central medical team
-
‘వ్యాక్సినేషన్’లో ఇంత నిర్లక్ష్యమా?
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువులకు టీకాల అనంతరం పారాసిటమాల్ మాత్రలకు బదులు నొప్పి నివారణ ట్రామడాల్ మాత్రలు ఇచ్చిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విధి నిర్వహణలో అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారంటూ రాష్ట్ర వైద్యాధికారులను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వమే పెంటావాలెంట్ టీకాను సరఫరా చేస్తున్న నేపథ్యంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన ఇమ్యునైజేషన్ టెక్నికల్ సపోర్టు బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న పసికందుల ఆరోగ్య పరిస్థితిని ఈ బృందంలోని డాక్టర్ దీపక్ పొలపాకర, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వికాస్ మదన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణకుమార్ సహా మరో ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు. అలాగే శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అలాగే సంఘటన జరిగిన నాంపల్లి ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేశారు. టీకాల నిల్వ, మందుల పంపిణీలో తీసుకుంటున్న జాగ్రత్తలు, పసికందులకు ఇస్తున్న మాత్రలను పరిశీలించారు. కోలుకుంటున్న శిశువులు... నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అస్వస్థతకు గురై నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 34 మంది నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మెరుగుపడింది. వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు శిశువులు శుక్రవారం స్పృహలోకి రావడంతో వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. అయితే ట్రామడాల్ టాబ్లెట్ ప్రభావం మెదడుపై 48 గంటల వరకు ఉండే అవకాశం ఉండటంతో మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. మిగిలిన చిన్నారులంతా కోలుకుంటున్నారు. వారిని శనివారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. పీహెచ్‌సీల నుంచి ట్రామడాల్ వెనక్కి... నవజాత శిశువులు అస్వస్థతకు గురైన ఘటనపై ఈ నెల 11లోగా సమగ్ర నివేదిక సమర్పిం చాలని ప్రజారోగ్య సంచాలకులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఆదేశించారు. ఘటనకు గల కారణాలు, పరిస్థితిపై అధ్యయనానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చైర్‌పర్సన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారంలోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల నుంచి ట్రామడాల్ మాత్రలు, ఇంజెక్షన్లను వెనక్కు తెప్పించాలని, ఈ నెల 18లోగా అన్ని పీహెచ్‌సీలకు పారాసిటమాల్ సిరప్, చుక్కల మందును సరఫరా చేయాలని టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీని ఆదేశించారు. ఇద్దరు శిశువుల మృతికి కారణమైన మెడికల్ ఆఫీసర్, ముగ్గురు ఏఎన్ఎంలు, ఒక ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి తొలగించాలని, సూపర్వైజర్, ఎస్పీహెచ్వో, డీఐవోలపై కేసులు నమోదు చేయాలన్నారు. హెల్త్ సెంటర్ ఇన్చార్జి, ఏఎన్ఎంలు, పారామెడికల్ సిబ్బందిపై హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
డెంగీ కాదా.. మరి ఏ వైరస్?
ఆ ఊళ్లలో మరణాలకు విషజ్వరాలు.. డెంగీ కారణం కాదు. మరేదో వైరస్ సోకింది. అదేదో అంతుచిక్కని వ్యాధి.. అదేమిటి.. ఎలా ప్రబలింది..? ఇదీ స్థానికులను తొలుస్తున్న ప్రశ్న. ఇది తెలుసుకోవడానికే వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులివల్లం గ్రామాల్లో కేంద్ర, జాతీయ వైద్య బృందం రంగంలోకి దిగింది. సాక్షి, తిరుపతి: ఆ నాలుగు గ్రామాలను అంతుచిక్కని వ్యాధి భయపెడుతోంది. వరదయ్యపాళెం మండలంలోని ఆ పల్లెలకు ఏదో వైరస్ సోకిందనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వైరస్ ఏది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. బత్తలవల్లంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులి వల్లం గ్రామాల్లో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 17 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా కేవలం డెంగీ జ్వరం కారణంగానే మరణించినట్లు భావిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం డెంగీ కాదని, సాధారణ మరణాలేనని చెబుతున్నారు. ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ కారణంగానే మరణిస్తున్నారని తేల్చిచెబుతున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ వైద్యులు డెంగీ లేదని రిపోర్టు ఇస్తే, ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ ఉందని రిపోర్టులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంతుచిక్కని మరణాల గురించి జిల్లా యంత్రాంగం జుట్టు పీక్కుంటున్న సమయంలో శుక్రవారం తాజాగా బత్తలవల్లం దళితవాడకు చెందిన వై.రాధిక (29) విష జ్వరంతో మరణించింది. షాక్‌కు గురైన అధికారయంత్రాంగం మొత్తం శుక్రవారం వరదయ్యపాళెం మండలానికి చేరుకుంది. బత్తలవల్లంలో జాతీయ, కేంద్ర బృందం పర్యటన వరదయ్యపాళెం మండలంలోని నాలుగు గ్రామాల్లోనే జ్వరంతో 17 మంది మరణించారు. ఈ స్థాయి మరణాలు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ వరుస మరణాల సమాచారం ఢిల్లీకి చేరింది. స్పందించిన జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. అందులో భాగంగా శుక్రవారం ఏడుగురితో కూడిన బృందం వరదయ్యపాళేనికి చేరుకుంది. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరిషా, ఇన్చార్జి డీఎంహెచ్ఓ అరుణసులోచనతోపాటు వైద్యశాఖాధికారులు, పంచా యతీరాజ్ అధికారులు బత్తలవల్లం చేరుకున్నారు. వీరంతా గ్రామంలో సమావేశమై స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం మరణించిన కుటుంబాల వారి పరిస్థితి ఏమిటి?, ఎక్కడ పనిచేస్తారు? ఎన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు? ఎక్కడ వైద్యం చేయించుకున్నారు? తదితర వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ గ్రామ ప్రజల ఆహారపు అలవాట్లపై ఆరా తీశారు. అనంతరం జాతీయ, కేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ప్రతి నివాసానికి వెళ్లి పరిసరాలను పరిశీలించడంతోపాటు, వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి రక్త నమూనాలు సేకరించారు. భయం భయంగా గ్రామస్తులు ఎన్నడూ లేని విధంగా అంతుచిక్కన వ్యాధులు, వరుస మరణాలతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఢిల్లీ, పూణే నుంచి వైద్య బృందంతో పాటు కలెక్టర్, జేసీ, డీఎంహెచ్ఓ తదితరులు గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తుండడంతో ‘మన ఊరికేమైంది. ఏం జరుగుతోంది’ అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. సుమారు నెల రోజులుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు, ఏఎన్ఎంలు గ్రామాల్లో పర్యటిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే డీఎంహెచ్ఓతో పాటు ఇతర అధికారులు గ్రామంలో తిష్ట వేసి, జ్వరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జ్వరాలు, మరణాలు నియంత్రణ కాకపోవడంతో మూడు రోజుల క్రితం ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు గ్రామాల్లో పర్యటించి, రక్తనమూనాలు సేకరించారు. ఈ సంఘటనలతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మరి కొందరు ఇప్పటికే ఊరొదిలి బంధువుల నివాసాలకు వెళ్లిపోయారు. వరుస మరణాలకు విష జ్వరాలు, డెంగీ కారణం కాదని, మరేదో వైరస్ సోకిందనే అనుమానాలు వైద్య బృందం వ్యక్తం చేస్తోంది. ఆ వైరస్ ఏదనేది తెలుసుకునేందుకే ఢిల్లీ నుంచి వైద్య బృందం రంగంలోకి దిగిందని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
పూర్తిస్థాయి వైద్యసేవలే లక్ష్యం
హిందూపురం అర్బన్ : పేదలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందించమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వైద్య బృందం సభ్యులు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ (ఎన్ఆర్హెచ్ఎం) ప్రొఫెసర్ లేఖసుబ్బయ్య, సహాయకులు డాక్టర్ ప్రభుస్వామి అన్నారు. బుధవారం హిందూపురం ప్రభుత్వాస్పత్రిలో కేంద్ర వైద్య బృందం సభ్యులు పర్యటించారు. ముందుగా లేబర్ వార్డు, చిన్నపిల్లల, మెడికల్ వార్డులు, కొత్తగా ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని పరిశీలించారు. జనఽనీ సురక్షçయోజన, మెడాల్ ల్యాబ్, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ పనితీరు, చైల్డ్‌కేర్ వంటి పథకాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు, వాటి వినియోగం గురించి ఆరా తీశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర వైద్య పథకాల అమలు తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ధర్మవరం, హిందూపురం ఏరియా ఆస్పత్రులను సందర్శించామన్నారు. హిందూపురం ఆస్పత్రిలో వసతులు బాగున్నాయని, అయితే సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని గుర్తించామన్నారు. కార్యక్రమంలో డీపీఓ కిషోర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కేశవులు, మెడికల్ ఆఫీసర్ పోలప్ప, ఆర్ఓ శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన వైద్యబృందం లేపాక్షి : కేంద్ర వైద్య బృందం సభ్యులు హిందూపురం ఆస్పత్రి పరిశీలన అనంతరం బుధవారం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. శిల్పాలు, చిత్రాలు తిలకించి, ఆలయ విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.