జిరాక్స్ పేపర్లతో హెచ్ఎంల పాట్లు
వర్గల్,న్యూస్‌లైన్: సీసీఈ విధానంలో విద్యార్థుల సమగ్ర మదింపు కోసం నిర్వహిస్తున్న అర్థ వార్షిక పరీక్షలు తొలి రోజు అభాసుపాలయ్యాయి. గురువారం వర్గల్ మండలంలోని అనేక పాఠశాలల్లో జిరాక్స్ ప్రశ్నపత్రాలతో పరీక్షలు నెట్టుకొచ్చారు. ప్రశ్నపత్రాలు సక్రమంగా పంపిణీ చేయడంలో ఆర్వీఎం విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వర్గల్ మండలంలో 37 ప్రాథమిక, 4 ప్రాథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలున్నాయి. వర్గల్, పాములపర్తి, మజీద్‌పల్లి, తున్కిఖాల్సా, వేలూరు ,నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ఇవి ఉన్నాయి. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు గురువారం అర్థవార్షిక పరీక్షలు ప్రారంభ మయ్యాయి.
ఇందుకోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ప్రశ్న పత్రాలు అనేక పాఠశాలలకు సక్రమంగా అందలేదు ‘సాక్షి’ దినపత్రిక ద్వారా ఈ పరిస్థితి వెలుగులోకి రావడంతో ఆర్వీఎం అధికారులు ప్రశ్నపత్రాల సర్దుబాటు చేసే పనిలో పడ్డారు. ఏ పాఠశాలకు అదనంగా ప్రశ్నపత్రాలు చేరాయో సమాచారం సేకరించి, వాటిని కొరత నెలకొన్న మండలాలకు చేరవేసే ప్రయత్నంలో అధికారులు నిమగ్నమయ్యారు. మండలంలో ప్రధానంగా పాములపర్తి, తున్కిఖాల్సా, నెంటూరు కాంప్లెక్సుల పరిధిలో ప్రశ్నపత్రాల కొరత గుర్తించారు. తొలిరోజు గురువారం తెలుగు పరీక్ష జరగాల్సిఉండగా పాములపర్తి, గౌరారం, పాతూరు, తున్కిఖాల్సా పాఠశాలలకు ఏడో తరగతి ప్రశ్నపత్రం ఒక్కటి కూడా రాలేదు. దీంతో పాఠశాలల హెచ్ఎంలు పరిస్థితిని మండల విద్యాధికారి దృష్టికి తీసుకవెళ్లారు.