బారులు తీరిన జనం
మొదలైన చేప ప్రసాద వితరణ
నేటి సాయంత్రం వరకూ కొనసాగింపు
అబిడ్స్, కలెక్టరేట్, న్యూస్‌లైన్ : చేపప్రసాదం కోసం వచ్చిన ఆస్తమా రోగులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కిటకిటలాడుతోంది. ఆదివారం మొదలైన చేపప్రసాద వితరణ సోమవారం సాయంత్రం వరకూ కొనసాగనుంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్‌మీనా ఆదివారం ఉదయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. డీఐజీ మల్లారెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్ రెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు.
మూడేళ్ల క్రితం రాజేంద్రనగర్ చేప ప్రసాదం పంపిణీ చేయగా విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ చేప ప్రసాద కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రెవెన్యూ, ఆర్అండ్బీ, జీహెచ్ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీస్ శాఖలను ఆదేశించింది. దీంతో ఉన్నత స్థాయి అధికారులు స్వయంగా చేప ప్రసాదం పంపిణీ ప్రశాంతంగా, జోరుగా జరిగే విధంగా చర్యలు తీసుకున్నారు.
చేప ప్రసాద వితరణకు హాజరైన ప్రజలకు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ శాఖలు మంచినీరు, ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. తప్పిపోయిన చిన్నారుల కోసం ప్రత్యేకంగా పబ్లిక్ అడ్రస్ సిస్టంను సమాచార శాఖ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ సంజీవయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి అశ్విని మార్గం, మాజీ కార్యదర్శి ఆర్. సుఖేష్ రెడ్డి, ఇతర నాయకులు అనిల్ స్వరూప్ మిశ్రా, హైదరాబాద్ ఆర్డీవో నిఖిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. సోమవారం కూడా చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతుందని బత్తిని సోదరులు తెలిపారు.
‘డిస్కవరీ’ ద్వారా తెలుసుకున్నా
ఆస్తమా వ్యాధి నయం చేయడానికి బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు డిస్కవరీ చానెల్ ద్వారా తెలుసుకుని వచ్చాను. ఇక్కడికి వచ్చి చేప ప్రసాదం తీసుకోవడం ఇదే మొదటిసారి. గత రెండు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతూ అల్లోపతి మందులను వాడుతున్నాను. ఒకవేళ ఈ చేప ప్రసాదంతో నా వ్యాధి తగ్గితే మరింత మందికి ప్రచారం చేస్తా.
- రీణ, డెహ్రాడూన్
మొదటిసారి వచ్చా
ఆస్తమా రోగులకు బత్తిని సోదరులు పంపిణీ చేసే చేప ప్రసాదం గురించి స్నేహితుల ద్వారా తెలుసుకుని మొదటిసారి ప్రసాద వితరణకు వచ్చాను. ఆస్తమా వ్యాధి నయమైతే మరింత మందికి వివరిస్తా. నిర్వాహకులు ఇంతమందికి పంపిణీ చేయడం చూసి ఆశ్చర్యపోయా. ఏర్పాట్లు బావున్నాయి.
- మార్క్, ఇంగ్లండ్
రెండేళ్లుగా వస్తున్నా
గత ఐదు సంవత్సరాలుగా ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాను. గత సంవత్సరం చేప ప్రసాదం తీసుకున్న తరువాత కొంత ఉపశమనం కలగడంతో ఈ ఏడాది సైతం చేప ప్రసాదాన్ని స్వీకరించాను. ఈ ప్రసాదం స్వీకరించడం వల్ల వ్యాధి బారి నుంచి కొంత ఉపశమనం కలిగింది.
- శోభకరగే, మహారాష్ట్ర