నోవర్ రూ.10,000 కోట్లకు చేరుతుందని పేర్కొన్నారు.
అటు సంచలనాత్మకంగా మారిన పతంజలి ఆవనూనె ప్రచార ప్రకటనపై కూడా రాం దేవ్ స్పందించారు. ఆ ప్రకటన నిలిపివేసినట్టు చెప్పారు. కేవలం రసాయన ప్రక్రియ ద్వారా తయారయ్యే ఆయిల్ ప్రజలకు అనారోగ్యకరమైందని మాత్రమే తాము చెప్పామన్నారు. జండు, డాబర్, హమ్ దర్ద్ లాంటి వాటిని తాము టేక్ ఓవర్ చేయమని తెలిపారు. దేశీయ కంపెనీలు వృద్ధి చెందాలన్నారు. దేశీయ కంపెనీల మధ్య పోటీకి బదులుగా అంతర్జాతీయ (ఎఫ్ఎంసీజీ) కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో పిండి, ఔషధం, బియ్యం సహా దాదాపు 250కి పైగా ఉత్పత్తులను 'నో లాభం నో నష్టం' పద్ధతిలో విక్రయించినట్టు చెప్పారు.
దేశంలో సరఫరా అవుతున్న పశువుల ఆహారంలో 1-4శాతం యూరియా, 50 శాతం కంటే ఎక్కువ బోవిన్ ఉంటోందని, ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని తెలిపారు. అందుకే పతంజలి గ్రూప్ పంటలకు సూక్ష్మ పోషక, విటమిన్లు కలిగిన సహజ ఎరువులను ఉత్పత్తి చేస్తున్నట్టు చెప్పారు. తాము ఆరు రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్టు చెప్పారు. సహజ మందులు, సహజ ఆహారం, సహజ సౌందర్య సాధనాలు, పాల ఉత్పత్తులు , పశువుల దాణా, సహజ ఎరువుల ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయరు చేయనున్నట్టు పేర్కొన్నారు అనారోగ్యకరమైన ఉత్పత్తులను పతంజలి ఎపుడూ తయారు చేయదని స్పష్టం చేశారు. అలాగే మద్యం, మాంసాహారం మానవులకు హాని చేస్తాయన్నారు. అలాగే తాము బ్రెడ్ తయారు చేయడంలేదని తెలిపారు.