CBCID investigation
-
పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు
సాక్షి, చెన్నై : ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్ చేసి అతడి ఆస్తులు రాయించుకున్న కేసులో ఇన్స్పెక్టర్, ఎస్ఐలు సహా పది మంది పోలీసులపై ఆదివారం సీబీసీఐడీ ఆరు సెక్షన్లతో కేసు నమో దు చేసింది. చెన్నై అయపాక్కంకు చెందిన పారి శ్రామికవేత్త రాజేష్ ఆరు నెలల క్రితం కిడ్నాప్ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనతో బలవంతంగా స్టాంప్ పేపర్ల మీద సంతకం తీసుకుని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్ చేసిన వారిలో పోలీసు అధికారులు ఉన్నట్టు రాజేష్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు సీబీసీఐడీకి చేరింది. ఆరు నెలలుగా ఈ కేసును సీబీసీఐడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులే కిడ్నాపర్లని తేలింది. తిరుమంగళం ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐలు సహా పది మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి విచారించేందుకు సీబీసీఐడీ సిద్ధమవుతోంది. మరో కీచక పోలీసు సాక్షి, చెన్నై: యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడి కోసం మహిళా పోలీసులు గాలిస్తు న్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారస పడింది. ఆమె నెంబరు తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్‌మెన్‌గా మారాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని, కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు. అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్ తప్పించుకునే యత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ జాక్సన్‌ను ఆదివారం సస్పెండ్ చేశారు. ఈ సమాచారంతో జాక్సన్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి కోసం తిరుచెందూరు మహిళా పోలీసులు గాలిస్తున్నారు. కొద్ది రోజులుగా అధిక సంఖ్యలో పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం. నాగరాజన్‌పై గూండా చట్టం క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన కేసులో అథ్లెటిక్ శిక్షకుడు నాగరాజన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న పూర్వ క్రీడాకారాణులు సైతం ఆన్లైన్లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయనపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసు కమిషనర్ శంకర్ జివ్వాల్ ఆదివారం ఆదేశించారు. చదవండి: మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్ కిడ్నాప్ -
టీడీపీ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌పై విచారణ
సాక్షి, గుంటూరు:టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్‌రావు గురజాలలో చేసిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో సీబీసీఐడీ విచారణ ప్రారంభించింది. టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కనుసన్నల్లో జరుగుతున్న ఈ దందాపై ఎట్టకేలకు విచారణను ప్రారంభించారు. దీనిలో భాగంగా సీబీఐ, మైనింగ్ అధికారులు పిడుగురాళ్ల పీఎస్‌కు చేరుకున్నారు.18 ఏళ్ల మైనింగ్ లావాదేవీలపై సీబీఐ విచారణ జరుపుతోంది. సున్నం తయారీ మిల్లర్లతోనూ సమావేశం ఏర్పాటుచేశారు. అంతకుముందు అక్రమ మైనింగ్ జరిగిన పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో గతంలో పనిచేసిన, ప్రస్తుతం పనిచేస్తోన్న అధికారులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. యరపతినేనికి క్లీన్ చిట్ ఇవ్వటానికే... గురజాల అక్రమ మైనింగ్ కేసులో టీడీపీ ఎమ్మెల్యే యరపతి శ్రీనివాస రావుకు క్లీనచీట్ ఇవ్వటానికే సీఐడీ విచారణను జరుపుతున్నారని వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త కాసు మహేష్ రెడ్డి ఆరోపించారు. సీబిఐతో జరపాల్సిన విచారణను సీఐడీతో జరిపించాల్సిన అవసరమేంటని నిలదీశారు. టీడీపీకి సీఐడీ తోక సంస్థ అని, ఏ ఎమ్మెల్యే నైనా విచారించిన ఘనత సీఐడికి ఉందా అని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు దోచిన స్కాంను సీబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డెబ్బై వేలు విలువ చేసే భూములను అప్పట్లోనే రెండు మూడు లక్షల చొప్పున కొన్నారని, ఈ భూములపై యరపతినేని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. చదవండి: అక్రమం చేసిందొకరు.. బలయ్యేది ఎందరో..? -
హజ్ యాత్ర పేరుతో ట్రావెల్స్ నిర్వాకం..
సాక్షి, వైఎస్సార్ : ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసంలో హజ్ యాత్ర పేరుతో ప్రజలను మోసం చేసి కెఎస్ఎస్ ట్రావెల్స్ వారి నుంచి డబ్బులు, పాస్‌పోర్టులు వసూలు చేసి తరువాత నుంచి మొహం చాటేసింది. నిర్వాహకుల నుంచి ఎటువంటి స్పస్టమైన సమధానం రాకపోవటంతో ప్రయాణికులు మోసపోయామని గ్రహించారు. ఈ విషయంలో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాధితులకు న్యాయం చేయాలని, వారు కట్టిన నగదును, పాస్‌పోర్ట్‌లను వెనక్కు ఇప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ కడప ఎమ్మెల్యే అంజద్ బాషా డిమాండ్ చేశారు. ఈ ఘటనకు భాద్యులైన ట్రావెల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీసిఐడి విచారణ జరిపించి, భాదితులకు సత్వర న్యాయం అందించాలని అంజద్ బాషా కోరారు. పోలీసులు ట్రావెల్స్ యజమానులపై కేసు నమోదు చేసి, ధర్యాప్తు ప్రారంభించారు. నకిలీ ట్రావెల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నగదును పూర్తిగా కాకుండా వారి గురించి పూర్తిగా వాకబు చేసిన తరువాతే అడ్వాన్స్ చెల్లించాలని, ఈ విషయంలో అప్రమత్తత తప్పనిసరని జిల్లా ఎస్పీ సూచించారు. -
హౌసింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
ఖానాపూర్ : తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 36 గ్రామాల్లో హౌసింగ్ అక్రమాలపై విచారణ చేయాలని ప్రభుత్వం సీబీసీఐడీని ఆదేశించిన విషయం విధితమే. దీంతో ఇందిరమ్మ ఇళ్ల అక్రమాలపై సీబీసీఐడీ విచారణకు ఆదేశించడంతో అధికారులు కొద్ది నెలలుగా విచారణ చేశారు. సీబీసీఐడీ వరంగల్ జోన్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో అధికారులు మండల కేంద్రంలోని తిమ్మాపూర్‌లో ఇంటింటా తిరుగుతూ 1,340 ఇళ్లను సోదా చేశారు. తమవిచారణలో 199 ఇళ్లలో పలు విధాలుగా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని ప్రకటించారు. కాగా సంబంధిత నివాసదారులకు బుధవారం నోటీసులు అందజేసి గురువారం జరిగే విచారణకు హాజరుకావాలని కోరారు. దీంతో సీఐడీ అధికారుల ఆదేశాల మేరకు గురువారం హాజరై న వారిలో నుంచి మొదటి రోజు 80 మందిని విచారించినట్లు సీబీసీఐడీ అదికారులు తెలిపారు. కాగా, తమ విచారణలో బాధితులు పలు వివరాలు తెలియజేసినట్లు సమాచారం. కాగా రాజకీయ నాయకులు, మధ్యవర్తులు, వీవో గ్రూపులు, హౌసింగ్ అధికారులు, సిబ్బంది కొందరి పేర్ల పై బిల్లులు కాజేసినట్లు బాధితులు తెలిపారని సమాచా రం. విచారణ పూర్తి కాగానే విచారణ, విషయాలతో పా టు దోషుల వివరాలను వెల్లడిస్తామని అధికారులు పే ర్కొంటున్నారు. సీబీసీఐడీ సీఐలు రఘుపతి, చేరాలు, ఎస్సైలు రాఘవులు, శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క తేలింది..!
ఖానాపూర్ : ‘ఇందిరమ్మ’ ఇళ్ల అక్రమాల లెక్క ఎట్టకేలకు తేలింది. అక్రమాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. మూడు నెలలుగా విచారణ సాగింది. మొదటి విడతలోనే అధికారులు మండల కేంద్రంలో ఇంటింటా తిరుగుతూ విచారణ చేపట్టారు. అక్రమార్కులు ఎవరు, అక్రమాలు ఎలా జరిగాయి అనే విషయాన్ని బాధితులతోపాటు సంబంధిత అదికారులను కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఎట్టకేలకు లెక్క తేల్చారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో పలు గ్రామాలను ఎంపిక చేసుకుని సీఐడీ అధికారులు క్షేత్రస్థాయిలో చేపట్టిన విచారణ తుదిదశకు చేరింది. సీఐడీ అధికారులు అక్రమాల ఆధారాలు సేకరించడంతోపాటు లబ్ధిదారులతో మాట్లాడి అక్రమాలకు బాధ్యుల వివరాలు సేకరించినట్లు సమాచారం. మండలంలోని 199 ఇళ్లల్లో వివిధ రూపాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు నిగ్గుతేల్చారు. ఇందులో పలువురు ప్రభుత్వ ఉద్యోగులు బిల్లు లు పొందగా, ఇంకొందరు ఒకే పేరు పై రెండు ఇళ్లపై బిల్లులు కాజేశారు. మరికొంతమంది ఇల్లు కట్టకుండానే బిల్లులు కాజేయగా, కొందరు పాత ఇళ్లపైనే బిల్లులు పొందారు. సంబంధీకులందరికీ బుధవారం హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, సిబ్బంది ఇంటింటా తిరుగుతు నోటీసులు అందజేశారు. గురువారం ఖానాపూర్లోని విశ్రాంతి భవనంలో వారితో సీబీసీఐడీ అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. బాధ్యులను ఎట్టకేలకు తేల్చిన అధికారులు ఈ విషయమై తీసుకునే చర్యలపై గురువారం వెల్లడించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు హౌసింగ్‌లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు చేపట్టడంతో అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. -
‘ఇందిరమ్మ’లో అవినీతి బహిర్గతం
ఖమ్మం వైరారోడ్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్లు సీబీసీఐడీ విచారణలో తెలిసింది. ఈ అక్రమాల్లో 177 మంది భాగస్వామ్యం ఉందని విచారణలో నిర్ధారణయింది. గృహనిర్మాణ శాఖతో పాటు ఇతర శాఖల అధికారులు, మహిళా సమాఖ్య సభ్యులు అవినీతిలో భాగస్వాములైనట్లు తెలిసింది. ఇందులో కోట్ల రూపాయలు పక్కదారి పట్టినట్లు తేలింది. ఇందిరమ్మ పథకం కింద జిల్లాకు మూడు దశల్లో 4.10 లక్షల ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 2.80 లక్షల ఇళ్లు పూర్తి కాగా, మరో 64 వేల గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మంజూరైన ఇళ్లలో చాలా వరకు నిధులు దుర్వినియోగం అయినట్లు ప్రభుత్వం గుర్తించి సీబీసీఐడీ విచారణకు ఆదేశించిన విషయం విదితమే. మొత్తంగా రూ.14 కోట్లు స్వాహా అయినట్లు గృహ నిర్మాణశాఖ అధికారుల విచారణలోనే తేలింది. జిల్లాలో 2004 నుంచి 2014 వరకు చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లలో బోగస్ లబ్ధిదారులతోపాటు అసలు ఇళ్లే నిర్మించకుండా నిధులు స్వాహా చేసిన వారిని కనుగొనేందుకు సీబీసీఐడీ బృందం నియోజకవర్గాల వారీగా విచారణ చేపట్టింది. మూడు నెలల పాటు విచారణ... ప్రభుత్వ ఆదేశాలతో సీబీసీఐడీ డీఎస్పీ బాలుజాదవ్ తన బృందంతో గత ఏడాది ఆగస్టు 8న జిల్లాలో విచారణ ప్రారంభించారు. తొలుత జిల్లా గృహ నిర్మాణ కార్యాలయంలో సంబంధిత ఫైళ్లను పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా అధికారులను ప్రశ్నించారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో కూడా విచారణ చేపట్టారు. పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మం రూరల్ మండలం ఎం. వెంకటాయపాలెం, కూసుమంచి మండ లం లోక్యాతండా, నేలకొండపల్లి మండలం కోనాయిగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం పట్వారిగూడెం, ముల్కలపల్లి మండలం కూసుగూడెంలో విచారణ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు నిర్మించిన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న ఇళ్ల వివరాలను పరిశీలించి ఉన్నతాధికారులకు గత నవంబర్‌లో నివేదిక అందజేశారు. అవినీతిలో 177 మంది హస్తం! ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో విచారణ చేపట్టిన సీబీసీఐడీ బృందం 177 మందికి అవినీతిలో భాగస్వామ్యం ఉన్నట్లు గుర్తించిందని ఆ శాఖ ఉన్నతాధికారి ద్వారా తెలిసింది. మూడు నెలల పాటు సాగిన విచారణలో దీనికి సంబంధించిన వారిని గుర్తించి నివేదికలో పొందుపరిచారు. దీనిలో గృహ నిర్మాణ శాఖకు చెందిన వారు 37 మంది ఉన్నట్లు తెలిసింది. ఈ జాబితాలో వర్క్ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈలు, ఈఈలు ఉన్నట్లు సమాచారం. రాజకీయ నాయకులు 8 మంది, మహిళా సమాఖ్యకు చెందిన వారు 15 మంది, అలాగే ఒక ఆర్డీఓ, ఇద్దరు ఎమ్మార్వోలు, ఒక ఎంపీడీవో, ముగ్గురు మద్యవర్తులు, 110 మంది లబ్ధిదారులు అవినీతిలో పాలుపంచుకున్నట్లు తెలిసింది. పూర్తిస్థాయిలో విచారణ చేసిన అధికారులు నవంబర్‌లో నివేదికను సీబీసీఐడీ డీజీకి అందజేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం ఎక్కడ అరెస్ట్‌లకు ఆదేశిస్తుందోనని అవినీతిపరుల్లో వణుకు మొదలైంది. సస్పెండ్ అయ్యి విధుల్లో చేరిన వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆదేశాలు రాగానే అరెస్ట్‌ల పర్వం మొదలవుతుందని ఆ శాఖ అధికారులు ద్వారా తెలిసింది.