విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం
విశాఖ విమానాశ్రయంలో భద్రత డొల్లతనం బట్టబయలైంది. సీఐఎస్‌ఎఫ్, నేవీ, రాష్ట్ర పోలీసుల నిఘా ఉన్న ప్రాంతంలో భద్రతా ప్రమాణాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్న ఘటనతో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న వాస్తవాలు నివ్వెర పరుస్తున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని అంతర్జాతీయ విమానాశ్రయం రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉంటుంది. దేశంలోనే నేవీ, పౌర విమానాశ్రయాలు కలిసి ఒకే చోట ఉన్న ఏకైక విమానాశ్రయం ఇదే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) కట్టుదిట్టమైన భద్రత, నేవీ నిరంతర నిఘా, రాష్ట్ర పోలీసుల బందోబస్తు కల్గిన ఈ విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలు ఏమాత్రం బాగోలేదంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్న ఘటనతో విశాఖ ఎయిర్‌పోర్టులో భద్రత డొల్లతనం బట్ట బయలుకాగా, ఇదే కేసులో తాజాగా హైకోర్టు చేసి న వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత వలయం కలిగిన ఎయిర్‌పోర్టులో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరగడం దేశప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. విశాఖ ఎయిర్ పోర్టులో ఓ పక్క పౌర విమానాశ్రయం.. దానికి ఆనుకునే మరో పక్క ఐఎన్‌ఎస్ డేగా(నేవీ ఎయిర్‌పోర్టు) ఉంటాయి. డేగాలో వేల కోట్ల విలువైన మిగ్‌లు, చేతక్ హెలీకాప్టర్‌లు, ఎయిర్ క్రాఫ్ట్‌లు ఉంటాయి. ఒక్క పీ–8ఐ నిఘా విమానం ఖరీదు వేల కోట్లలో ఉంటుంది. పైగా రాత్రి పగలనే తేడా లేకుండా ఏటా లక్షలాది మంది ప్రయాణికులు.. వేలాది మంది పర్యాటకులు.. వందలాది మంది వీఐపీలు, వీవీఐపీలు దేశవిదేశాలకు రాకపోకలు సాగించే ప్రాంతంలో జరిగిన హత్యాయత్న ఘట న నిఘా వైఫల్యాన్ని ఎత్తు చూపింది. హత్యాయత్నం ఉదంతానికి సంబంధించి కీలకమైన సీసీ ఫుటేజీ ఏమైందన్న ప్రశ్న తలెత్తగానే అబ్బే దేశ వ్యాప్తంగా ఏ ఎయిర్ పోర్టుల్లోనూ వీఐపీ లాంజ్‌ల్లో సీసీ కెమెరాలు ఉండవని ఎయిర్‌పోర్టు అథా రిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రకటించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు.
పైగా విశాఖ ఎయిర్ పోర్టులో 200కు పైగా సీసీ కెమెరాలున్నాయని చెప్పుకొచ్చిన అధికారులు అవి బాగానే పని చేస్తున్నాయంటూ మీడియాను ఏమార్చారు. ఘట న జరిగిన రోజు నాటి సీసీ ఫుటేజినే కాదు.. విశా ఖ ఎయిర్‌పోర్టు నుంచి వై.ఎస్.జగన్ రాకపోకలు సాగిస్తున్న గడిచిన మూడు నెలల నాటి సీసీ ఫుటేజిని, అలాగే నిందితుడు శ్రీనివాసరావు ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరిన జనవరి నెల నుంచి కూడా సీసీ ఫుటేజ్‌ను సేకరించి ఐదుగురు నిపుణులతో విశ్లేషిస్తున్నామంటూ స్వయంగా సిట్ అధికారులు ప్రకటించి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఈ కేసులో కుట్ర కోణాన్ని దాచిపెట్టినట్టుగానే సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్న వాస్తవాన్ని కూడా దాచిపెట్టా రు. కానీ చివరికి హైకోర్టు నిలదీయడంతో సిట్ అధికారులు అసలు విషయాన్ని బయటపెట్టారు. గడిచిన మూడు నెలలుగా ఎయి ర్ పోర్టులో ఏ ఒక్క సీసీ కెమెరా పనిచేయడం లేదని, మా వద్ద సీసీ ఫుటేజ్ లేనేలేదని అంగీకరించడం చూస్తుంటే సిట్ దర్యాప్తు ఏ విధంగా సాగుతుందో ఇట్టే అర్థమవుతోంది.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విశాఖ ఎయిర్ పోర్టును ఆధునికీకరించారు. రూ.100 కోట్లతో నూతన టెర్మినల్‌ను నిర్మించారు. ఆ తర్వాత 2014లో సంభవించిన హుద్‌హుద్‌కు రూ.65 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు లెక్కతేల్చినా ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కల్గిన ఆధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైవే మొదలుకొని ప్రయాణికులు విమానం ఎక్కే లేడర్ వరకు అడుగడుగునా సీసీ కెమెరాలు కన్పిస్తాయి. ఎయిర్‌పోర్టు లాంజ్‌లోని ఫ్రీ జోన్, సెక్యురిటీ హోల్డ్ ఏరియా(ఎస్‌హెచ్‌ఏ), బోర్డింగ్ చాంబర్‌లలోనే కాదు.. చివరకు రెస్టారెంట్లు, కారిడార్, ఇతర వాణిజ్య ప్రాంతాలతో పాటు ఎయిర్ పోర్టు చుట్టూ సీసీ కెమెరాలు దర్శనమిస్తుంటాయి.
ఈ సీసీ కెమెరాల్లోని ఫుటేజ్‌ను 24 గంటలూ పర్యవేక్షించేందుకు వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని నియమించాలి. సీఐఎస్‌ఎఫ్ పర్యవేక్షణలో పనిచేసే ఈ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా సీసీ కెమెరాల్లో ప్రయాణికులు, సిబ్బంది కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అత్యంత నిఘా ఉండాల్సిన ఎయిర్‌పోర్టులో సీసీ కెమెరాలు పని చేయడం లేదంటూ సాక్షాత్తు హైకోర్టులోనే అధికారులు అంగీకరించడం చూస్తుంటే పర్యాటకులు, వీఐపీలు, వీవీఐపీల భద్రత విషయంలో ఎంత ఉదాశీనంగా ఉన్నారో అర్థమవుతోంది. ఈ ఎయిర్‌పోర్టు మీదుగా తాను రాకపోకలు సాగించానని, అక్కడ భద్రత ప్రమాణాలు ఏమాత్రం బాగోలేవంటూ సాక్షాత్తు హైకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించడం విశాఖ విమానాశ్రయంలో భద్రతా వైఫల్యం ఎంత దారుణంగా ఉందో మరోసారి తేటతెల్లమైంది. సీసీ కెమెరాల ఫుటేజీ విషయాన్ని ఇన్నాళ్లు బయటకు పొక్కనీయకుండా దాచిపెట్టిన సిట్ అధికారులు.. హైకోర్టు నిలదీయడంతో సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయ విమానాశ్రయంలో మూడు నెలల పాటు సీసీ కెమెరాలు పని చేయకపోతే ఏం చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం.. అటు విమానాశ్రయ అధికారులతో పాటు ఇటు ఏపీ పోలీస్ అధికారుల్లో వణుకు పుడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment