మీడియాపై దాడులను నిరసిస్తూ ధర్నా
విజయవాడ (గాంధీనగర్) : సమాచార, ప్రసార మాధ్యమాలపై మోదీ ప్రభుత్వం చేస్తున్న దాడులను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్ ) లిబరేషన్ ఆధ్వర్యంలో బుధవారం లెనిన్సెంటర్లో ధర్నా నిర్వహించారు. న్యూస్చానళ్లు, పత్రికలపై నిషేధం ఎత్తివేయాలని, వాక్ స్వాతంత్య్రంపై దాడులు ఆపాలని నినాదాలు చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్.మూర్తి మాట్లాడుతూ కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందుత్వ మార్కు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించేవారిపై దాడులు జరుగుతున్నాయని, ప్రజలు అభద్రతభావంతో బతుకుతున్నారని పేర్కొన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని చెప్పారు. ప్రభుత్వం సాగిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతున్న మీడియాపై, విలేకరులు, యాజమాన్యాలపై కేసులు బనాయిస్తున్నారన్నారు. రాష్ట్ర కార్యదర్శి బి.బంగార్రాజు, సభ్యులు హరినాథ్, గోడుగు సత్యనారాయణ, ఆర్.నాగమణి, ఎం.కుమారి, ప్రసాద్ పాల్గొన్నారు.