కథకు కీ ఇస్తారు!
ఓ కీ ఇచ్చి కథను కీలక మలుపు తిప్పే కీలక పాత్రలు ఉంటాయి. అలాంటి ‘కీ’ రోల్స్ నిడివి తక్కువైనా గుర్తింపు ఎక్కువ ఉంటుంది కాబట్టి హీరో.. హీరోయిన్లు అప్పుడప్పుడూ ‘కీ’ రోల్స్ ఒప్పుకుంటుంటారు. ఇప్పుడు కథకు ‘కీ’ ఇచ్చే పాత్రలు చేస్తున్న కొందరు కథానాయికలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం.
సిస్టర్ ఆఫ్ శంకర్
కమర్షియల్ మూవీస్‌లో హీరోయిన్గా, ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో లీడ్ రోల్ చేయడం మాత్రమే కాదు... వీలైనప్పుడుల్లా అతిథిగా, కీలక పాత్రధారిగా కూడా నటిస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘సీమరాజా’, ‘మన్మథుడు 2’, ‘జాతిరత్నాలు’ వంటి సినిమాల్లో గెస్ట్ రోల్ చేశారు కీర్తి. ఇక మోహన్‌లాల్ ‘మరక్కార్: అరభికడలింటే సింహమ్’, రజనీకాంత్ ‘అన్నాత్తే’(తెలుగులో ‘పెద్దన్న’) చిత్రాల్లో కీర్తీ సురేష్ కథలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ‘భోళా శంకర్’ చిత్రంలో కీ రోల్ చేస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ మూవీలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా, చిరంజీవి చెల్లెలుగా కీర్తీ సురేష్ నటిస్తున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది.
తొలి అడుగు
ప్రత్యేక పాత్రల పరంగా తొలి అడుగు వేశారు హీరోయిన్ శ్రుతీహాసన్. నాని హీరోగా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం అవుతూ ‘హాయ్ నాన్న’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా, కథలో కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో హీరోయిన్ శ్రుతీహాసన్ నటిస్తున్నారు. ఆమె ప్రత్యేక పాత్రలో నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూనూర్‌లో జరుగుతోంది. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది.
డాటర్ ఆఫ్ భగవత్
అరడజనుకుపైగా సినిమాల్లో హీరోయిన్గా నటిస్తూ, టాలీవుడ్లో మోస్ట్ బిజీ హీరోయిన్గా ఉంటున్న శ్రీలీల ‘భగవత్ కేసరి’ (ప్రచారంలో ఉన్న టైటిల్)లో కీలక పాత్ర చేస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా, బాలకృష్ణ హీరోగా టైటిల్ రోల్ చేస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబరులో రిలీజ్ కానుంది. ఇక శ్రీలీల ఓ కథానాయికగా నటిస్తున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ఇందులో పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్.
కేరాఫ్ జైలర్
టాలీవుడ్లో ‘క్రేజీ ఫెలో’, ‘ఉగ్రం’ సినిమాల్లో నటించి హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మిర్నా మీనన్. ఈ బ్యూటీ ఇప్పుడు ‘జైలర్’ సినిమాలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుండగా, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ కుమార్తెగా మిర్నా మీనన్ కనిపిస్తారట. ఈ షూటింగ్లో మిర్నా దాదాపు 40 రోజులు పాల్గొన్నారు. కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10న విడుదల కానుంది.
వెల్కమ్ టు టాలీవుడ్
వజ్రకాళేశ్వరి దేవిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారు హీరోయిన్ అపర్ణా దాస్. మల యాళంలో ‘మనోహరం’, తమిళంలో ‘బీస్ట్’ వంటి చిత్రాల్లో నటించిన అపర్ణా దాస్‌కు తెలుగులో తొలి చిత్రం ‘ఆదికేశవ’. వైష్ణవ్‌తేజ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. ఇందులో కీలకమైన వజ్రకాళేశ్వరి దేవి పాత్రను అపర్ణా దాస్ పోషిస్తున్నారు. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వంలో నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం జూలైలో విడుదల కానుంది.
వీరే కాదు... కమల్‌హాసన్ ‘ఇండియన్ 2’లో రకుల్‌ప్రీత్ సింగ్, ప్రభాస్ ‘ఆదిపురుష్’లో సోనాల్ చౌహాన్, ‘ప్రాజెక్ట్ కె’లో దిశా పటానీ, రాఘవా లారెన్స్ ‘చంద్రముఖి 2’లో కంగనా రనౌత్.. ఇలా మరికొందరు హీరోయిన్లు ఆయా చిత్రాల కథలకు ‘కీ’గా నిలుస్తున్నారు.