నిఘా నేత్రాలు పట్టిస్తున్నాయ్‌! | CC Cameras Play An Important Role In The Protection Of Law And Order In The Nellore District | Sakshi
Sakshi News home page

నిఘా నేత్రాలు పట్టిస్తున్నాయ్‌!

Published Fri, Jul 12 2019 8:16 AM | Last Updated on Fri, Jul 12 2019 8:17 AM

CC Cameras Play An Important Role In The Protection Of Law And Order In The Nellore District - Sakshi

సీసీ కెమెరా ద్వారా గుర్తించి పట్టుకున్న నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసన్‌ (ఫైల్‌)

సాక్షి, నెల్లూరు(క్రైమ్‌): జిల్లాలో శాంతిభధ్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. మిస్టరీగా మారిన పలు కేసులను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఛేదిస్తున్నారు. జాతీయ రహదారిపై జరిగే ప్రమాదాల్లోనూ సీసీ ఫుటేజీలు కీలక సాక్ష్యంగా ఉపయోగపడుతున్నాయి. ఓ వైపు శాంతిభద్రతలను కట్టుదిట్టం చేయడంతోపాటు మరోవైపు నేరాలను అదుపులో ఉంచేందుకు ఈ సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. 

కొన్ని ఉదాహరణలు
ముత్యాలపాళెంలో ఓ వివాహితను ఆమె ప్రియుడు దారుణంగా హత్యచేసి ఆపై నిప్పంటించాడు. ఈ కేసులో చిన్నపాటి క్లూ దొరక్క పోలీసులు తలలు పట్టుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఆటోను గుర్తించారు. దాని ఆధారంగా నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 
అత్యాశకుపోయిన ఓ ఆటోడ్రైవర్‌ ప్రయాణికుల బ్యాగ్‌తో ఉడాయించాడు. అతను ఎవరు? ఎక్కడి వాడు అన్న వివరాలు తెలియదు. దీంతో పోలీసులు ప్రయాణికుడు ఎక్కిన ప్రాంతం నుంచి దిగిన ప్రాంతం వరకు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. 
సర్వజనాస్పత్రిలో ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. దీంతో బాధిత తల్లి కన్నీటి పర్యంతమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా గంటల వ్యవధిలోనే కిడ్నాపర్లను అరెస్ట్‌ చేసి పసికందును తల్లికి సురక్షితంగా అప్పజెప్పారు. 
మూలాపేటలో వృద్ధ దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించి 300 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగద దోచుకెళ్లారు. ఈ ఘటనలో చిన్నపాటి క్లూ కూడా దొరకలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. 
మూడురోజుల క్రితం గాంధీబొమ్మ వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న ఓ మహిళ పర్సును లాక్కెళ్లిన దుండగుడు రఫీని గంటల వ్యవధిలోనే సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా చిన్నబజారు పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

వాటి ఆధారంగానే..
జాతీయ రహదారిపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గుర్తుతెలియని వాహనాలు హైవేపై ప్రయాణించే వారిని, వాహనాలను ఢీకొని వెళ్లిపోతున్నాయి. వీటిని నియంత్రించేందుకు సిబ్బంది కష్టపడుతున్నా కొన్ని సందర్భాల్లో నిందితులను గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈక్రమంలో సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. అలాగే దోపిడీలు, చోరీలు, హత్య కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు సీసీ కెమెరాల ఫుటేజీలు ఉపయోగపడుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన సీసీ కెమెరాలు నేర పరిశోధనకు ఎంతో ఉపయుక్తంగా మారాయి. చిన్నపాటి క్లూ లేని కేసుల ఛేదనలో వీటి పాత్ర అద్వితీయం.


వృద్ధుల వద్ద నగదు, నగలు దోచుకెళ్లిన కేసులో సీసీ కెమెరాకు చిక్కిన నిందితులు (ఫైల్‌) 

540 కెమెరాల ఏర్పాటు 
సీసీ కెమెరాల నిఘాలో జిల్లా ఉంది. జిల్లా కేంద్రంతోపాటు పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, పారిశ్రామికవాడలు తదితర ప్రాంతాలన్నింటిలో పోలీసులు స్థానికులు, దాతల సహకారం, సీఎస్‌ఆర్‌  నిధులతో పెద్దఎత్తున సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేస్తున్నారు. అక్కడ సిబ్బంది 24 గంటలు విధులు నిర్వహిస్తున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ నుంచి నిత్యం పర్యవేక్షిస్తున్నారు. పలు సందర్భాల్లో ఏదైనా నేరం జరిగిన వెంటనే సంబంధిత సిబ్బందిని అప్రమత్తం చేయడంతో గంటల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్న ఘటనలున్నాయి.

జిల్లా కేంద్రంలోనే కాకుండా మనుబోలు, నాయుడుపేట, కావలి పట్టణాల్లో మినీ కమాండ్‌ కంట్రోల్‌ను ఏర్పాటుచేసి పరిసర ప్రాంతాల్లోని కెమెరాలను వాటికి అనుసంధానించారు. గతంలో కేవలం 86 కెమెరాలు ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 540 (నెల్లూరు నగరంలో 101, నెల్లూరు రూరల్‌ 190, గూడూరు 50, నాయుడుపేట 50, కావలి 123, ఆత్మకూరు 25)కు చేరింది. జిల్లావ్యాప్తంగా 1,000 కెమెరాలను ఏర్పాటుచేసే దిశగా పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. కెమెరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటైతే నేరాలు చేసేందుకు ఎవరైనా భయపడే పరిస్థితి రానుంది. వ్యాపారస్తులు, బహుళ అంతస్తుల భవన యజమానులు, షాపింగ్‌మాల్‌ నిర్వాహకులు సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement