పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు | Tamil Nadu CBCID Declared Police Officers Kidnap Industrialist | Sakshi
Sakshi News home page

పోలీసులే కిడ్నాపర్లుగా మారి.. ఆస్తులు రాయించుకున్నారు

Published Mon, Jun 28 2021 9:31 AM | Last Updated on Mon, Jun 28 2021 9:31 AM

Tamil Nadu CBCID Declared Police Officers Kidnap Industrialist - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై : ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్‌ చేసి అతడి ఆస్తులు రాయించుకున్న కేసులో ఇన్‌స్పెక్టర్, ఎస్‌ఐలు సహా పది మంది పోలీసులపై ఆదివారం సీబీసీఐడీ ఆరు సెక్షన్లతో కేసు నమో దు చేసింది. చెన్నై అయపాక్కంకు చెందిన పారి శ్రామికవేత్త రాజేష్‌ ఆరు నెలల క్రితం కిడ్నాప్‌ అయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆయనతో బలవంతంగా స్టాంప్‌ పేపర్ల మీద సంతకం తీసుకుని వదిలిపెట్టారు. తనను కిడ్నాప్‌ చేసిన వారిలో పోలీసు అధికారులు ఉన్నట్టు రాజేష్‌ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు సీబీసీఐడీకి చేరింది. ఆరు నెలలుగా ఈ కేసును సీబీసీఐడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలో ఆదివారం పోలీసులే కిడ్నాపర్లని తేలింది. తిరుమంగళం ఇన్‌స్పెక్టర్, ఇద్దరు ఎస్‌ఐలు సహా పది మంది పోలీసులపై కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి విచారించేందుకు సీబీసీఐడీ సిద్ధమవుతోంది.  

మరో కీచక పోలీసు 
సాక్షి, చెన్నై: యువతిని నమ్మించి మోసం చేసిన కీచక పోలీసును ఎస్పీ సస్పెండ్‌ చేశారు. అజ్ఞాతంలో ఉన్న అతడి కోసం మహిళా పోలీసులు గాలిస్తు న్నారు. తూత్తుకుడి జిల్లా తిరుచెందూరుకు జాక్సన్‌ 2017లో పోలీసు విధుల్లో చేరాడు. అతనికి పోటీ పరీక్షల పుస్తకాల కోసం ప్రయత్నిస్తున్న ఓ యువతి తారస పడింది. ఆమె నెంబరు తీసుకుని మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. ప్రస్తుతం అతను డీఎంకే యువజన విభాగం నేతకు గన్‌మెన్‌గా మారాడు. ఆ యువతిని పట్టించుకోవడం మానేశాడు.

తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తీసుకురాగా తనకు ఉద్యోగం పోయిందని, కొంతకాలం వేచి ఉండాలని సూచించాడు. అతడి మోసాన్ని పసిగట్టిన యువతి తిరుచెందూరు మహిళా పోలీసుల్ని ఆశ్రయించింది. రాజకీయ పలుకుబడితో జాక్సన్‌ తప్పించుకునే యత్నం చేశాడు. ఆమె ఎస్పీ జయకుమార్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. తీవ్రంగా పరిగణించిన ఎస్పీ కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ జాక్సన్‌ను ఆదివారం సస్పెండ్‌ చేశారు. ఈ సమాచారంతో జాక్సన్‌ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి కోసం తిరుచెందూరు మహిళా పోలీసులు గాలిస్తున్నారు. కొద్ది రోజులుగా అధిక సంఖ్యలో పోలీసులపై లైంగిక వేధింపుల కేసులు నమోదు కావడం గమనార్హం. 

నాగరాజన్‌పై గూండా చట్టం 
క్రీడాకారిణులను లైంగికంగా వేధించిన కేసులో అథ్లెటిక్‌ శిక్షకుడు నాగరాజన్‌ అరెస్టయిన విషయం తెలిసిందే. ఆయన మీద ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. విదేశాల్లో ఉన్న పూర్వ క్రీడాకారాణులు సైతం ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో ఆయనపై గూండా చట్టం కింద కేసు నమోదు చేయాలని చెన్నై పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివ్వాల్‌ ఆదివారం ఆదేశించారు.  

చదవండి: మనవడి పెళ్లి వివాదం.. సర్పంచ్‌ కిడ్నాప్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement