వామ్మో.. వయ్యారిభామ!
* పంటలు, పశువులు, మానవాళికి ప్రమాదకరంగా మారిన మొక్కలు
* మేల్కోకపోతే ఇబ్బందులు తప్పవంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు
‘వయ్యారిభామ’ అందమైన ఈ పేరు వింటేనే అన్నదాత ఆందోళనకు గురవుతాడు. ఈ మొక్కకు నిలువెల్లా విషమే ఉంటుంది. దీని ద్వార మనుషులకు, పశు సంపదకు, పంటలకు కలిగే నష్టం ఎంతో తీవ్రమైనది. ఎక్కడపడితే అక్కడ ఇబ్బడిముబ్బడిగా వ్యాప్తిచెందిన వీటి మనుగడను నివారించకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏరువాక అధికారులు హెచ్చరిస్తున్నారు.
మెదక్ రూరల్: అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న గోధుమల ద్వారా 1970వ సంవత్సరంలో వయ్యారిభామ మన దేశానికి వచ్చినట్లు గుర్తించారు. గడిచిన 44 ఏళ్లలో ఈ మొక్కలు ఊరూ, వాడా పల్లె, పట్టణం అనే తేడాలేకుండా విస్తరించిపోయాయి. ఏటికేడు వీటి బెడద అధికం కావడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ విషపు మొక్కలను నివారించకపోతే భారీ నష్టాలు తప్పని సంగారెడ్డి ఏరువాక కో ఆర్డినేటర్ ఏ శ్రీనివాస్, ఫోన్: 9989623819 తెలిపారు. ఆయన అందించిన సలహాలు, సూచనలు...
వయ్యారిభామతో కలిగే నష్టాలు
ఒక్కో మొక్క నుంచి లక్షకు తగ్గకుండా విత్తనాలను గాల్లోనే ఇతర ప్రాంతాలకు చేరుతాయి.
ఈ మొక్క అవశేషాలు కాళ్లకు, చేతులకు తగిలినా ఎలర్జీ (దురద) వస్తుంది. పూత దశలో గాలి ద్వారా ఎగిసిపడే దీని పుప్పొడిని మనుషులు పీలిస్తే ఆస్తమ బారిన పడటం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది.
పసిపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులపై దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది.
పశువులు గడ్డితో పాటు ఈ మొక్కను మేసినట్లయితే అనారోగ్యం బారిన పడతాయి.
వయ్యారిభామను తిన్న పశువుల పాలను తాగితే జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది.
ఇది పంట పొలంలో పెరిగితే పంటకు వాడే రసాయన, సేంద్రియ ఎరువుల్లోని 60 శాతం సారాన్ని ఈ మొక్కనే తీసుకుని పంట ఎదుగుదలను పూర్తిగా నివారిస్తుంది. ఫలితంగా దిగుబడి ఘననీయంగా తగ్గుతుంది.
నివారణ చర్యలు
- పంటపొలాల్లో మొలిచిన వయ్యారిభామ మొక్కలను పూతపూయక ముందు బురదలో కలియదున్ని పొలంలో నీరు పెడితే మురిగి పచ్చిరొట్ట ఎరువుగా మారుతుంది.
- వయ్యారిభామ పూత దశకు ముందే వేళ్లతో సహా పీకి తగులబెట్టాలి.
- దీన్ని కాలబెడుతున్నప్పుడు వచ్చే పొగకు దూరంగా ఉండాలి.
- తంగేడు చెట్లు ఉన్న ప్రాంతంలో ఈ మొక్క మొలవదు. వయ్యారిభామను నివారించే శక్తి తంగేడు మొక్కకు ఉంటుంది.
- పొలాల గట్లు, జంజరు భూముల్లోలో ఉన్న తంగేడు చెట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తొలగించవద్దు.
ఎండుతున్న మక్క శేన్లు
‘‘ఏం ఎల్లన్నా.. ఏం జేస్తన్నవే.. ఏముంది తమ్మీ.. వాన దేవునికి మన మీద దయ గల్గుతలేదాయె.. ఏశిన పంటలు ఎండిపోవట్టె.. తెచ్చిన అప్పులోళ్లకు ఏం కట్టాల్నో.. ఎట్లా ఇయ్యాల్నో.. మనుసున వడ్తలేదు తమ్మీ.. రాత్రి నిద్రవడ్తలేదాయె.. పొద్దంతా బాయికాడికొస్తె వాడిపోతున్న మక్కజొన్న, పత్తి శేనును సూశి పుట్టెడు దుఃఖం రావట్టె’’.. మండల పరిధిలోని లింగారెడ్డిపల్లికి చెందిన ఇద్దరు రైతుల మధ్య గురువారం జరిగిన సంభాషణ ఇది.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటినా వర్షాధార పంటలు మాత్రం జానెడు కూడా పెరగలేదు.
దీనికి తోడు పదిహేను రోజుల నుంచి వానల జాడ లే క వేసిన పంటలు సైతం మాడిపోతున్నాయి. ఈ సమయంలో ఏం చేయాలో తోచక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై ‘సాక్షి’ మండల వ్యవసాయ అధికారి ప్రతాప్‌ను, ఫోన్: 8886612489 అడగగా ‘వర్షాభావం వల్ల పంటలు వాడిపోతుంటే లీటర్ నీటికి 5గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే మొక్కలు ఎండిపోకుండా ఉంటాయని తెలిపారు. ఇన్నావే.. ఎల్లన్నా.. మన సారు గీ ముచ్చట నీ కోసమే గాదు.. రైతులందరి కోసం జెప్పిండు.. ఇంకెందుకు ఆలిశం.. సారు జెప్పినట్టు జెయ్...
- దౌల్తాబాద్
వరిలో మొగి (శిఖ) పురుగు నివారణకు...
ప్రశ్న: వరి పొలంలో అక్కడక్కడ మొక్కలు ఎండిపోతున్నాయి, కొన పట్టుకుని పీకితే ఊడి వస్తుంది. దీని నివారణకు ఏం చేయాలో తెలియజేయండి.
- నర్సింహారెడ్డి, దేవులపల్లి, ఫోన్: 9959409250
జవాబు: వరి పంటలో మొక్కలు ఎండిపోయి, చేతితో పీకితే కాండం వరకు ఊడి వస్తుందంటే మొగిపురుగు (శిఖపురుగు) సోకినట్లు తెలుస్తోంది. పంట మార్పిడి పాటించకపోవడం, యంత్రాలతో వరి కోత కోయడం వల్ల మిగిలిపోయిన వరి మొదలు సరిగా తొలగించక పోవడం, వేసవి దుక్కులు సరిగా చేయక పోవడంవల్ల ఈ పురుగు ఆశిస్తుంది. దీని నివారణ కోసం కాట్రాఫ్ హైడ్రో క్లోరైడ్ త్రీజీ గుళికలను ఎకరాకు 4 నుంచి 6 కిలోలు చొప్పున పొలంలో చల్లాలి. లేదా ఎకరాకు 400 నుంచి 600 గ్రాముల కాట్రాఫ్ హైడ్రో క్లోరైడ్ పౌడర్‌ను 200 లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళలో స్ప్రే చేయాలి
- ప్రేంరాజ్, ఏఈఓ కౌడిపల్లి, ఫోన్ నంబర్ 9505151043