హీరోయిన్ టబు తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో వెంకటేష్ సరసన కూలి నెంబర్ వన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా, చెన్నకేశవరెడ్డి ,ఆవిడే మా ఆవిడ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు 50 ఏళ్లు దాటినా కూడా తనదైన గ్లామర్‌తో సినీ ప్రియులను అలరిస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన భూత్ బంగ్లా చిత్రంలో నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకోలేదు.
తాజాగా ఆమె తన పెళ్లి గురించి మాట్లాడారని కొన్ని వార్తలొచ్చాయి. మగాడు కేవలం బెడ్ మీదకే మాత్రమే పనికొస్తాడని టబు ఓ ఇంటర్వ్యూలో చెప్పారని సోషల్ మీడియాతో పాటు పలువురు వార్త కథనాలు రాసుకొచ్చారు. ఇలా బోల్డ్ కామెంట్స్ చేయడంపై కొందరు ఆమెను విమర్శిస్తుంటే.. మరికొందరు సమర్థించారంటూ ప్రచురించారు. ఈ నేపథ్యంలో టబుపై వస్తున్న వార్తలపై ఆమె టీమ్ ఘాటుగానే స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచురించినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.
ఖండించిన టబు టీమ్..
ఇటీవల ఆన్‌లైన్‌లో వచ్చిన అసభ్యకర కథనాలను టబు టీమ్ ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. కొద్ది రోజులుగా అనేక వార్తా వెబ్‌సైట్‌లు, సోషల్ మీడియా హ్యాండిల్‌లు వివాహంపై టబు తన అభిప్రాయాలను ప్రస్తావిస్తూ మాట్లాడారని ప్రచురించాయి. ఈ కథనాలన్నీ కేవలం కల్పితమని వాటిలో ఎలాంటి నిజం లేదని టబు టీమ్ స్పష్టం చేసింది. ఆమె ఎప్పుడు ఇలా మాట్లాడలేదని.. కేవలం అభిమానులను తప్పుదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా చేయడం నైతికి ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రకటనలో పేర్కొంది. ఆమె ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించిన వారంతా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది టబు టీమ్.
కాగా.. టబు ప్రస్తుతం అక్షయ్ కుమార్‌తో భూత్ బంగ్లా చిత్రం కోసం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో పరేష్ రావల్ కూడా నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ప్రియదర్శన్ - అక్షయ్ కుమార్ కాంబోలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. వీరిద్దరూ గతంలో 'హేరా ఫేరీ', భాగమ్ భాగ్, గరం మసాలా, దే దానా దాన్, భూల్ భూలయ్యా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. అంతేకాదు దాదాపు 25 సంవత్సరాల తర్వాత అక్షయ్, టబుల కాంబో రిపీట్ కానుంది. వీరిద్దరూ చివరిసారిగా 'హేరా ఫేరి'లో కలిసి నటించారు.
ఈ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మాణ సంస్థ బాలాజీ టెలిఫిలిమ్స్, అ క్షయ్ కుమార్ నిర్మాణ సంస్థ కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 2, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కాగా.. టబు చివరిసారిగా డూన్: ప్రొఫెసీ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment