పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో) : ఈ వ్యక్తి శారీరక వైకల్యం అందరికీ కనిపిస్తుంది. చూసిన ప్రతి ఒక్కరికీ అయ్యో అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యునికి మాత్రం వైకల్యం కనిపించలేదు. ఫలితంగా ఆ నిర్భాగ్యుడు ప్రభుత్వం నుంచి పొందాల్సిన ప్రయోజనాలను అందుకోలేకపోతున్నాడు. చేసేదిలేక చివరకు జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని కలెక్టర్‌కు తన గోడు వెళ్లబోసుకున్నాడు. ఏలూరు మస్తానమన్యం కాలనీకి చెందిన బర్లా గొల్ల అనే వ్యక్తి చిన్నప్పుడు ప్రమాదంలో తన ఎడమచేతిని కోల్పోయాడు.
అప్పటి నుంచి వికలాంగునిగానే ఉండిపోయాడు. వికలాంగులకు ప్రభుత్వం కల్పించే ప్రయోజనాలు పొందాలంటే ప్రభుత్వ వైద్యులు గుర్తించి సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాల్సి ఉంది. ఇది జారీ చేసేందుకు ఎన్నిసార్లు వైద్యుల వద్దకు తిరిగినా పట్టించుకోవడం లేదు. ఇటీవల సదరం ధ్రువీకరణ పత్రానికి జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి వెళ్లి దరఖాస్తు చేసుకున్నాడు. గొల్లను పరీక్షించిన వైద్యులు ప్రమాదానికి గురైన చేతిని కదిలించమని చెప్పడంతో ఆ మొండి చేతినే కదిలించాడు. చేయి కదులుతుంది కాబట్టి వికలాంగునిగా ధ్రువీకరణ పత్రం ఇవ్వడం వీలుపడదని సదరు వైద్యుడు తిప్పి పంపించేశారు. దీంతో సోమవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకుని మీ కోసంలో కలెక్టర్ భాస్కర్‌కు విషయాన్ని వివరించాడు. కలెక్టర్ స్పందించి వైద్యారోగ్యశాభాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ ఏవీఆర్ మోహన్‌తో మాట్లాడి తక్షణమే సదరం ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment