ప్రముఖుల దిగ్భ్రాంతి
రామోజీరావు మరణంతో దేశం మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన దిగ్గజాన్ని కోల్పోయింది. ఆయన ఈనాడు దినపత్రిక, ఈటీవీ న్యూస్ నెట్వర్క్, ఫిల్మ్ సిటీ సహా అనేక సంస్థలను నెలకొల్పిన వినూత్న వ్యాపారవేత్త. సమాజ హితంపై ఆయనకు ఉన్న దృష్టి కారణంగా పద్మ విభూషణ్ వరించింది. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి ప్రకటిస్తున్నాను. – ద్రౌపది ముర్ము, రాష్ట్రపతి⇒ రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో రామోజీ సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. రామోజీరావు కుటుంబానికి, అభిమానులకు ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి. –నరేంద్ర మోదీ, ప్రధాని⇒ భారతీయ మీడియా పరిశ్రమలో అగ్రగామిగా నిలిచిన పద్మవిభూషణ్ రామోజీరావు మృతికి నా సంతాపం. జర్నలిజం, సినిమా, వినోదానికి ఆయన చేసిన కృషి మీడియా ల్యాండ్‌స్కేప్‌ను మార్చింది. – రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత⇒ మీడియా, వినోద రంగాల్లో ఆయన బహుముఖ ప్రజ్ఞ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. –ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్ ⇒ భారతీయ మీడియా, సినీ రంగాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన దిగ్గజం రామోజీరావు. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు, నిజాయితీని పెంపొందించారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. – రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తీరని లోటు: రేవంత్‌రెడ్డి ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలుగు పత్రికా, మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటని అన్నారు. తెలుగు జర్నలిజానికి విశ్వసనీయతను, తెలుగు మీడియా రంగానికి కొత్త పంథాను నేర్పిన ఘనత రామోజీరావుకి దక్కుతుందని పేర్కొన్నారు. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావుతో జరిగిన సమావేశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.తెలుగు వారి కీర్తిని చాటిన వ్యక్తి: చంద్రబాబురామోజీ మరణవార్త తెలిసిన వెంటనే ఢిల్లీలో ఉన్న చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చారు. భార్య భువనేశ్వరితో కలిసి ఫిలింసిటీకి వెళ్లి రామోజీ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను ఓదార్చారు. అనంతరం మీడియాతో బాబు మాట్లాడుతూ, రామోజీరావును యుగపురుషుడిగా అభివర్ణించారు. నిత్యం సమాజహితం కోసం, తెలుగుజాతి కోసం పనిచేసిన వ్యక్తి రామోజీ అని, సాధారణ కుటుంబంలో పుట్టి, అసాధారణ వ్యక్తిగా ఎదిగారని, తెలుగువారి కీర్తిని దశదిశలా చాటారని అన్నారు. కేసీఆర్ సంతాపం...రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రామోజీ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, రామోజీరావు మరణం తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆయన ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్‌రెడ్డిలతో కలిసి ఫిలింసిటీలో రామోజీరావు పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.⇒ రామోజీరావులో అందరూ గంభీరమైన వ్యక్తిని చూసుంటారు. నేను మాత్రం ఆయనలో చిన్న పిల్లాడిని చూశాను. ఆయనకు పెన్నులంటే ఇష్టం. ప్రజారాజ్యం పార్టీ నడుపుతున్న సమయంలో ఒక పెన్ను బహూకరిస్తే దాన్ని చూసి ఆయన మురిసిపోయారు. – చిరంజీవి⇒ ప్రమాణ స్వీకారం తర్వాత వచ్చి ఆయన్ను కలుద్దామనుకున్నా. కానీ, ఇంతలోనే దురదృష్టవశాత్తూ కన్నుమూశారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలి. – పవన్ కళ్యాణ్ప్రముఖుల సంతాపం..రామోజీకి నివాళులు అర్పించిన వారిలో బీజేపీ అగ్రనేతలు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌షా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్, మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీతక్క, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పువ్వాడ అజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వరరెడ్డి, సినీనటులు నాగార్జున, వెంకటేశ్, మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, కళ్యాణ్‌రామ్, నరేష్, కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, బోయపాటి శ్రీను, రాజమౌళి, కీరవాణి, ఎస్.వి.కృష్ణారెడ్డి, ఇళయరాజా, మంచు విష్ణు, విజయేంద్రప్రసాద్ తదితరులు ఉన్నారు. – సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్