amul brand
-
దేన్నీ వదలని ‘డీప్‌ఫేక్’ ముఠా..! ఫొటోలు వైరల్
ఓ ప్రముఖ నటి స్టెప్పులు వేసిన పాటకు మరో నటి స్టెప్పులు వేస్తే ఎలా ఉంటుందో మార్ఫ్ చేసి చూపిస్తే వావ్ అని అబ్బురపడతాం. ఓ 30-40 ఏళ్ల తర్వాత మనం ఎలా కనిపిస్తామో ముందే తెలుసుకోగలిగితే సూపర్ టెక్నాలజీ అని సంబరపడుతాం. అదే టెక్నాలజీ మన ముఖంతో మోసాలకు తెగబడితే.. పరువును బజారులో నిలబెడితే..! సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇటీవల ప్రముఖ హీరోయిన్ రష్మిక విషయంలో జరిగిందిదే. డీప్‌నెక్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న వేరే అమ్మాయి వీడియోను మార్ఫింగ్ చేసి రష్మికలా రూపొందించిన విషయం తెలిసిందే. తాజాగా అమూల్ బ్రాండ్ పై కూడా డీప్ ఫేక్ మరక పడింది. అమూల్ సంస్థ జున్నును శరం పేరుతో మార్కెట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఏఐ ద్వారా సృష్టించినవని.. అటువంటి ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయలేదని అమూల్ సంస్థ స్పష్టం చేసింది. శరం పేరుతో అమూల్ కొత్త రకం చీజ్ విడుదల చేసినట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌ల్లో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దానికి కంపెనీతో ఎలాంటి సంబంధం లేదని అమూల్ సంస్థ తేల్చి చెప్పింది. వినియోగదారులు ఫేక్ న్యూస్, ఫేక్ ఫొటోలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు తెలిసింది. తమ బ్రాండ్ పేరు చెడగొట్టేందుకే ఇలాంటి డీప్ ఫేక్ చిత్రాలను వైరల్ చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ పోస్టుల ద్వారా తప్పుడు సమాచారం సృష్టించి వినియోగదారులను అనవసరమైన గందరగోళాన్ని సృష్టిస్తున్నారని తెలిపింది. వైరల్ అవుతున్న ఫొటోలో అమూల్ లోగోతో లైట్ ఎల్లో కలర్ ప్యాకెట్, పెద్ద ఫాంట్లో శరం అనే పదాన్ని చిత్రీకరించారు. ఇదీ చదవండి: టోల్‌ప్లాజా తొలగింపుపై మంత్రి కీలక వ్యాఖ్యలు అముల్ బ్రాండ్‌పై ఇలాంటి వైరల్ న్యూస్, ఫొటోలు వైరల్ కావడం కొత్తేమి కాదు. గతంలో అమూల్ లస్సీ ప్యాకెట్లో ఫంగస్ ఉందని సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఫేక్ అని కేవలం వినియోగదారులను భయాందోళనకు గురి చేస్తున్నారని సంస్థ కొట్టిపారేసింది. -
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో మార్కెట్లోకి ‘అమూల్ ఆర్గానిక్’ ఉత్పత్తులు!..ఇంకా ఇతర అప్డేట్స్
-
క్షీర విప్లవం వెల్లువెత్తేలా..!
సాక్షి, అమరావతి: జగనన్న పాలవెల్లువ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం కింద ప్రస్తుతం 1,515 ఆర్బీకేల పరిధిలో 2.60 లక్షల మంది మహిళా రైతులు నమోదు కాగా.. 65 వేల మంది నుంచి ప్రతిరోజు 1.75 లక్షల లీటర్ల పాలను అమూల్ సంస్థ ద్వారా అత్యధిక ధర చెల్లించి సేకరిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 5,388 ఆర్బీకేల పరిధిలో కనీసం 4.58 లక్షల మంది రైతుల నుంచి ప్రతిరోజూ 6 లక్షల లీటర్లు, 2024 మార్చి నాటికి 8,021 ఆర్బీకేల పరిధిలో 6 లక్షల మంది రైతుల నుంచి 9 లక్షల లీటర్లను సేకరించాలని లక్ష్యంగా నిర్ధేశించారు. నిత్యం 30 మందితో మాట్లాడేలా.. పాల సేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు జిల్లాకో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు కంట్రోల్ సెంటర్ పని చేస్తాయి. డీఆర్డీఎ, పశుసంవర్థక, సహకార శాఖల నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం ఆరుగురు సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఈ సెంటర్లో సేవలందిస్తున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. ప్రతిరోజు కనీసం 30 మంది మహిళా పాడి రైతు సంఘాల కార్యదర్శులతో కమాండ్ కంట్రోల్ సెంటర్ల సిబ్బంది మాట్లాడతారు. పాలుపోసే మహిళా పాడిరైతులతోపాటు రూట్ ఆఫీసర్స్, అమూల్ టీమ్‌కు జిల్లాస్థాయిలో ఎప్పటికప్పుడు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారు. పాల సేకరణ, ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతం గుర్తింపు, సకాలంలో డబ్బులు జమ వంటి విషయాల్లో రైతులు ఎదుర్కొనే ఇబ్బందులను తెలుసుకుని సత్వర పరిష్కారానికి కృషి చేస్తారు. సేకరణ తగ్గితే రంగంలోకి ప్రత్యేక టీమ్‌లు ఏ గ్రామంలో అయినా పాల సేకరణ తగ్గినట్టుగా గుర్తిస్తే వెంటనే అందుకు గల కారణాలను విశ్లేషించి పెరిగేందుకు తీసుకోవల్సిన చర్యలపై తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతోపాటు ప్రత్యేక టీమ్‌లను పంపించే ఏర్పాటును కమాండ్ కంట్రోల్ సెంటర్లు చేస్తాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరుతో పాటు బీఏంసీయూ, ఏఎంసీయూ భవనాల నిర్మాణాల పురోగతి, పాడి రైతులకు బ్యాంక్ లింకేజ్‌ను కలెక్టర్లు పర్యవేక్షిస్తుంటారు. ఇందుకోసం ఎంపీడీఓ, తహసీల్దార్ నేతృత్వంలో మండలస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు సొసైటీల రిజిస్ట్రేషన్లు, పాల సేకరణకు చెల్లించే హ్యాండ్లింగ్, నిర్వహణ చార్జీలు ఎప్పటికప్పుడు జమయ్యేలా చూస్తాయి. రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అన్ని గ్రామాలకు విస్తరిస్తాం జగనన్న పాల వెల్లువ పథకాన్ని దశల వారీగా అన్ని ఆర్బీకేలకు, అన్ని గ్రామాలకు విస్తరించడంతో పాటు సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2024 మార్చి కల్లా పాడి సంపద ఉన్న ప్రతి ఆర్బీకే పరిధిలో పాల సేకరణ ప్రారంభించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నాం. – అహ్మద్ బాబు, ఎండీ, డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్ -
సామాన్యులకు మరో షాక్, పెరిగిన పాలధర..నిన్న అమూల్, నేడు మరో కంపెనీ!!
దేశంలో పెరిగిపోతున్న నిత్యావసర ధరలు సామాన్యుడికి మరింత భారంగా మారుతున్నాయి. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. రోజుల వ్యవధిలో పాల ఉత్పత్తి సంస్థలు పాల ధరల్ని పెంచడంలో పోటీ పడుతున్నాయి. ఇప్పటికే పాల ధరలను రూ.2పెంచుతున్నట్లు అమూల్ ప్రకటించగా.. తాజాగా దేశవ్యాప్తంగా 100కి పైగా నగరాల్లో అందుబాటులో ఉన్న మదర్ డెయిరీ సైతం పాల ధరను ఢిల్లీలో రూ.2 పెంచుత్నుట్లు ప్రకటించింది. పెరిగిపోతున్న రవాణాతో పాటు ఇతర ఖర్చుల కారణంగా పాల ధరల్ని పెంచుతున్నట్లు మదర్ డెయిరీ తెలిపింది. పెరిగిన ఈ కొత్త ధర ఢిల్లీలో ఆదివారం (రేపే) నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న మదర్ డెయిరీ లీటర్ పాల ధర ఢిల్లీలో రూ.57 ఉండగా రేపటి నుంచి రూ.59కి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ►టోన్డ్ మిల్క్ ధరలు రూ.49కి పెరగనుండగా, డబుల్ టోన్డ్ మిల్క్ లీటరుకు రూ.43కి పెరుగుతుంది. ఆవు పాల ధర లీటరుకు రూ.49 నుండి రూ.51కి పెరిగింది . ►బల్క్ వెండెడ్ మిల్క్ (టోకెన్ మిల్క్) ధర లీటరుకు రూ.44 నుంచి రూ.46 కి పెంచబడింది . ►హర్యానా, ఉత్తరప్రదేశ్,ఉత్తరాఖండ్‌లలో కూడా పాల ధరలను లీటరుకు రూ. 2 పెంచింది. ►ఈ ఎంపిక చేసిన ప్రాంతాలకు మించిన మార్కెట్లు దశలవారీగా సవరించబడతాయి. చదవండి: భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు -
భారీగా పెరిగిన అమూల్ పాల ధర.. రేపటి నుంచే కొత్త రేటు
సాక్షి, న్యూఢిల్లీ: సామాన్యుడి నెత్తిపై మరింత భారం పడనుంది. ఇప్పటికే కరోనా సమయంలో నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజలపై అదనంగా భారం పడనుంది. పాల ధరలను పెంచుతున్నట్టు అమూల్ సంస్థ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. లీటర్ పాలపై రూ. 2 పెంచుతున్నట్టు ఆ సంస్ధ యాజమాన్యం తెలిపింది. దీంతో, పెరిగిన ధరలు మార్చి 1వ తేదీ(మంగళవారం) నుంచి అమలులోకి రానున్నాయి. కాగా, అమూల్ బ్రాండ్‌లో ఉన్న అన్ని రకాల పాల ఉత్పత్తులకు కొత్త ధరలు వర్తించనున్నాయి. ఆవు, గేదె పాలకు చెందిన అన్ని రకాల ఉత్పత్తులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఇదిలా ఉండగా.. అమూల్ సంస్థ చివరి సారిగా గతేడాది జూలైలో పాల ధరలను పెంచింది. మరోవైపు తమ కస్టమర్లకు అమూల్ సంస్థ ట్విట్టర్ వేదికగా శివరాత్రి శుభాకాంక్షలను తెలిపింది. కొత్త ధరల ప్రకారం.. 1. 500 Ml అమూల్ గోల్డ్ పాలు రూ. 30 (పాత రేటు రూ. 28) 2. 500 Ml అమూల్ తాజా వేరియంట్ రూ. 24. 3. 500 Ml అమూల్ శక్తి రూ. 27లకు పాలు లభించనున్నాయి. “Let’s celebrate this Mahashivratri with Amul Shrikhand!” pic.twitter.com/ICW3TB7RB7 — Amul.coop (@Amul_Coop) February 28, 2022 -
వైరలైన అమూల్ ‘హమారీ పావ్ టీ హోరహీ హై’
ముంబై: హమారీ పావ్రీ హోరహీ హై (మా పార్టీ అవుతోంది) మాషప్ నెట్టింట హల్చల్ చేస్తోంది. యశ్‌రాజ్ ముఖాటే రూపొందించిన ఈ మాషప్ పాక్ యువ డ్యాన్సర్ డాననీర్ ఎంట్రీతో మరో లెవల్‌కి వెళ్లింది. తనదైన స్టయిల్లో ఆమె మాషప్‌లో.. యే హమారీ కార్ హై, హే హమ్ హై, హమారీ పావ్రీ హోరహీ హై (ఇది మా కారు, ఇది మేము, మా పార్టీ అవుతోంది) అంటూ వీడియో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. లక్షల వ్యూస్ సాధించింది. దాంతో ‘పావ్రీ హోరహి హై ’ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఇక ట్రెండింగ్‌లో ఉన్న హ్యాష్ ట్యాగ్‌తో ఇప్పటికే జొమాటో, స్విగ్గీ, మెక్ డొనాల్డ్స్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలు పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వీటి సరసన అమూల్ కూడా చేరింది. ‘హమారీ పావ్ టీ హోరహీ హై’(బ్రెడ్ తో టీ పార్టీ అవుతోంది) అనే మీమ్‌ను జత చేసి అమూల్ ‘పావ్రీ టీ హోరహి హై’ హ్యాష్ ట్యాగ్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడు అమూల్ పోస్టు కూడా వైరల్‌గా మారింది. మహరాష్ట్రలో పావ్ (బ్రెడ్)కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే. చదవండి: ‘హమారీ పావ్రీ’ నయా ట్రెండ్ వైరల్ -
అవినీతి ‘అమూల్’ను అంత పొగడడమా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘గర్వంతో నా హదయం ఎంతో ఉప్పొంగిపోతోంది. ఏడు దశాబ్దాల రైతుల సహకారోద్యమం ఫలితం అమూల్. ఇదొక గుర్తింపు, ఇదొక స్ఫూర్తి, దేశానికి ఇది ఎంతో అవసరం. పెట్టుబడిదారి విధానానికి, లౌకిక వాదానికి ఇదొక ప్రత్యామ్నాయం’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నాడు గుజరాత్‌లోని ఆనంద్‌లో అమూల్ కొత్త చాక్లెట్ ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ ఉద్వేగంగా చేసిన వ్యాఖ్యలు. దేశంలో రైతుల సహకార ఉద్యమానికి కొత్త నిర్వచనం ఇచ్చిన అమూల్ సహకారోద్యమం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా కీర్తిని గడించింది. ఈ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని దీనిపైనే ప్రముఖ బాలివుడ్ దర్శకుడు శ్యామ్ బెనగళ్ 1976లో ‘మంథన్’ చిత్రాన్ని తీశారు. స్మితా పాటిల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం, జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డులు లభించాయి. ఈ చిత్రానికి విజయ్ టెండూల్కర్, ఖైఫీ ఆజ్మీ స్క్రీన్ ప్లే అందించారు. వర్తమాన చరిత్రంతా అవినీతి మయమే ఇది అమూల్ గత చరిత్ర. వర్తమాన చరిత్రంతా అవినీతి మయమే. ముఖ్యంగా 2013 సంవత్సరం నుంచి అమూల్ ప్రతిష్ట మసకబారుతూ వస్తోంది. అమూల్ పరిధిలోని మొత్తం 18 మిల్క్ యూనియన్లలో నాలుగు ప్రధాన యూనియన్‌లో ఒకటైన కైరా యూనియన్ 2015, జనవరి నుంచి 2017, డిసెంబర్ నెల వరకు తమిళనాడులోని ఈరోడ్‌లో ఉన్న ‘మిల్కీ మిస్ట్’తో 262 కోట్ల రూపాయలతో జున్ను సరఫరాకు ఒప్పందం చేసుకొంది. అనుబంధ సంస్థ బనస్కాంత డెయిరీ అతి తక్కువ ధరకు జున్నును సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నా ఓ ప్రైవేటు సంస్థతో అతి ఎక్కువ రేటుకు ఒప్పందం చేసుకోవడం పట్ల కైరా యూనియన్ బోర్డు సభ్యులు ఆందోళన చేశారు. అయినా ఒప్పందం మూడేళ్లపాటు నిరాటంకంగా కొనసాగింది. పాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పుడు అనుబంధ సంస్థల నుంచే దిగుమతి చేసుకోవాలనే నియమకాన్ని కూడా ఇక్కడ ఉల్లంఘించారు. ఫలితంగా కైరా యూనియన్ పరిధిలోని పాల సేకరణ సొసైటీలకు చెందిన ఏడు లక్షల రైతులు నష్టపోయారు. 210 కోట్లు రైతులకు వచ్చేవి అమూల్ ఏ ఉత్తత్తిని విక్రయించినా అందులో 80 శాతం పాల రైతులకు వెళుతుందని, ఆ లెక్కన అనుబంధ డెయిరీతోనే జున్ను సరఫరా ఒప్పందం చేసుకున్నట్లయితే రైతుల ఆదాయం 210 కోట్ల రూపాయలకు పెరిగేదని, దాన్ని పంచితే ప్రతి రైతుకు 3,114 రూపాయలు అదనపు ఆదాయం వచ్చేదని అమూల్ పరిధిలో మొత్తం 18 యూనియన్లను పర్యవేక్షిస్తున్న ‘గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్’ ఇదివరకే వెల్లడించింది. యూనియన్లు తీసుకునే ప్రతి నిర్ణయం, ఒప్పందం విషయంలో నాలుగు అంచెల తనిఖీ వ్యవస్థలు ఉంటాయి. యూనియన్ బోర్డు నెలకోసారి సమావేశం అవుతుంది. నెలకోసారి ప్రణాళికా సమావేశం జరుగుతుంది. నెలకోసారి ఫెడరేషన్, రాష్ట్ర ఆడిట్‌తో సమన్వయ సమావేశం జరుగుతుంది. యూనియన్‌కు కూడా సొంత ఆడిటర్లు ఉంటారు. ఈ నాలుగు అంచెల వ్యవస్థ ఉన్నప్పటికీ నియమ నిబంధనలకు విరుద్ధంగా అనుబంధ డెయిరీలను వదిలేసి ఓ ప్రైవేటు డెయిరీతో ఒప్పందం చేసుఉన్నారంటే అవినీతి ఎంత దూరం విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. మెహసానా డెయిరీపై కూడా అమూల్ కుటుంబంలోని అతి పెద్ద మిల్క్ యూనియన్‌కు చెందిన బనాస్ డెయిరీపైనా కూడా ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2013లో అమూల్‌కు చెందిన మెహసానాలోని దూద్‌సాగర్ డెయిరీ అప్పటి చైర్మన్ విఫుల్ చౌధరి ప్రైవేటు వ్యక్తులకు అతి తక్కువ రేటుకు 7,000 టన్నుల పాల పొడిని సరఫరా చేశారు. ఫలితంగా డెయిరీకి ఎంతో నష్టం వచ్చిందని మార్కెటింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ ఎస్ సోధియే వెల్లడించారు. పైగా అనవసరంగా డెయిరీ ఉత్పత్తి సామర్థ్యాన్ని చౌధరి పెంచారని, దానివల్ల అనవసర ఖర్చులు పెరిగాయని ఆయన అన్నారు. 18 మిల్క్ యూనియన్లలో కైరా, బనస్కాంత, సబర్కాంత, మెహసానా యూనియన్లు పెద్దవి. దాదాపు వీటన్నింటిపైనా అవినీతి ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. నాడు గాంధేయవాదులు స్థాపించగా అమూల్ డెయిరీని 1946లో త్రిభువన్ దాస్ పటేల్ లాంటి గాంధేయవాద స్వాతంత్య్ర సమర యోధులు స్థాపించారు. 1980 ప్రాంతం స్థానిక పలుకుబడి కలిగిన వ్యక్తుల చేతుల్లోకి యాజమాన్యం వెళ్లింది. 1990 తర్వాత రాజకీయ నాయకుల హవా మొదలయింది. ఒకప్పుడు నిజమైన రైతులే మిల్క్ యూనియన్లకు చైర్మన్లుగా, డైరెక్టర్లుగా ఉండేవారు. రాజకీయ పార్టీల ప్రవేశంతో అమూల్ యాజమాన్యంలో రైతుల ప్రభావం తగ్గి నేతల ప్రభావం పెరిగింది. రాజకీయ పార్టీల ప్రవేశంతో ఎన్నికల ఖర్చు కూడా పెరగడంతో ఎన్నికైన వాళ్లు చేసిన ఖర్చు అంతకంతకు రాబట్టుకునేందుకు అవినీతికి పాల్పడుతున్నారు. 18 మిల్క్ యూనియన్లు బీజేపీ చేతుల్లోనే అమూల్ కుటుంబంలోని మొత్తం 18 మిల్క్ యూనియన్లకు చైర్మన్లుగా ప్రస్తుతం బీజేపీ నాయకులే ఉన్నారు. వారి ఆహ్వానం మేరకే ప్రధాని వచ్చి ఎంతో స్ఫూర్తి దాయకంగా మాట్లాడారు. ఆయనకు అదంతా గతమన్న విషయం తెలుసో, తెలియదోగానీ అమూల్ పరిస్థితి ప్రస్తుతం బయటకు ఒకలాగా, లోపల ఒకలాగా అంటే, ఏనుగుకు బయట కనిపించే దంతాలు వేరు, లోపల నమిలే దంతాలు వేరన్నట్లు ఉంది. -
14 శాతం పెరిగిన అమూల్ టర్నోవర్
న్యూఢిల్లీ: గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్(జీసీఎంఎంఎఫ్) టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 14 శాతంపెరిగింది. ఈ సంస్థ అమూల్ బ్రాండ్ కింద పాలు, ఇతర పాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.18,143 కోట్లుగా ఉన్న టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో రూ.20,730 కోట్లకు పెరి గిందని జీసీఎంఎంఎఫ్ మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.ఎస్. శోధి చెప్పారు. వినియోగదారుల ఉత్పత్తుల విభాగంలో అమ్మకాలు 21% వృద్ధి చెందడమే దీనికి కారణమని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రైతులకు 8-10% అధిక ధరను చెల్లించామని తెలిపారు. అయితే దేశీయ మార్కెట్లో పాల సేకరణ ధరలు 15-20 శాతం వరకూ తగ్గాయని పేర్కొన్నారు. నెయ్యి, స్కిమ్మ్‌డ్ మిల్క్ పౌడర్ వంటి బల్క్ కమోడిటీ విభాగాల్లో రాబడులు 70%కి పైగా క్షీణించాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గడమే దీనికి కారణమని వివరించారు. పాల సరఫరా 15% పెరిగినందున పాల ధరలను తక్షణం పెంచే యోచనేదీ లేదని తెలిపారు. విస్తరణ కార్యకలాపాలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 230 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తున్నామని, రెండేళ్లలో దీనిని 320 లక్షల లీటర్లకు పెంచడం లక్ష్యమని శోధి చెప్పారు. -
2020 నాటికి రూ.50 వేల కోట్ల టర్నోవర్
అమూల్ లక్ష్యం విస్తరణకు రూ.5,000 కోట్ల వ్యయం జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్ఎస్ సోధి హైదరాబాద్ పాల మార్కెట్లోకి ప్రవేశం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) హైదరాబాద్ మార్కెట్లో తాజా పాలను శుక్రవారం ప్రవేశపెట్టింది. తద్వారా ఈ విభాగంలో కంపెనీ దక్షిణాది మార్కెట్లో అడుగుపెట్టినట్టయింది. లీటరు ధర టోన్డ్ పాలు రూ.38, ఫుల్ క్రీమ్ పాలు రూ.50 ఉంది. విజయ బ్రాండ్‌కు హాని తలపెట్టకూడదనే ఉద్ధేశంతోనే ఈ ధర నిర్ణయించినట్టు కంపెనీ తెలిపింది. అమూల్‌కు కావాల్సిన పాలను నల్గొండ-రంగారెడ్డి మిల్క్ ప్రొడ్యూసర్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ యూనియన్ (నార్మాక్) అందిస్తుంది. కొద్ది రోజులపాటు గుజరాత్ నుంచి పాలను ఇక్కడికి తెప్పిస్తారు. అమూల్ రోజుకు 100 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలను దేశవ్యాప్తంగా విక్రయిస్తోంది. రెండేళ్లలో 25 శాతం.. హైదరాబాద్ మార్కెట్లో రోజుకు 17 లక్షల లీటర్ల ప్యాకెట్ పాలు అమ్ముడవుతున్నాయి. 20 వరకు బ్రాండ్లున్నాయి. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే భాగ్యనగరంలో లీటరుకు రూ.6-10 ధర అధికంగా ఉంది. పంపిణీ వ్యవస్థ అసమర్థత, దళారుల కారణంగానే పరిస్థితి ఇలా ఉందని జీసీఎంఎంఎఫ్ ఎండీ ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఇటువంటి వ్యవస్థకు చెక్‌పెడుతూ వినియోగదార్లకు తక్కువ ధరలో నాణ్యమైన పాలను అందిస్తామని చెప్పారు. నార్మాక్ చైర్మన్ జి.జితేందర్ రెడ్డి తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 45 శాతం ఫ్రెష్ మిల్క్ నుంచే.. కంపెనీ ఆదాయంలో తాజా పాల వాటా 45 శాతం కైవసం చేసుకుంది. జీసీఎంఎంఎఫ్ 2020 నాటికి రూ.50 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకుంది. 2013-14లో టర్నోవర్ రూ.18,160 కోట్లుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22 వేల కోట్లు దాటతామని ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఏటా 24 శాతం వృద్ధి కనబరుస్తున్నట్టు వెల్లడించారు. హయత్‌నగర్ వద్ద ఉన్న నార్మాక్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు 3 లక్షల లీటర్లు. మరో లక్ష లీటర్లను జోడించొచ్చు. కాగా, పాల మార్కెట్ ప్రపంచంలో 1.5 శాతం, భారత్‌లో 4.5 శాతం వృద్ధి చెందుతోంది. భారత్‌లో సగటు పాల వినియోగం 1970లో 112 గ్రాములు నమోదైంది. ప్రస్తుతం ఇది 310 గ్రాములకు ఎగసింది. భారీ విస్తరణ.. కంపెనీకి రోజుకు 2.3 కోట్ల లీటర్ల పాలను ప్రాసెసింగ్ చేసే సామర్థ్యం ఉంది. దీనిని రెండేళ్లలో 3.2 కోట్ల లీటర్లకు చేర్చనున్నారు. విస్తరణకు కంపెనీ మూడేళ్లలో రూ.4-5 వేల కోట్లను వ్యయం చేయనుంది. 80 దేశాలకు పాలు, పాల ఉత్పత్తులను జీసీఎంఎంఎఫ్ ఎగుమతి చేస్తోంది. -
‘టీ’కి గుజరాత్ పాలు
అక్కడి రైతుల నుంచి సేకరించి.. ఇక్కడ అమ్మకాలు * తెలంగాణ పాడి రైతుపై తీవ్ర ప్రభావం * వచ్చేనెల 4 లేదా 10 నుంచి ‘అమూల్ బ్రాండ్’తో మార్కెట్లోకి * అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజయ డెయిరీ ఎండీ విన్నపం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గుజరాత్ పాలు ‘పొంగి’పొర్లనున్నాయి. ఆ రాష్ర్టం లోని రైతుల నుంచి సేకరించిన పాలను హైదరాబాద్‌లో విక్రయించాలని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (జీసీఎంఎంఎఫ్) నిర్ణయించింది. వచ్చే నెల 4 లేదా 10వ తేదీ నుంచి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంది. మొదటగా 50 వేల లీటర్లతో ప్రారంభించి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనేది జీసీఎంఎంఎఫ్ లక్ష్యంగా కనిపిస్తోంది. పాల సరఫరాకు టెండర్లు ఆహ్వానించిన ఆ కంపెనీ నాచారం సమీపంలోని మల్లాపూర్‌లో కార్యాలయాన్ని ప్రారంభించింది. గుజరా త్ నుంచి ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చిన పాలను ప్యాకింగ్ చేసేందుకు నల్లగొండ-రంగారెడ్డి మి ల్క్ యూనియన్ (నార్మాక్)తో జీసీఎంఎంఎఫ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ప్రకారం హయత్‌నగర్‌లో ఉన్న యూనిట్లో ప్యాకింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. రాష్ట్ర రైతులకు శరాఘాతం... తెలంగాణలో ప్రస్తుతం రోజుకు 20 లక్షల లీటర్ల పాలు సరఫరా అవుతున్నాయి. అందులో విజయ డెయిరీ వాటా 4.5 లక్షల లీటర్లు మాత్రమే. మిగిలినదంతా ప్రైవేటు డెయిరీలే సరఫరా చేస్తున్నాయి. ప్రైవేటు డెయిరీల ఆధిపత్యం మూలంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పాల ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయాయి. డీలర్లకు, రైతులకు కమిషన్లు ఎక్కువగా ఇచ్చి ప్రభుత్వ ఆధ్వర్యంలోని విజయ డెయిరీని మూలన పడేశారు. దీంతో విజయ డెయిరీకి పాలు పోసే రైతులు తగ్గిపోవడంతో లక్షన్నర లీటర్లను కర్ణాటక సహా ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నారు. పరిస్థితిని గమనించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతులకు పాల సేకరణ ప్రోత్సాహం కింద లీటరుకు రూ. 4 అదనంగా ఇస్తుండడంతో ఇటీవలే విజయ డెయిరీకి ప్రాణం పోసినట్లయింది. అయితే ఇప్పుడు గుజరాత్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ప్రధాన ప్రభావం విజయ డెయిరీపైనే పడుతుంది. పైగా ఎక్కువ కమిషన్ ఇస్తామని విజయ డెయిరీ డీలర్లకే జీసీఎంఎంఎఫ్ వారు గాలం వేస్తున్నారు. మరోవైపు నేరుగా గుజరాత్ రైతుల పాలనే ఇక్కడ అమ్మాలని నిర్ణయించడం వల్ల మన చిన్న సన్నకారు రైతులు ఉత్పత్తి చేసే పాలకు గిరాకీ లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే గుజరాత్ సంస్థ అమూల్ బ్రాండ్ మహారాష్ట్రలో అడుగుపెట్టాక అక్కడి ప్రభుత్వ పాల సహకార సంస్థ ‘గోకుల్’ నిర్వీర్యం అయిందని అధికారులు అంటున్నారు. అమూల్ బ్రాండ్‌ను అడ్డుకోండి... గుజరాత్ ప్రభుత్వానికి చెందిన అమూల్ బ్రాండ్ పాలను రాష్ట్రంలోకి రానీయకుండా అడ్డుకోవాలని విజయ డెయిరీ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయ డెయిరీ ఎండీ శ్రీనివాస్ ఈ మేరకు లిఖిత పూర్వకంగా విన్నవించినట్లు తెలిసింది. గుజరాత్ అమూల్ బ్రాండ్ పాలు రాష్ట్రంలోకి అడుగుపెడితే ఇక్కడి పాడి రైతులకు కష్టాలు తప్పవని పేర్కొన్నట్లు సమాచారం. మ్యూచువల్లీ ఎయిడెడ్ సహకార సొసైటీలో ఉన్న నార్మాక్ యూనిట్ ప్రభుత్వ డెయిరీకి చెందిన 72 ఎకరాల స్థలంలోనే ఉంద ని.. ఈ నేపథ్యంలో గుజరాత్‌తో ఆ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అమూల్ పాల కారణంగా తెలంగాణ రైతులకు నాణ్యమైన ధర రాదని.. మొత్తం వ్యవస్థ వారి చేతుల్లోకి పోతుందని విజయ డెయిరీ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.అశోక్, అధ్యక్షుడు మోహన్‌మురళీ అన్నారు. గుజరాత్లో సేకరించిన పాలను ఇక్కడకు తరలించాలంటే లీటరుకు రూ. 3.50 అవుతుందని.. మున్ముందు పాల ధరలు పెరిగే ప్రమాదం పొంచి ఉందని వారు అభిప్రాయపడ్డారు. -
రాష్ట్రంలో ఇక అమూల్ తాజా పాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) హైదరాబాద్ మార్కెట్లో తాజా (ఫ్రెష్) పాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఐస్‌క్రీం, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్‌తోపాటు ఇతర పాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తోంది. యూపీ, రాజస్థాన్ తర్వాత అత్యధికంగా పాలు ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్‌లోనే. అందుకే ఇక్కడ అడుగు పెట్టాలని జీసీఎంఎంఎఫ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. తాజా పాల మార్కెట్ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నట్టు సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఎప్పుడు ప్రవేశించేది కొద్ది రోజుల్లో వెల్లడిస్తామ న్నారు. పాలు, పాల ఉత్పత్తుల రంగం తీరుతెన్నులు, కంపెనీ లక్ష్యం గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన ఇంటర్వ్యూ... దేశంలో పాల ఉత్పత్తి ఎలా ఉంది? 2013-14లో భారత్‌లో 14 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. పరిశ్రమ పరిమాణం రూ.3.6 లక్షల కోట్లు. వ్యవసాయ జీడీపీలో 26 శాతం వాటా డెయిరీదే. ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచ నంబర్-1 స్థానంలో భారత్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి రూ.2,400 కోట్ల విలువైన పాల పొడి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ప్రభుత్వం అనుమతిస్తే 2014-15లో ఈ విలువ రూ.3,000 కోట్లకు చేరుకోవచ్చు. ఇక దేశంలో రోజుకు ఒక వ్యక్తి సరాసరి పాల వినియోగం 290 గ్రాములుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 278 గ్రాముల కంటే ఇది ఎక్కువ. పట్టణీకరణ, ఆరోగ్యం పట్ల అవగాహన, ఆదాయాల్లో పెరుగుదల పాలకు డిమాండ్ పెరిగేలా చేస్తోంది. డెయిరీ రంగంలో ఉన్న సవాళ్లేంటి? ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభా 20 ఏళ్లలో 540 కోట్ల నుంచి 700 కోట్లకు చేరింది. ప్రొటీన్ (మాంసకృత్తులు) వినియోగం రోజుకు 3.7 లక్షల టన్నుల నుంచి 5.4 లక్షల టన్నులకు ఎగసింది. అధిక వృద్ధి నమోదైంది ఆసియా దేశాల్లోనే. ఇక వ్యవసాయయోగ్య భూమి ఐదేళ్ల క్రితం సగటున 2.2 ఎకరాలుంటే నేడది 1.2 ఎకరాలకు కుచించుకుపోయింది. వ్యవసాయానికి పనికొచ్చే భూమి తగ్గితే పాలిచ్చే జంతువులకు దాణా కొరత వస్తుంది. ఈ పరిణామాలతో పాల ఉత్పత్తి తగ్గుతుంది. సమస్య పరిష్కారానికి మీరిచ్చే సలహా? పాలిచ్చే జంతువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించాలి. దేశీయ పశువుల ఉత్పాదకత మరింత పెరగాలి. రైతులకు తక్కువ ధరకే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావాలి. సమస్యలను అధిగమించకపోతే పాల డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరగడం ఖాయం. 2020 నాటికి భారత్‌కు 19 కోట్ల టన్నుల పాలు అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి. ఐస్‌క్రీమ్ మార్కెట్ ఎలా ఉంది? ఐస్‌క్రీమ్ మార్కెట్ పరిమాణం దేశంలో రూ.3,000 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 18 కోట్ల లీటర్ల వినియోగంతో రూ.1,500 కోట్లుంది. భారత్‌లో ఒక ఏడాదిలో ఒక వ్యక్తి 350 మిల్లీలీటర్ల ఐస్‌క్రీమ్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రపంచ సరాసరి 2.3 లీటర్లు ఉంది. అమూల్ ఐస్‌క్రీమ్ ఆసియా టాప్ 10 బ్రాండ్లలో ఒకటి. ఏడేళ్లలో ఈ బ్రాండ్ భారత్‌లో తొలి స్థానానికి చేరుకోవడం విశేషం. జాతీయ బ్రాండ్ కూడా ఇదొక్కటే. ఐస్‌క్రీమ్ మార్కెట్లో 40 శాతం వాటా సొంతం చేసుకుంది. అమూల్ భవిష్యత్ విస్తరణ ఎలా చేపట్టబోతున్నారు? ఎంత ఆదాయం ఆశిస్తున్నారు? పాల పొడి, పాల ఉత్పత్తులను 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భారత్‌లో మరిన్ని చిన్న పట్టణాలకు పెద్ద ఎత్తున విస్తరించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన హైదరాబాద్‌లో తాజా పాలను ప్రవేశపెట్టే యత్నాల్లో ఉన్నాం. అమూల్, సాగర్ బ్రాండ్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. చాలా విభాగాల్లో మేమే నంబర్ 1. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18,160 కోట్ల ఆదాయం ఆర్జించాం. తొలిసారిగా 32 శాతం వృద్ధి నమోదు చేశాం. 2014-15లో 20 శాతంపైగా వృద్ధితో రూ.22,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకున్నాం.