Certification Document
-
సిమ్ కావాలంటే ముఖం స్కాన్ చేయాల్సిందే
బీజింగ్: సాధారణంగా కొత్త సిమ్ కొనాలంటే సర్వీసు ప్రొవైడర్లను సంప్రదించి బయోమెట్రిక్ స్కాన్, తగిన రుసుం చెల్లిస్తే చాలు. కానీ చైనాలో అలా కాదు. ధ్రువీకరణ పత్రాలతో పాటుగా ముఖాన్ని స్కాన్ చేయించాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించి ముఖాన్ని చుట్టూ స్కాన్ చేయడంతో పాటు.. కళ్లు మూయడం, తెరవడం వంటివి కూడా పూర్తయ్యాకే సిమ్ దక్కుతుంది. ఈ మేరకు నిబంధనలను డిసెంబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి తెస్తూ చైనా ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ వాడే వారు తమ ఫోన్ల రిజిస్ట్రేషన్‌లో అసలు పేరునే వినియోగించాలంటూ గత సెప్టెంబర్‌లో నిబంధనలు తెచ్చింది. ఈ చర్యలన్నీ ఆన్లైన్ ప్రపంచంలో ప్రజల హక్కులను కాపాడటం కోసమేనని ప్రభుత్వం అంటోంది. -
కొత్త మొబైల్ కనెక్షన్లకు ఆధారే అవసరం లేదు..
న్యూఢిల్లీ: ఆధార్ కోసం పట్టుబట్టకుండా ఇతరత్రా ఏ గుర్తింపు ధృవీకరణ పత్రం ఆధారంగానైనా టెలికం ఆపరేటర్లు కొత్త మొబైల్ కనెక్షన్లు ఇవ్వొచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఇందుకోసం ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చని టెలికం శాఖ కార్యదర్శి అరుణ సుందరరాజన్ తెలిపారు. ఆధార్‌ను ఉపయోగించి ఆయా యూజర్లను రీ–వెరిఫికేషన్ చేసే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చేదాకా కేంద్రం వేచి చూడనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, సిమ్‌తో ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న విధానం ఇంకా అమల్లోనే ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఆధార్ లేకుండా కొత్త సిమ్‌లు జారీచేసినప్పటికీ, తర్వాత దశలోనైనా వాటిని రీ–వెరిఫై చేయాల్సి ఉండొచ్చని పేర్కొన్నాయి. ఒకవేళ కనెక్షన్ తీసుకునేటప్పుడే సబ్స్క్రయిబర్.. ఆధార్ వివరాలు ఇచ్చిన పక్షంలో మళ్లీ రీ–వెరిఫికేషన్ అవసరం ఉండబోదని వివరించాయి. -
ఇది వైకల్యం కాదట
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఈ వ్యక్తి శారీరక వైకల్యం అందరికీ కనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికీ అయ్యో అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యునికి మాత్రం వైకల్యం కనిపించలేదు. ఫలితంగా ఆ నిర్భాగ్యుడు ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాడు. చేసేదిలేక చివరకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏలూరు మస్తానమన్యం కాలనీకి చెందిన బర్లా గొల్ల అనే వ్యక్తి చిన్నప్పుడు ప్రమాదంలో తన ఎడమచేతిని కోల్పోయాడు. అప్పటి నుంచి వికలాంగునిగానే ఉండిపోయాడు. వికలాంగులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందాలంటే ప్రభుత్వ వైద్యులు గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంది. ఇది జారీ చేసేందుకు ఎన్నిసార్లు వైద్యుల వద్దకు తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇటీవల సదరం ధ్రువీకరణ పత్రానికి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. గొల్లను పరీక్షించిన వైద్యులు ప్రమాదానికి గురైన చేతిని కదిలించమని చెప్పడంతో ఆ మొండి చేతినే కదిలించాడు. చేయి కదులుతుంది కాబట్టి వికలాంగునిగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వీలుపడదని సదరు వైద్యుడు తిప్పి పంపించేశారు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని మీ కోసంలో కలెక్టర్ భాస్కర్‌కు విషయాన్ని వివరించాడు. కలెక్టర్ స్పందించి వైద్యారోగ్యశాభాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్‌తో మాట్లాడి తక్షణమే సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశించారు. -
డాక్యుమెంట్లతో పాటు స్వీయ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులకు స్థానికత కావాలంటే స్వీయ ప్రకటనతో పాటు తెలంగాణలో నివాసం ఉన్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలను ఆన్లైన్లో గానీ మీసేవలోగానీ సమర్పిస్తే సబంధిత తహసీల్దారు వారం రోజుల్లోగా స్థానికత పత్రం జారీ చేస్తారు. వారంలోగా తహసీల్దారు జారీ చేయకపోతే స్వయంచాలకం (ఆటోమేటిక్)గా ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలాగ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి స్థానికతపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోగా తెలంగాణలోని ఏ ప్రాంతంనుంచైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికతను వర్తింప చేస్తారు. ఆ తరువాత వెళ్లే వారికి స్థానికత వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు, విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని, వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు కాదని పేర్కొన్నారు. మైనర్లకు స్థానికత కావాలంటే తల్లిదండ్రులు, సంరక్షకులు ధరఖాస్తు చేసుకోవచ్చును. స్వీయ ప్రకటనలోని సమాచారం తప్పు అని తేలితే.. స్థానికత పత్రం ద్వారా పొందిన ఉద్యోగం లేదా అడ్మిషన్ రద్దు చేస్తారు. అంతేగాక ప్రాసిక్యూషన్ చర్యలు చేపడతారు. డెరైక్టు రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడ నివాసం ఉంటున్నారనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలి గానీ వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నివాసాన్ని కాదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ పొందాలంటే.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్యోగార్థులు, విద్యార్థులు ఏపీలో స్థానికత పొందాలంటే.. తెలంగాణలో నివాసం ఉన్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఒకటి జత చేయాలి.