Chagall
-
విద్యార్థులకు నేటి నుంచి రేడియో పాఠాలు
చాగల్లు : ప్రభుత్వ పాఠశాలల్లో మీనా ప్రపంచం, విందాం, నేర్చుకుందాం అనే రేడియో ప్రసార కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఆకాశవాణి ద్వారా విద్యార్థుల కోసం రాజీవ్ విద్యామిషన్ రేడియో పాఠాల కార్యక్రమాన్ని గతేడాది ప్రారంభించింది. దీనికోసం పాఠశాలలకు అప్పట్లో రేడియోలను పంపిణీ చేశారు. ఈ పాఠాల్లో కథల రూపంలో బాలల హక్కులు, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. మంచి అలవాట్లు, చక్కని కథలు, బుజ్జి ప్రశ్నలు, పాఠ్యాంశాలతో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచడమే రేడియో పాఠాల ప్రధాన లక్ష్యం. ఈ నెల 18 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు రేడియో కార్యక్రమాల ప్రసారాలు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతానికి 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సంబంధించి విందాం, నేర్చుకుందా కార్యక్రమాల షెడ్యూల్‌ను ఇచ్చారు. మిగిలిన 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు సంబంధించి షెడ్యూల్, మీనా ప్రపంచం కార్యక్రమాల షెడ్యూల్‌ను పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది. విద్యార్థులకు ప్రయోజనం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సోమ, మంగళ, బుధ, గురువారాల్లో ఉదయం 11.15 గంటల నుంచి 11.45 వరకు రేడియో కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమాలు విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధికి తోడ్పడతాయి. బట్టీ విధానానికి స్వస్తిపలికి అన్వేషణలు, విశ్లేషణలు, ఆలోచించే విధానం అలవడుతుంది. తరగతి గదిలో బోధించని పలు అంశాలను ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు. మూలకు చేరిన రేడియోలు రాజీవ్ విద్యామిషన్ ద్వారా గతేడాది చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రసార సేవలు సరిగా అందకపోవడంతోపాటు అనేక పాఠశాలల్లో రేడియోలు పాడై మూలకు చేరాయి. వీటిపై పాఠశాల హెచ్ఎంలు దృష్టి సారించడం లేదు. కొన్నిచోట్ల రేడియోలు పనిచేస్తున్నా ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదు. రేడియోల ద్వారా పాఠాలు విద్యార్థులకు చేరేలా విద్యాశాఖ, ఆర్వీఎం అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మద్యం డిపో మూసివేత
చాగల్లు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో చాగల్లు శివారులోని ఏపీబీసీఎల్ మద్యం డిపోను మంగళవారం అర్ధరాత్రి నుంచి మూసివేసినట్టు డిపో మేనేజర్ వి.రామారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిపోను మూసివేసినట్టు చెప్పారు. ఈనెల 24వ తేదీలోగా డీడీలు తీసిన మద్యం లెసైన్స్దారులందరికీ మంగళవారం వరకు మద్యం సరఫరా చేసినట్టు తెలిపారు. ఈనెలలో రూ.48 కోట్లు లావాదేవీలు జరిగినట్టు చెప్పారు. మరలా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి డిపోను తెరుస్తామన్నారు. ఆఖరి రోజు అధిక సంఖ్యలో లెసైన్సుదారులు మద్యం కోసం క్యూ కట్టారు. -
కౌంటింగ్ కేంద్రాల్లో అగచాట్లు
చాగల్లు/కొవ్వూరు రూరల్, న్యూస్‌లైన్ : జిల్లాలో మంగళవారం నిర్వహించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ విధులకు హాజరైన సిబ్బందికి అగచాట్లు తప్పలేదు. అభ్యర్థులు, ఏజెంట్లు సైతం అవస్థలు పడ్డారు. కౌంటింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేకపోవడంతో సమస్యలు తలెత్తాయి. కొవ్వూరు డివిజన్ పరిధిలోని 9 మండలాల పరిషత్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ తణుకులోని ఆకుల శ్రీరాములు ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్లిన అధికారులు, సిబ్బంది, అభ్యర్థులు, ఏజెంట్లు పడరానిపాట్లు పడ్డారు. కౌంటింగ్ కేంద్రం ప్రాంగణంలోకి వాటర్ బాటిల్స్‌ను కూడా అనుమంతించలేదు. కేంద్రాల వద్ద తాగునీటి సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో మంచినీళ్ల కోసం కటకటలాడారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మంచినీళ్ల కోసం అక్కడి వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యూరు. పరిసర మండలాల నుంచి ఉదయం 6గంటలకే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి రావడంతో సిబ్బందితోపాటు ఏజెంట్లు, అభ్యర్థులు ముందురోజే తణుకు చేరుకుని లాడ్జిలు, హోటళ్లలో బసచేశారు. ఆహారం కౌంటింగ్ సిబ్బందికి సకాలంలో అందకపోవడంతో ఇబ్బందు లు పడ్డారు. దీంతో పలుచోట్ల మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సుమారు గంటకు పైగా కౌంటింగ్ నిలిచిపోయింది. రాత్రి 8గంటల సమయంలో కౌంటింగ్ కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కౌంటింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్ సౌకర్యం ఉన్నా సకాలంలో స్టార్ట్ చేయకపోవడంతో కొవ్వొత్తుల వెలుగులో విధులు నిర్వర్తించాల్సి వచ్చింది.