సాక్షి, అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద ప్రస్తుతం 1,515 ఆర్బీకేల పరిధిలో 2.60 లక్షల మంది మహిళా రైతులు నమోదు కాగా.. 65 వేల మంది నుంచి ప్రతిరోజు 1.75 లక్షల లీటర్ల పాలను అమూల్ సంస్థ ద్వారా అత్యధిక ధర చెల్లించి సేకరిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,388 ఆర్బీకేల పరిధిలో కనీసం 4.58 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్లు, 2024 మార్చి నాటికి 8,021 ఆర్బీకేల పరిధిలో 6 లక్షల మంది రైతుల నుంచి 9 లక్షల లీటర్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు.
నిత్యం 30 మందితో మాట్లాడేలా..
పాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లాకో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కంట్రోల్ సెంటర్ పని చేస్తాయి. డీఆర్‌డీఎ, పశుసంవర్థక, సహకార శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఈ సెంటర్‌లో సేవలందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు.
ప్రతిరోజు కనీసం 30 మంది మహిళా పాడి రైతు సంఘాల కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ల సిబ్బంది మాట్లాడతారు. పాలుపోసే మహిళా పాడిరైతులతోపాటు రూట్ ఆఫీసర్స్, అమూల్ టీమ్‌కు జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పాల సేకరణ, ఫ్యాట్, ఎస్‌ఎన్‌ఎఫ్ శాతం గుర్తింపు, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు.
సేకరణ తగ్గితే రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు
ఏ గ్రామంలో అయినా పాల సేకరణ తగ్గినట్టుగా గుర్తిస్తే వెంటనే అందుకు గల కారణాలను విశ్లేషించి పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక టీమ్‌లను పంపించే ఏర్పాటును కమాండ్ కంట్రోల్ సెంటర్లు చేస్తాయి.
కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో పాటు బీఏంసీయూ, ఏఎంసీయూ భవనాల నిర్మాణాల పురోగతి, పాడి రైతులకు బ్యాంక్ లింకేజ్‌ను కలెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఎంపీడీఓ, తహసీల్దార్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సొసైటీల రిజిస్ట్రేషన్లు, పాల సేకరణకు చెల్లించే హ్యాండ్లింగ్, నిర్వహణ చార్జీలు ఎప్పటికప్పుడు జమయ్యేలా చూస్తాయి. రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
అన్ని గ్రామాలకు విస్తరిస్తాం
జగనన్న పాల వెల్లువ పథకాన్ని దశల వారీగా అన్ని ఆర్బీకేలకు, అన్ని గ్రామాలకు విస్తరించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2024 మార్చి కల్లా పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకే పరిధిలో పాల సేకరణ ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం.
– అహ్మద్ బాబు, ఎండీ, డెయిరీ డెవలప్‌మెంట్ ఫెడరేషన్
Comments
Please login to add a commentAdd a comment