ఆ పాత్రల్లో నటించడం వేస్ట్
హీరోయిన్లు సెంట్రిక్ ప్రాత్రల్లో నటించడం వేస్టే అంటోంది నటి టబూ. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి బహుభాషా నటిగా గుర్తింపు పొందిన నటి టబూ. ముఖ్యంగా కోలీవుడ్‌లో కండుకొండేన్ కండుకొండెన్, సిరైశాలె, స్నేహితియే వంటి వైవిధ్యభరిత కథా చిత్రాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామకు ఇటీవల జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం హిందీ చిత్రాలపైనే దృష్టి సారిస్తున్న టబూ ఒక భేటీలో పేర్కొంటూ తనకు వైవిధ్య భరిత కథా పాత్రల్లో నటించిన నాయకిగా అభిమానుల మధ్య మంచి పేరు ఉందని అంది. అయితే పాత్రల ఎంపికలో తాను ఎలాంటి పాలసీని అవలంభించలేదన్నారు. తనను ఆకట్టుకున్న పాత్రల్లో నటిస్తున్నానని చెప్పింది.
ముఖ్యంగా హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రల్లోనే నటించాలన్న భావన తనకు ఎప్పుడూ కలగలేదంది. అసలు అలాంటి కథా చిత్రాల్లో నటించమని తనను ఎవరూ అడగలేదని పేర్కొంది. ఇంకా చెప్పాలంటే హృదయాలను కట్టిపడేసే సన్నివేశాలు లేని అలాంటి పాత్రల్లో నటించడం వృథా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. వర్తమాన భామల నుంచి, ప్రముఖ కథానాయికల వరకూ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నారు కదా అన్న ప్రశ్నకు వారి గురించి చెప్పడానికి తానెవరినని, అది వారి వారి ఆకాంక్ష అని పేర్కొంది. ఈ అమ్మడు ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిందన్న చర్చ బాలీవుడ్‌లో బాగానే జరుగుతోంది. ఇకపోతే తన ఎదుగుదల తన తాహత్తుకు తగ్గట్టుగానే అమరిందని టబూ చెప్పుకొచ్చింది.