చాహత్ మళ్లీ రూటు మార్చింది!
టీవీక్షణం
కొంతమంది ఏదో ఒకటి చేయాలనుకుంటారు. కొంతమంది మాత్రం ఇంకేం కొత్తగా చేద్దామా అని ఎప్పుడూ తపన పడుతూనే ఉంటారు. చాహత్ఖన్నా ఈ రెండో రకం. ఏదో ఒకటి చేసి ఊరుకోవడం ఆమెకలవాటు లేదు. మాటిమాటికీ రూటు మారుస్తుంది. రకరకాల రూపాలు ప్రదర్శిస్తూ ఉంటుంది. రచయిత్రిగా, టీవీ-సినీ నటిగా, మోడల్‌గా రకరకాల పాత్రల్ని ఇప్పటి వరకూ పోషించిన ఆమె ఈసారి గరిటె పట్టింది.
‘ఖానా ఖజానా’ చానెల్లో ‘లిక్విడ్ లాంజ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది చాహత్. ‘బడే అచ్చే లగ్తే హై’ సీరియల్ తర్వాత ఆమెకు మళ్లీ అంత పేరు తెచ్చిపెట్టిందీ ప్రోగ్రామ్. చాహత్కి వంట చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా డ్రింక్స్ తయారు చేయడంలో నిపుణురాలు. తన టాలెంట్‌ను చూపించడానికి ‘ఖానా ఖజానా’ను ఎంచుకుంది. రకరకాల మిల్క్ షేక్స్, కాక్ టెయిల్స్, స్మూతీస్, హెల్త్ డ్రింక్స్, రకరకాల టీలు, కాఫీలు చేయడం నేర్పిస్తుంది చాహత్. నటిగా ఆకట్టుకున్న ఆమె, యాంకర్‌గానూ మెప్పిస్తోంది!
నాటి గంగేనా ఈ ప్రగ్య?!
ఎక్కువగా మాట్లాడని ఓ అమ్మాయి. నచ్చని విషయాన్ని నచ్చలేదని కూడా చెప్పలేనంత నెమ్మదస్తురాలు. ఎదుటివాళ్లు తనని బాధ పెడుతున్నా ఏమీ అనలేనంత సౌమ్యురాలు. ఆమె ఏడిస్తే ప్రేక్షకులకు కన్నీళ్లు వచ్చేవి. ఆమెకి కష్టమొస్తే అది తీరేవరకూ సీరియల్ చూసేవాళ్లకి నిద్ర పట్టేది కాదు. ఇదీ... ‘బాలికావధు’ సీరియల్లో గంగ పాత్ర తీరు!
ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి. మగపిల్లలతో సమానంగా పనులు చక్కబెట్టేస్తుంది. ఎక్కడికైనా దూసుకెళ్లిపోతుంది. ఎలాంటి పనయినా ధైర్యంగా చేసేస్తుంది. గలగలా మాట్లాడుతుంది. చకచకా సాగిపోతుంది. ఆమెను చూసిన వాళ్లకి ఉత్సాహం వచ్చేస్తుంది. ఆమె వ్యక్తిత్వం చూసి అందరికీ స్ఫూర్తి కలుగుతుంది.
ఇది ‘కుంకుమ్ భాగ్య’ సీరియల్లోని ప్రగ్య పాత్ర తీరు!
ఏమాత్రం పొంతన లేని ఈ రెండు పాత్రలనూ పోషించింది ఒకే అమ్మాయి... శృతి ఝా. మొన్నమొన్నటి వరకూ గంగ పాత్రలో ఆమాయకత్వాన్ని ఒలకబోసిన ఆమె... ఇటీవలే జీ టీవీలో ప్రారంభమైన ‘కుంకుమ్ భాగ్య’లో చురుకైన అమ్మాయి ప్రగ్యగా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తోంది. నాటి గంగేనా నేటి ఈ ప్రగ్య అంటూ ప్రేక్షకులు ముగ్ధులైపోతున్నారు. ఏ పాత్ర అయినా చేయగలదీమె అంటూ కితాబులిస్తున్నారు!
మాయాద్వీపంలో పిల్లల సందడి!
రియాలిటీ షో అనగానే ఆటపాటలు, అల్లరి చేష్టలు, పాటలు, డ్యాన్సులు గుర్తొచ్చి హుషారొచ్చేస్తుంది. అందులోనూ చిన్న పిల్లలు పాల్గొనే షోలంటే వాళ్ల ముద్దు మాటలు, తుంటరి వేషాలు చూసేందుకు ఉత్సాహం కలుగుతుంది. అందుకే అనుకుంటా... ఓంకార్ ఎప్పుడూ పిల్లలతో షో చేయడానికి ఇష్టపడుతుంటాడు. ఇంతకుముందు డ్యాన్స్ షోతో సందడి చేసేవాడు. ఆ తరువాత ‘మాయాద్వీపం’ (జీ తెలుగు) సృష్టించాడు.
అప్పుడప్పుడూ పెద్దలు కూడా పాల్గొంటున్నా, పిల్లలే ప్రధానంగా సాగే షో ఇది. మాయాద్వీపంలా కనిపించే సెట్టింగులో పిల్లలతో విచిత్రమైన ఆటలు ఆడిస్తుంటాడు ఓంకార్. మధ్యలో వింత వింత మనుషులు వస్తుంటారు. వాళ్లతో పిల్లలు ఫైట్ చేస్తుంటారు. డ్యాన్సులు చేస్తారు. తెలివి తేటలకు పరీక్ష పెట్టే రౌండ్స్ కూడా ఉంటాయి. మొత్తంగా షో మాంచి వినోదాత్మకంగా ఉంటుంది. అదృష్టంకొద్దీ ఓంకార్ షోలలో ఉండే ఎమోషనల్ సన్నివేశాలు, కన్నీళ్లు పొంగి పారడాలు ఇందులో లేవు కాబట్టి ఆద్యంతం సరదాగానే సాగిపోతుంది!