బత్తలవల్లంలో పర్యటిస్తున్న కలెక్టర్
ఆ ఊళ్లలో మరణాలకు విషజ్వరాలు.. డెంగీ కారణం కాదు. మరేదో వైరస్ సోకింది. అదేదో అంతుచిక్కని వ్యాధి.. అదేమిటి.. ఎలా ప్రబలింది..? ఇదీ స్థానికులను తొలుస్తున్న ప్రశ్న. ఇది తెలుసుకోవడానికే వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులివల్లం గ్రామాల్లో కేంద్ర, జాతీయ వైద్య బృందం రంగంలోకి దిగింది.
సాక్షి, తిరుపతి: ఆ నాలుగు గ్రామాలను అంతుచిక్కని వ్యాధి భయపెడుతోంది. వరదయ్యపాళెం మండలంలోని ఆ పల్లెలకు ఏదో వైరస్ సోకిందనే అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ వైరస్ ఏది? అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఢిల్లీ నుంచి జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. బత్తలవల్లంలో శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వరదయ్యపాళెం మండలంలోని బత్తలవల్లం, కారిపాకం, రాచకండ్రిగ, పులి వల్లం గ్రామాల్లో కేవలం 20 రోజుల వ్యవధిలోనే 17 మంది మృత్యువాత పడ్డారు. వీరంతా కేవలం డెంగీ జ్వరం కారణంగానే మరణించినట్లు భావిస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం డెంగీ కాదని, సాధారణ మరణాలేనని చెబుతున్నారు. ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ కారణంగానే మరణిస్తున్నారని తేల్చిచెబుతున్నారు. అందుకు సంబంధించి ప్రభుత్వ వైద్యులు డెంగీ లేదని రిపోర్టు ఇస్తే, ప్రైవేటు వైద్యులు మాత్రం డెంగీ ఉందని రిపోర్టులు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అంతుచిక్కని మరణాల గురించి జిల్లా యంత్రాంగం జుట్టు పీక్కుంటున్న సమయంలో శుక్రవారం తాజాగా బత్తలవల్లం దళితవాడకు చెందిన వై.రాధిక (29) విష జ్వరంతో మరణించింది. షాక్‌కు గురైన అధికారయంత్రాంగం మొత్తం శుక్రవారం వరదయ్యపాళెం మండలానికి చేరుకుంది.
బత్తలవల్లంలో జాతీయ, కేంద్ర బృందం పర్యటన
వరదయ్యపాళెం మండలంలోని నాలుగు గ్రామాల్లోనే జ్వరంతో 17 మంది మరణించారు. ఈ స్థాయి మరణాలు రాష్ట్రంలో ఎక్కడా నమోదు కాకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ వరుస మరణాల సమాచారం ఢిల్లీకి చేరింది. స్పందించిన జాతీయ, కేంద్ర వైద్య బృందం రంగంలోకి దిగింది. అందులో భాగంగా శుక్రవారం ఏడుగురితో కూడిన బృందం వరదయ్యపాళేనికి చేరుకుంది. వీరితో పాటు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జేసీ గిరిషా, ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ అరుణసులోచనతోపాటు వైద్యశాఖాధికారులు, పంచా యతీరాజ్ అధికారులు బత్తలవల్లం చేరుకున్నారు. వీరంతా గ్రామంలో సమావేశమై స్థానికులతో మాట్లాడారు. ప్రస్తుతం మరణించిన కుటుంబాల వారి పరిస్థితి ఏమిటి?, ఎక్కడ పనిచేస్తారు? ఎన్ని రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు? ఎక్కడ వైద్యం చేయించుకున్నారు? తదితర వివరాల ను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆ గ్రామ ప్రజల ఆహారపు అలవాట్లపై ఆరా తీశారు. అనంతరం జాతీయ, కేంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ప్రతి నివాసానికి వెళ్లి పరిసరాలను పరిశీలించడంతోపాటు, వారి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొందరి రక్త నమూనాలు సేకరించారు.
భయం భయంగా గ్రామస్తులు
ఎన్నడూ లేని విధంగా అంతుచిక్కన వ్యాధులు, వరుస మరణాలతో ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఢిల్లీ, పూణే నుంచి వైద్య బృందంతో పాటు కలెక్టర్, జేసీ, డీఎంహెచ్‌ఓ తదితరులు గ్రామంలో ఇంటింటా సర్వే చేస్తుండడంతో ‘మన ఊరికేమైంది. ఏం జరుగుతోంది’ అంటూ స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. సుమారు నెల రోజులుగా ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యులు, ఏఎన్‌ఎంలు గ్రామాల్లో పర్యటిస్తూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. అలాగే డీఎంహెచ్‌ఓతో పాటు ఇతర అధికారులు గ్రామంలో తిష్ట వేసి, జ్వరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా జ్వరాలు, మరణాలు నియంత్రణ కాకపోవడంతో మూడు రోజుల క్రితం ఎస్వీ మెడికల్ కళాశాల వైద్యులు గ్రామాల్లో పర్యటించి, రక్తనమూనాలు సేకరించారు. ఈ సంఘటనలతో గ్రామస్తులు భయంతో వణికిపోతున్నారు. మరి కొందరు ఇప్పటికే ఊరొదిలి బంధువుల నివాసాలకు వెళ్లిపోయారు. వరుస మరణాలకు విష జ్వరాలు, డెంగీ కారణం కాదని, మరేదో వైరస్ సోకిందనే అనుమానాలు వైద్య బృందం వ్యక్తం చేస్తోంది. ఆ వైరస్ ఏదనేది తెలుసుకునేందుకే ఢిల్లీ నుంచి వైద్య బృందం రంగంలోకి దిగిందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment