సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో నవజాత శిశువులకు టీకాల అనంతరం పారాసిటమాల్ మాత్రలకు బదులు నొప్పి నివారణ ట్రామడాల్ మాత్రలు ఇచ్చిన ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. విధి నిర్వహణలో అంత నిర్లక్ష్యంగా ఎలా వ్యవహరించారంటూ రాష్ట్ర వైద్యాధికారులను నిలదీసింది. కేంద్ర ప్రభుత్వమే పెంటావాలెంట్ టీకాను సరఫరా చేస్తున్న నేపథ్యంలో పరిస్థితిని అధ్యయనం చేసేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖకు చెందిన ఇమ్యునైజేషన్ టెక్నికల్ సపోర్టు బృందం శుక్రవారం హైదరాబాద్ వచ్చింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న పసికందుల ఆరోగ్య పరిస్థితిని ఈ బృందంలోని డాక్టర్ దీపక్ పొలపాకర, ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ వికాస్ మదన్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కృష్ణకుమార్ సహా మరో ప్రతినిధి అడిగి తెలుసుకున్నారు. అలాగే శిశువుల తల్లిదండ్రులతో మాట్లాడారు. అలాగే సంఘటన జరిగిన నాంపల్లి ప్రాంతీయ ఆస్పత్రిని సందర్శించి పరిస్థితిని అధ్యయనం చేశారు. టీకాల నిల్వ, మందుల పంపిణీలో తీసుకుంటున్న జాగ్రత్తలు, పసికందులకు ఇస్తున్న మాత్రలను పరిశీలించారు.
కోలుకుంటున్న శిశువులు...
నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల అస్వస్థతకు గురై నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న 34 మంది నవజాత శిశువుల ఆరోగ్య పరిస్థితి శుక్రవారం మెరుగుపడింది. వెంటిలేటర్‌పై ఉన్న ముగ్గురు శిశువులు శుక్రవారం స్పృహలోకి రావడంతో వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. అయితే ట్రామడాల్ టాబ్లెట్ ప్రభావం మెదడుపై 48 గంటల వరకు ఉండే అవకాశం ఉండటంతో మరో 24 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలోనే చికిత్స అందించాలని నిర్ణయించారు. మిగిలిన చిన్నారులంతా కోలుకుంటున్నారు. వారిని శనివారం సాయంత్రానికి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది.
పీహెచ్‌సీల నుంచి ట్రామడాల్ వెనక్కి...
నవజాత శిశువులు అస్వస్థతకు గురైన ఘటనపై ఈ నెల 11లోగా సమగ్ర నివేదిక సమర్పిం చాలని ప్రజారోగ్య సంచాలకులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఆదేశించారు. ఘటనకు గల కారణాలు, పరిస్థితిపై అధ్యయనానికి ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ చైర్‌పర్సన్‌గా నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారంలోగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల నుంచి ట్రామడాల్ మాత్రలు, ఇంజెక్షన్లను వెనక్కు తెప్పించాలని, ఈ నెల 18లోగా అన్ని పీహెచ్‌సీలకు పారాసిటమాల్ సిరప్, చుక్కల మందును సరఫరా చేయాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీని ఆదేశించారు. ఇద్దరు శిశువుల మృతికి కారణమైన మెడికల్ ఆఫీసర్, ముగ్గురు ఏఎన్‌ఎంలు, ఒక ఫార్మసిస్ట్‌ను విధుల నుంచి తొలగించాలని, సూపర్‌వైజర్, ఎస్‌పీహెచ్‌వో, డీఐవోలపై కేసులు నమోదు చేయాలన్నారు. హెల్త్ సెంటర్ ఇన్‌చార్జి, ఏఎన్‌ఎంలు, పారామెడికల్ సిబ్బందిపై హబీబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment