రాష్ట్రంలో ఇక అమూల్ తాజా పాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమూల్ బ్రాండ్‌తో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) హైదరాబాద్ మార్కెట్లో తాజా (ఫ్రెష్) పాలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ఐస్‌క్రీం, అల్ట్రా హై టెంపరేచర్ మిల్క్‌తోపాటు ఇతర పాల ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తోంది.
యూపీ, రాజస్థాన్ తర్వాత అత్యధికంగా పాలు ఉత్పత్తి అయ్యేది ఆంధ్రప్రదేశ్‌లోనే. అందుకే ఇక్కడ అడుగు పెట్టాలని జీసీఎంఎంఎఫ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తోంది. తాజా పాల మార్కెట్ తీరుతెన్నులను తెలుసుకునేందుకు ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నట్టు సంస్థ ఎండీ ఆర్.ఎస్.సోధి తెలిపారు. ఎప్పుడు ప్రవేశించేది కొద్ది రోజుల్లో వెల్లడిస్తామ న్నారు. పాలు, పాల ఉత్పత్తుల రంగం తీరుతెన్నులు, కంపెనీ లక్ష్యం గురించి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు ఇచ్చిన
ఇంటర్వ్యూ...
దేశంలో పాల ఉత్పత్తి ఎలా ఉంది?
2013-14లో భారత్‌లో 14 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. పరిశ్రమ పరిమాణం రూ.3.6 లక్షల కోట్లు. వ్యవసాయ జీడీపీలో 26 శాతం వాటా డెయిరీదే. ఉత్పత్తి పరంగా చూస్తే ప్రపంచ నంబర్-1 స్థానంలో భారత్ నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం నుంచి రూ.2,400 కోట్ల విలువైన పాల పొడి వివిధ దేశాలకు ఎగుమతి అయింది. ప్రభుత్వం అనుమతిస్తే 2014-15లో ఈ విలువ రూ.3,000 కోట్లకు చేరుకోవచ్చు. ఇక దేశంలో రోజుకు ఒక వ్యక్తి సరాసరి పాల వినియోగం 290 గ్రాములుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన 278 గ్రాముల కంటే ఇది ఎక్కువ. పట్టణీకరణ, ఆరోగ్యం పట్ల అవగాహన, ఆదాయాల్లో పెరుగుదల పాలకు డిమాండ్ పెరిగేలా చేస్తోంది.
డెయిరీ రంగంలో ఉన్న సవాళ్లేంటి?
ప్రపంచవ్యాప్తంగా చూస్తే జనాభా 20 ఏళ్లలో 540 కోట్ల నుంచి 700 కోట్లకు చేరింది. ప్రొటీన్ (మాంసకృత్తులు) వినియోగం రోజుకు 3.7 లక్షల టన్నుల నుంచి 5.4 లక్షల టన్నులకు ఎగసింది. అధిక వృద్ధి నమోదైంది ఆసియా దేశాల్లోనే. ఇక వ్యవసాయయోగ్య భూమి ఐదేళ్ల క్రితం సగటున 2.2 ఎకరాలుంటే నేడది 1.2 ఎకరాలకు కుచించుకుపోయింది. వ్యవసాయానికి పనికొచ్చే భూమి తగ్గితే పాలిచ్చే జంతువులకు దాణా కొరత వస్తుంది. ఈ పరిణామాలతో పాల ఉత్పత్తి తగ్గుతుంది.
సమస్య పరిష్కారానికి మీరిచ్చే సలహా?
పాలిచ్చే జంతువులకు నాణ్యమైన పశుగ్రాసం అందించాలి. దేశీయ పశువుల ఉత్పాదకత మరింత పెరగాలి. రైతులకు తక్కువ ధరకే అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి రావాలి. సమస్యలను అధిగమించకపోతే పాల డిమాండ్-సరఫరా మధ్య అంతరం పెరగడం ఖాయం. 2020 నాటికి భారత్‌కు 19 కోట్ల టన్నుల పాలు అవసరమవుతాయన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే సిద్ధమవ్వాలి.
ఐస్‌క్రీమ్ మార్కెట్ ఎలా ఉంది?
ఐస్‌క్రీమ్ మార్కెట్ పరిమాణం దేశంలో రూ.3,000 కోట్లుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృత రంగం వాటా 18 కోట్ల లీటర్ల వినియోగంతో రూ.1,500 కోట్లుంది. భారత్‌లో ఒక ఏడాదిలో ఒక వ్యక్తి 350 మిల్లీలీటర్ల ఐస్‌క్రీమ్‌ను మాత్రమే వినియోగిస్తున్నారు. ప్రపంచ సరాసరి 2.3 లీటర్లు ఉంది. అమూల్ ఐస్‌క్రీమ్ ఆసియా టాప్ 10 బ్రాండ్లలో ఒకటి. ఏడేళ్లలో ఈ బ్రాండ్ భారత్‌లో తొలి స్థానానికి చేరుకోవడం విశేషం. జాతీయ బ్రాండ్ కూడా ఇదొక్కటే. ఐస్‌క్రీమ్ మార్కెట్లో 40 శాతం వాటా సొంతం చేసుకుంది.
అమూల్ భవిష్యత్ విస్తరణ ఎలా చేపట్టబోతున్నారు? ఎంత ఆదాయం ఆశిస్తున్నారు?
పాల పొడి, పాల ఉత్పత్తులను 50 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. భారత్‌లో మరిన్ని చిన్న పట్టణాలకు పెద్ద ఎత్తున విస్తరించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. అతిపెద్ద మార్కెట్లలో ఒకటైన హైదరాబాద్‌లో తాజా పాలను ప్రవేశపెట్టే యత్నాల్లో ఉన్నాం. అమూల్, సాగర్ బ్రాండ్లలో ఉత్పత్తులను విక్రయిస్తున్నాం. చాలా విభాగాల్లో మేమే నంబర్ 1. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18,160 కోట్ల ఆదాయం ఆర్జించాం. తొలిసారిగా 32 శాతం వృద్ధి నమోదు చేశాం. 2014-15లో 20 శాతంపైగా వృద్ధితో రూ.22,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా చేసుకున్నాం.