CC camera record footages
-
అంగన్వాడీల్లో బయోమెట్రిక్, సీసీ కెమెరాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో బయో మెట్రిక్ హాజరు చేపట్టాలని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అన్ని అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండేలా చూడాలని, అవసర మైనచోట కొత్త భవనాలను నిర్మించాలని సూచించారు. శనివారం సచివాలయంలో మహిళాభివృద్ధి, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖలపై సీఎం సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలకు సరైన పౌష్టికాహారం అందించడ మే లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 35వేల అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించా రు. ఈ మేరకు అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారు లకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ‘ఉపాధి హామీ’ లింకేజీతో సొంత భవనాలు రాష్ట్రంలో 12,315 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉన్నాయని, వాటికి శాశ్వత ప్రాతిపదికన సొంత భవనాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులను జోడించి మొదటి ప్రాధాన్యతగా అంగన్వాడీ భవన నిర్మాణాలు చేçపట్టాలన్నారు. రాష్ట్రమంతటా ఎక్కడ చూసినా ఒకేలా అంగన్వాడీ కేంద్రాల బ్రాండింగ్ ఉండాలని.. ఇందుకోసం ప్రత్యేక డిజైన్ రూపొందించాలని సూచించారు. అవసరమైతే ఆరేళ్ల లోపు చిన్నారులకు ప్రీప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే అందించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు. ఆరు నెలలకోసారి వారోత్సవాలు.. మహిళా శిశుసంక్షేమ శాఖ పథకాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆరు నెలలకోసారి ప్రత్యేక వారోత్సవాలు నిర్వహించి విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక దివ్యాంగులకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లను పక్కాగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మరిన్ని వృద్ధాశ్రమాల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. సమీక్షలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
నిఘా నేత్రాలు పట్టిస్తున్నాయ్!
సాక్షి, నెల్లూరు(క్రైమ్): జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిస్టరీగా మారిన పలు కేసులను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఛేదిస్తున్నారు. జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల్లోనూ సీసీ ఫుటేజీలు కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయడంతోపాటు మరోవైపు నేరాలను అదుపులో ఉంచేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. కొన్ని ఉదాహరణలు ► ముత్యాలపాళెంలో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్యచేసి ఆపై నిప్పంటించాడు. ఈ కేసులో చిన్నపాటి క్లూ దొరక్క పోలీసులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఆటోను గుర్తించారు. దాని ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. ► అత్యాశకుపోయిన ఓ ఆటోడ్రైవర్ ప్రయాణికుల బ్యాగ్‌తో ఉడాయించాడు. అతను ఎవరు? ఎక్కడి వాడు అన్న వివరాలు తెలియదు. దీంతో పోలీసులు ప్రయాణికుడు ఎక్కిన ప్రాంతం నుంచి దిగిన ప్రాంతం వరకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ► సర్వజనాస్పత్రిలో ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. దీంతో బాధిత తల్లి కన్నీటి పర్యంతమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్ట్ చేసి పసికందును తల్లికి సురక్షితంగా అప్పజెప్పారు. ► మూలాపేటలో వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగద దోచుకెళ్లారు. ఈ ఘటనలో చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. ► మూడురోజుల క్రితం గాంధీబొమ్మ వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ఓ మహిళ పర్సును లాక్కెళ్లిన దుండగుడు రఫీని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చిన్నబజారు పోలీసులు అరెస్ట్ చేశారు. వాటి ఆధారంగానే.. జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తుతెలియని వాహనాలు హైవేపై ప్రయాణించే వారిని, వాహనాలను ఢీకొని వెళ్లిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు సిబ్బంది కష్టపడుతున్నా కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈక్రమంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అలాగే దోపిడీలు, చోరీలు, హత్య కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు నేర పరిశోధనకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. చిన్నపాటి క్లూ లేని కేసుల ఛేదనలో వీటి పాత్ర అద్వితీయం. వృద్ధుల వద్ద నగదు, నగలు దోచుకెళ్లిన కేసులో సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు (ఫైల్) 540 కెమెరాల ఏర్పాటు సీసీ కెమెరాల నిఘాలో జిల్లా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పారిశ్రామికవాడలు తదితర ప్రాంతాలన్నింటిలో పోలీసులు స్థానికులు, దాతల సహకారం, సీఎస్ఆర్ నిధులతో పెద్దఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నారు. అక్కడ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. కమాండ్ కంట్రోల్ నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పలు సందర్భాల్లో ఏదైనా నేరం జరిగిన వెంటనే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేయడంతో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న ఘటనలున్నాయి. జిల్లా కేంద్రంలోనే కాకుండా మనుబోలు, నాయుడుపేట, కావలి పట్టణాల్లో మినీ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను వాటికి అనుసంధానించారు. గతంలో కేవలం 86 కెమెరాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 540 (నెల్లూరు నగరంలో 101, నెల్లూరు రూరల్ 190, గూడూరు 50, నాయుడుపేట 50, కావలి 123, ఆత్మకూరు 25)కు చేరింది. జిల్లావ్యాప్తంగా 1,000 కెమెరాలను ఏర్పాటుచేసే దిశగా పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. కెమెరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే నేరాలు చేసేందుకు ఎవరైనా భయపడే పరిస్థితి రానుంది. వ్యాపారస్తులు, బహుళ అంతస్తుల భవన యజమానులు, షాపింగ్‌మాల్ నిర్వాహకులు సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం నుంచి వచ్చే నెల 3 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 11,023 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 5,52,302 మంది ఈ పరీక్షలు రాయనున్నారు. వారిలో 5,07,810 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉండగా 44,492 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 2,55,318 మంది బాలురు, 2,52,492 మంది బాలికలు ఉన్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ తర్వాత నో ఎంట్రీ... పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటలకు వరకు జరుగుతాయి. విద్యార్థులను పరీక్ష సమయం ప్రారంభం (ఉదయం 9:30 గంటలకు) కంటే 45 నిమిషాల ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. పరీక్ష సమయం మొదలైన 5 నిమిషాల వరకే (ఉదయం 9:35 గంటల వరకు) పరీక్ష హాల్లోకి అనుమతించనున్నారు. ఆ తరువాత వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కాంపొజిట్ కోర్సు పేపర్–1, పేపర్–2, ద్వితీయ భాష, ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1, పేపర్–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధాహ్నం 12:45 గంటల వరకు కొనసాగుతాయి. ఎస్సెస్సీ కాంపొజిట్ పేపర్–2 పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 10:45 గంటల వరకు, వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. హాల్‌టికెట్లు అందకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు... పరీక్షల ఏర్పాట్లపై గురువారం పాఠశాల విద్య డైరెక్టరేట్‌లో ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్‌తో కలసి పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు పంపించామని, అందని వారు లేదా పొగొట్టుకున్న వారు తమ వెబ్సైట్ (https://www. bsetelangana.org/) నుంచి డౌన్లోడ్ చేసుకొని పరీక్షలకు హాజరుకావచ్చని వెల్లడించారు. పరీక్షలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు (040–23230942) ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు. పెరిగిన కేంద్రాలు.. తగ్గిన స్కూళ్లు గతేడాది కంటే ఈసారి 21 పరీక్ష కేంద్రాలు పెరిగాయి. గతేడాది 2,542 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే పాఠశాలలు మాత్రం 80 తగ్గిపోయాయి. గతేడాది 11,103 స్కూళ్లు మాత్రమే ఉన్నాయి. ఇక విద్యార్థుల సంఖ్య కూడా ఈసారి తగ్గింది. గతేడాది 5,34,726 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కాగా, పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్ విద్యార్థుల్లో 64.57 శాతం మంది ఇంగ్లిషు మీడియం విద్యార్థులే ఉన్నారు. 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలు... ఈసారి మొత్తంగా రెగ్యులర్ విద్యార్థులకు 2,374, ప్రైవేటు విద్యార్థులకు 189 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి 116 కేంద్రాల్లో సీసీ కెమెరాలను అమర్చారు. ఆకస్మిక తనిఖీల కోసం 4 స్పెషల్ ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 144 ఫ్లైయింగ్ స్క్వాడ్లను పంపనున్నారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. జిరాక్స్ కేంద్రాలను మూసి వేయాలి. పరీక్ష సమయంలో ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక ఎంఈవో, డీఈవోల ఫోన్ నంబర్లు పరీక్ష కేంద్రంలో ఉంటాయి. వాటికి ఫోన్ చేసి తెలియజేయాలి. లేదంటే హైదరాబాద్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి చెప్పవచ్చు. -
పల్లెపై నిఘా
సాక్షి, జనగామ: క్షేత్రస్థాయి నుంచే నేరాలను తగ్గించేందుకు పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఘటన జరగక ముందే శాంతిభద్రతలను కాపాడితే ప్రజల్లో నమ్మకం కలుగుతుందనే లక్ష్యంతో పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒక వైపు గ్రామ పోలీస్ అధికారుల (వీపీఓలు)ను అప్రమత్తం చేయడంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటుపై దృష్టి సారించింది. గ్రామం యూనిట్‌గానే పోలీస్ శాఖ శాంతిభద్రతల పర్యవేక్షణకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. జిల్లాలో 170 మంది వీపీఓలు.. వరంగల్ కమిషనరేట్ పరిధిలోని వెస్ట్‌జోన్‌లో ఉన్న జనగామ జిల్లాలోని 13 మండలాల్లో 170 మంది గ్రామ పోలీస్ అధికారులను నియమించారు. 13 మండలాల్లో 301 గ్రామపంచాయతీలు ఉండగా వాటికి పోలీస్ అధికారులను నియమించారు. గ్రామాల వారీగా నియమించిన పోలీస్ అధికారి సెల్‌నంబర్ గ్రామస్తులకు తెలిసే విధంగా ముఖ్య కూడళ్ల వద్ద వాల్ రైటింగ్ చేయించారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరిగినా ఆ గ్రామ పోలీస్ అధికారిని బాధ్యుడిని చేస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, దొంగతనాలు, అపరిచిత వ్యక్తుల సంచారం వంటి విషయాలు గ్రామ పోలీస్ అధికారికి సమాచారం అందించే విధంగాగ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో సక్సెస్.. అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన దుండగులను పట్టుకోవడంలో పోలీసులకు సీసీ కెమెరాలు ఓ ప్రత్యేక సాధనంగా మారాయి. ఈ కారణంగా సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. దాతల సహకారంతో సీసీ కెమెరాల కొనుగోలు, సొంత ఖర్చులతో ఏర్పాటు చేసే వారిని ప్రోత్సహించింది. జిల్లా వ్యాప్తంగా దాతల సహకారంతో 1058 కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. జనగామ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలతో పాటు ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో దాతల సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా నేను సైతం కార్యక్రమంలో భాగంగా 1580 సీసీ కెమెరాలను బ్యాంకులు, ముఖ్యమైన షాపుల్లో ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి నుంచే ఫోకస్.. గ్రామ స్థాయి నుంచి అక్రమాలను నిర్మూలించడమే ధ్యేయంగా పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. దొంగతనాలు, పేకాట, మట్కా వంటి నేరాలను నియంత్రించడంపై దృష్టి సారించారు. గుట్కాలు, అంబర్, గంజాయి అక్రమ వ్యాపారం, నిల్వలను గుర్తించి అదుపుచేసే విధంగా వీపీఓలు, సీసీ కెమెరాలను వినియోగించనున్నారు. శాంతియుత వాతావరణంలో పల్లెల్లో ప్రశాంతత నెలకొల్పే విధంగా పోలీసులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
మసకబారుతున్న... ‘మూడో కన్ను’
సాక్షి, సిటీబ్యూరో: నగర కమిషనరేట్ పరిధిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల సంఖ్య వందల్లో ఉంటే... ప్రజా భద్రతా చట్టం అమలులోకి వచ్చిన తరవాత కమ్యూనిటీల వారీగా ఏర్పాటు చేసినవి లక్షలకు చేరాయి. గత ఏడాది నగరంలో చోటు చేసుకున్న నేరాల్లో దాదాపు 3 వేలకు పైగా కేసుల దర్యాప్తునకు అవసరమైన ఆధారాలను సీసీ కెమెరాలే అందించాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ‘మూడో కన్ను’ మసకబారుతోంది. కెమెరాలు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నా... నిర్వహణ సరిగా లేక అందులో అనేకం కొరగాకుండా పోతున్నాయి. వీటిని ప్రజలు ఏర్పాటు చేసినా... కనీసం నిర్వహణ బాధ్యతనైనా ప్రభుత్వం చేపట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎన్నికల క్రతువు సజావుగా పూర్తి చేయడంలో సీసీ కెమెరాల పాత్ర సైతం కీలకం కావడంతో దీనిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. అందరి కళ్లూ కెమెరాల వైపే... ప్రస్తుతం సిటీలో ఎలాంటి నేరం చోటు చేసుకున్నా పోలీసులు ప్రధానంగా సీసీ కెమెరాల పైనే ఆధారపడుతున్నారు. అంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ఏర్పాటులోనూ అధికారులు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. 2014లో అమలులోకి వచ్చిన ప్రజా భద్రత చట్టంలో భాగంగా వ్యాపార సముదాయాలు, వాణిజ్య ప్రాంతాల్లో వ్యక్తిగతంగా, కమ్యూనిటీ మొత్తం కలిసి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పనిసరి చేశారు. అయితే ఎవరికి నచ్చిన మోడల్, సామర్థ్యం కలిగిన కెమెరాలను వారు ఏర్పాటు చేసుకోకుండా యూనిఫామిటీ కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. సీసీ కెమెరాలకు ఉండాల్సిన సామర్థ్యాలను నిర్దేశించి అంతా వాటినే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో దాదాపు అన్నీ ఒకే తరహాకు చెందినవి సమకూరుతున్నాయి. అన్నింటినీ అనుసంధానించారు... సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షించే బాధ్యతలను పోలీసుస్టేషన్ల వారీగా ఆయా ఇన్స్పెక్టర్లకు అప్పగించారు. వ్యాపారులు, సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్న వీరు కచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకున్నారు. ఓ వ్యాపార సముదాయం, వాణిజ్య కూడళ్లతో పాటు తమ దుకాణాల్లోనూ వ్యాపారులు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. దుకాణం లోపల మినహా బయట ఉన్న కెమెరాలన్నింటినీ బ్రాడ్‌బ్యాండ్ ద్వారా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కెమెరాలూ ప్రధానంగా ట్రాఫిక్ కోణంలో పని చేస్తున్నా... అనుసంధానించిన కమ్యూనిటీ కెమెరాలూ నిఘా, శాంతిభద్రతల పర్యవేక్షణకు ఉపకరిస్తున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి సిటీలోని కెమెరాలను 2.5 లక్షలకు చేర్చాలని, అన్నింటినీ సీసీసీతో అనుసంధానించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నిర్వహణే సమస్య... ఇంతవరకు అంతా బాగానే ఉన్నా... కమ్యూనిటీ కెమెరాల నిర్వహణ విషయంలో సమస్య ఎదురవుతోంది. వ్యాపారులు, స్థానికులతో కెమెరాలు ఏర్పాటు చేయించిన పోలీసులు వాటిని నిర్వహించే అంశంలో మాత్రం స్పష్టత లేదు. స్థానికంగా అవి పని చేయడానికి అవసరమైన విద్యుత్, కనెక్టివిటీకి సంబంధించిన అంశాలు ఎవరి పరిధిలో ఉంటాయి? దీనికి అవసరమైన నిధుల విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో ప్రస్తుతం సిటీలోని సీసీ కెమెరాల్లో అనేకం పని చేయడంలేదు. ఫలితంగా ఏదైనా నేరం జరిగితే ఆధారాల కోసం అన్వేషించడానికి ఎక్కువ సమయం పడుతోంది. కొన్నిసార్లు కష్ట సాధ్యంగానూ మారుతోందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఈ కెమెరాల పని తీరుపై నిత్యం సమీక్షలు జరిగేవి. అయితే ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడిలో ఉండటంతో పట్టించుకునే నా«థుడు కరవయ్యారు. కెమెరాలను తమ సొంత నిధులతో ఏర్పాటు చేయించామని, వాటి నిర్వహణ విషయాన్ని ప్రభుత్వలో బాధ్యత తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
కన్నుచేరేసిన కెమెరాలు
విశాఖ విమానాశ్రయంలో భద్రత డొల్లతనం బట్టబయలైంది. సీఐఎస్ఎఫ్, నేవీ, రాష్ట్ర పోలీసుల నిఘా ఉన్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్న ఘటనతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు నివ్వెర పరుస్తున్నాయి. సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయం రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉంటుంది. దేశంలోనే నేవీ, పౌర విమానాశ్రయాలు కలిసి ఒకే చోట ఉన్న ఏకైక విమానాశ్రయం ఇదే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) కట్టుదిట్టమైన భద్రత, నేవీ నిరంతర నిఘా, రాష్ట్ర పోలీసుల బందోబస్తు కల్గిన ఈ విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం బాగోలేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్న ఘటనతో విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత డొల్లతనం బట్ట బయలుకాగా, ఇదే కేసులో తాజాగా హైకోర్టు చేసి న వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయం కలిగిన ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగడం దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ పక్క పౌర విమానాశ్రయం.. దానికి ఆనుకునే మరో పక్క ఐఎన్ఎస్ డేగా(నేవీ ఎయిర్‌పోర్టు) ఉంటాయి. డేగాలో వేల కోట్ల విలువైన మిగ్‌లు, చేతక్ హెలీకాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉంటాయి. ఒక్క పీ–8ఐ నిఘా విమానం ఖరీదు వేల కోట్లలో ఉంటుంది. పైగా రాత్రి పగలనే తేడా లేకుండా ఏటా లక్షలాది మంది ప్రయాణికులు.. వేలాది మంది పర్యాటకులు.. వందలాది మంది వీఐపీలు, వీవీఐపీలు దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రాంతంలో జరిగిన హత్యాయత్న ఘట న నిఘా వైఫల్యాన్ని ఎత్తు చూపింది. హత్యాయత్నం ఉదంతానికి సంబంధించి కీలకమైన సీసీ ఫుటేజీ ఏమైందన్న ప్రశ్న తలెత్తగానే అబ్బే దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్టుల్లోనూ వీఐపీ లాంజ్ల్లో సీసీ కెమెరాలు ఉండవని ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. పైగా విశాఖ ఎయిర్ పోర్టులో 200కు పైగా సీసీ కెమెరాలున్నాయని చెప్పుకొచ్చిన అధికారులు అవి బాగానే పని చేస్తున్నాయంటూ మీడియాను ఏమార్చారు. ఘట న జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజినే కాదు.. విశా ఖ ఎయిర్‌పోర్టు నుంచి వై.ఎస్.జగన్ రాకపోకలు సాగిస్తున్న గడిచిన మూడు నెలల నాటి సీసీ ఫుటేజిని, అలాగే నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరిన జనవరి నెల నుంచి కూడా సీసీ ఫుటేజ్‌ను సేకరించి ఐదుగురు నిపుణులతో విశ్లేషిస్తున్నామంటూ స్వయంగా సిట్ అధికారులు ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని దాచిపెట్టినట్టుగానే సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న వాస్తవాన్ని కూడా దాచిపెట్టా రు. కానీ చివరికి హైకోర్టు నిలదీయడంతో సిట్ అధికారులు అసలు విషయాన్ని బయటపెట్టారు. గడిచిన మూడు నెలలుగా ఎయి ర్ పోర్టులో ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని, మా వద్ద సీసీ ఫుటేజ్ లేనేలేదని అంగీకరించడం చూస్తుంటే సిట్ దర్యాప్తు ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ ఎయిర్ పోర్టును ఆధునికీకరించారు. రూ.100 కోట్లతో నూతన టెర్మినల్‌ను నిర్మించారు. ఆ తర్వాత 2014లో సంభవించిన హుద్‌హుద్‌కు రూ.65 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చినా ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కల్గిన ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైవే మొదలుకొని ప్రయాణికులు విమానం ఎక్కే లేడర్ వరకు అడుగడుగునా సీసీ కెమెరాలు కన్పిస్తాయి. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని ఫ్రీ జోన్, సెక్యురిటీ హోల్డ్ ఏరియా(ఎస్హెచ్ఏ), బోర్డింగ్ చాంబర్లలోనే కాదు.. చివరకు రెస్టారెంట్లు, కారిడార్, ఇతర వాణిజ్య ప్రాంతాలతో పాటు ఎయిర్ పోర్టు చుట్టూ సీసీ కెమెరాలు దర్శనమిస్తుంటాయి. ఈ సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ను 24 గంటలూ పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి. సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా సీసీ కెమెరాల్లో ప్రయాణికులు, సిబ్బంది కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అత్యంత నిఘా ఉండాల్సిన ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ సాక్షాత్తు హైకోర్టులోనే అధికారులు అంగీకరించడం చూస్తుంటే పర్యాటకులు, వీఐపీలు, వీవీఐపీల భద్రత విషయంలో ఎంత ఉదాశీనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు మీదుగా తాను రాకపోకలు సాగించానని, అక్కడ భద్రత ప్రమాణాలు ఏమాత్రం బాగోలేవంటూ సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం విశాఖ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం ఎంత దారుణంగా ఉందో మరోసారి తేటతెల్లమైంది. సీసీ కెమెరాల ఫుటేజీ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు పొక్కనీయకుండా దాచిపెట్టిన సిట్ అధికారులు.. హైకోర్టు నిలదీయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు నెలల పాటు సీసీ కెమెరాలు పని చేయకపోతే ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. అటు విమానాశ్రయ అధికారులతో పాటు ఇటు ఏపీ పోలీస్ అధికారుల్లో వణుకు పుడుతోంది. -
గజ్జెల పాపమ్మ గుడిలో అమ్మవారి కిరీటం చోరీ
హైదరాబాద్: నగరంలోని దేవాలయాలపై దొంగలు కన్నెశారు. భద్రత వైఫల్యం కారణంగా దేవాలయాల్లో దొంగలు చోరీలకు పాల్పడానికి అనువుగా మారుతోంది. దీన్ని అసరాగా చేసుకుని దేవాలయాల్లో బంగారు అభరణాలు, నగలు, వెండి అభరణాలను దొంగలు దోచుకెళుతున్నారు. తాజాగా ఆలయంలో దర్శనానికి వచ్చిన ఓ వ్యక్తి గుళ్లో పూజారీకి టోకరా వేసి గర్భగుడిలోని అమ్మవారి కిరీటాన్ని మాయం చేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేట గజ్జెల పాపమ్మ గుడిలో సోమవారం ఉదయం వెలుగుచూసింది. నగరంలోని పలు దేవాలయాల్లో జరిగిన వరుస చోరీ ఘటనలతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించగా నిందితుడి అనవాళ్లు స్పష్టంగా రికార్డ్ అయినట్టు పోలీసులు తెలిపారు. సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు దేవాలయాల్లో సరైన భద్రత ఏర్పాటు చేయకపోవడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.