chairman election
-
కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్..
Updates ►కొండపల్లిలో చైర్మన్, ఇద్దరి వైస్ చైర్మన్ల ఎన్నిక పూర్తయ్యింది. సీల్డ్ కవర్లో ఎన్నిక వివరాలను ప్రిసైడింగ్ అధికారి హైకోర్టుకి నివేదించనున్నారు. ఎన్నికలపై హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ ఎంపీ కేశినేని ఓటుపై వైఎస్సార్సీపీ అభ్యంతరం తెలిపింది. అన్నీ పరిశీలించి ఫలితాన్ని ప్రకటిస్తామని హైకోర్టు పేర్కొంది. ►కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రారంభమైంది. కొండపల్లిలో దేవినేని ఉమా ఓవరాక్షన్ చేశారు. ఓటు హక్కులేకపోయినా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులతో దేవినేని ఉమా వాగ్వాదానికి దిగారు. సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను బుధవారం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అసిస్టెంట్ ఎన్నికల అధికారికి అనుమతినివ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను ఆదేశించింది. అయితే ఎన్నిక ఫలితాన్ని మాత్రం వెల్లడించవద్దని న్యాయస్థానం నిర్దేశించింది. ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో విజయవాడ ఎంపీ వినియోగించుకునే ఓటు ఈ వ్యవహారంలో కోర్టు వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని పేర్కొంది. ఎన్నిక ప్రక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేసి పూర్తి వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. టీడీపీ వార్డు సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీసు కమిషనర్ (ఇన్చార్జ్) జి.పాలరాజుకు సూచించింది. దీనిపై తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నిక నిర్వహణకు ఆదేశాలు ఇవ్వండి... కొండపల్లి మునిసిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి తదుపరి ఎలాంటి వాయిదాలకు ఆస్కారం లేకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టీడీపీ వార్డు సభ్యులు, ఎంపీ కేశినేని నాని, స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన కె.శ్రీలక్ష్మి అత్యవసరంగా లంచ్‌మోషన్ రూపంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ ‘కోరం’ ఉన్నప్పటికీ దురుద్దేశపూర్వకంగా ఎన్నికను వాయిదా వేస్తున్నారని నివేదించారు. సభ్యులందరికీ ముందస్తు నోటీసు తప్పనిసరి విచారణ సందర్భంగా కోర్టు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించరా? అంటూ అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుంటే పోలీసుల సాయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు విజయవాడ ఇన్చార్జ్ పోలీస్ కమిషనర్ పాలరాజు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి శివనారాయణరెడ్డి మధ్యాహ్నం స్వయంగా కోర్టు ఎదుట హాజరయ్యారు. ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేనందున వాయిదా వేసినట్లు శివనారాయణరెడ్డి తెలిపారు. సమస్యను స్థానిక పోలీసుల దృష్టికి తెచ్చామన్నారు. ‘ఇలా ఎంత కాలం? రేపు కూడా అడ్డుకుంటే మళ్లీ వాయిదా వేస్తారా? అడ్డుకున్న వారిపై ఏ చర్యలు తీసుకున్నారు?’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎంపీ కేశినేని నానికి అనుమతినిస్తూ తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ఉండేందుకే ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా ఉందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ‘పోలీసుల సాయంతో ఈరోజు (మంగళవారం) సాయంత్రం 4.30 గంటలకు ఎన్నిక నిర్వహించండి. అడ్డొచ్చిన వారిని అరెస్ట్ చేయండి. బుధవారం ఉదయం కల్లా పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి’ అని తొలుత న్యాయమూర్తి మౌఖికంగా స్పష్టం చేశారు. ఈ సమయంలో అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ సభ్యులందరికీ ముందస్తు నోటీసు ఇవ్వడం తప్పనిసరని, ఇందుకు కొంత సమయం పడుతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో బుధవారం ఎన్నిక నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఎంపీ కేశినేని నాని వినియోగించుకునే ఓటు హక్కు ఈ వ్యాజ్యాల్లో కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉత్తర్వుల్లో ప్రస్తావించాలని సుధాకర్‌రెడ్డి పట్టుబట్టడంతో అందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ ఆ విషయాన్ని ఆదేశాల్లో ప్రస్తావించారు. ఎస్ఈసీ నోటిఫికేషన్ జారీ హైకోర్టు ఆదేశాల మేరకు బుధవారం కొండపల్లి మునిసిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
AP: జెడ్పీ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ
అనంతపురం: నూతనంగా ఎన్నికైన 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తి అయింది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి శంకర్ నారాయణ, ప్రభుత్వ విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనంతవెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, డాక్టర్ సిద్ధారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఏపీ ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ నదీం అహ్మద్, ఏపీ నాటక అకాడమీ ఛైర్ పర్సన్ హరిత పాల్గొన్నారు. ► విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా పరిషత్ వద్ద వైఎస్సార్సీపీ అభ్యర్థుల కోలాహలం నెలకొంది. మొత్తం 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ఈ సందర్భంగా పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. ఇదంతా సీఎం జగన్మోహన్రెడ్డి సంక్షేమ ఫలాలు అందించిన విజయంగా పేర్కొన్నారు. ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ముఖ్యంగా ఈ సారి జడ్పీ చైర్ పర్సన్ పదవి గిరిజన ప్రాంతానికి దక్కడంతో సంతోషంగా ఉందన్నారు. ► వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా ఇద్దరు మైనారిటీలకు అవకాశం. ► కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నిక. ప్రకటించిన జిల్లా కలెక్టర్ విజయరామ రాజు. జిల్లాల వారీగా జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్నది వీరే.. ► అనంతపురం జిల్లా: బోయ గిరిజమ్మ (బీసీ) ► చిత్తూరు జిల్లా: శ్రీనివాసులు ( బీసీ) ► తూర్పు గోదావరి జిల్లా: వేణుగోపాల్ రావు (ఎస్సీ) ► పశ్చిమ గోదావరి జిల్లా: కవురు శ్రీనివాస్ (బీసీ) ► గుంటూరు జిల్లా: హెనీ క్రిస్టినా( ఎస్సీ) ► కర్నూలు జిల్లా: వెంకట సుబ్బారెడ్డి( ఓసీ) ► కృష్ణా జిల్లా: ఉప్పాళ్ల హారిక( బీసీ) ► నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ) ► ప్రకాశం జిల్లా: వెంకాయమ్మ (ఓసీ) ► వైఎస్సార్ కడప జిల్లా: ఆకేపాటి అమర్నాథ్రెడ్డి (ఓసీ) ► విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ) ► విజయనగరం జిల్లా: మజ్జి శ్రీనివాసరావు (బీసీ) ► శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ) మధ్యాహ్నం 3 గంటకు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. జడ్పీ ఎన్నికలకు ప్రిసైడింగ్ అధికారిగా కలెక్టర్ వ్యవహరిస్తారు. కలెక్టర్లు జడ్పీ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌తో ప్రమాణం చేయుంచనున్నారు. ► కడప నగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి జడ్పీ కార్యాలయం వరకు వైఎస్సార్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఎన్నిక కానున్న ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. అంతకుముందు మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ర్యాలీలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి సీఎం అంజాద్ బాష, చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, విప్ కొరముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, మేడా మల్లికార్జున్‌రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పాల్గొన్నారు. ► కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జెడ్పీ చైర్మన్ల ఎన్నిక శనివారం మధ్యాహ్నం జరగనుంది. అందులో భాగంగా ముందుగా కోఆప్షన్ సభ్యుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు జడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు( వి.కోట జడ్పిటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్నాథ్రెడ్డి ఎన్నిక కానున్నారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. బీసీ మహిళ జడ్పీ పీఠాన్ని అధిష్టించనున్నారు. 13 జిల్లాల్లో చైర పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరగనుంది.13 జిల్లా పరిషత్‌లు వైఎస్సార్సీపీ ఖాతాలోనే పడనున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికిపైగా పదవులు దక్కనున్నాయి. నూరుశాతం జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడం దేశంలోనే ఇదే ప్రథమం. -
ఏకాభిప్రాయం కుదర్లేదు!
దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. చైర్మన్ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియను ఖరారు చేసే ఏకైక ఎజెండాతో సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. దాంతో చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణం. 17 మంది సభ్యులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వెల్లడించారు. చైర్మన్ పదవి కోసం తాను బరిలో ఉన్నానా లేదా అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఈ పదవిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొలిన్ గ్రేవ్స్ (ఇంగ్లండ్), డేవ్ కామెరాన్ (వెస్టిండీస్)లకు కొందరినుంచి మద్దతు లభిస్తున్నా... వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య కూడా అలాగే ఉంది. చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తే సభ్య దేశాల మధ్య అనవసరపు భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని... అలా జరగకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోందనేది సమాచారం. -
తేలని సారథి
కొలిక్కిరాని జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక * కోరానికి సరిపడా హాజరుకాని జెడ్పీటీసీ సభ్యులు * గంటపాటు వేచిచూసిన కలెక్టర్ శ్రీధర్ * అనంతరం సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటన సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికపై సస్పెన్స్ కొనసాగుతోంది. సారథి ఎన్నికపై శనివారం నిర్వహించిన సమావేశం కోరం లేకపోవడం తో వాయిదా పడింది. సమావేశం నిర్వహణ కు సరిపడా 17 మంది హాజరుకాకపోవడంతో ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ ప్రకటించారు. కో ఆప్షన్ సభ్యుల నామినేషన్ల ప్రక్రియ అనంతరం మధ్యాహ్నం ఒంటిగంట కు సమావేశం ప్రారంభమైనా జెడ్పీటీసీ సభ్యులెవరూ రాలేదు. టీఆర్ఎస్ సభ్యులు జిల్లా పరిషత్ భవనంలోనే ఉన్నప్పటికీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు సమావేశానికి హాజరు కావడంలేదనే సమాచారంతో గదులకే పరిమితమయ్యారు. నిర్దేశిత కోరం కోసం గంటపాటు వేచిచూసిన కలెక్టర్... రెండు గంటలకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 13న మళ్లీ ఎన్నికలు.. కోరంలేక వాయిదా పడిన ఎన్నికలు ఈ నెల 13న జరుగుతాయని రాష్ర్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నం దున.. ఎంపీలు సమావేశానికి అందుబాటు లో ఉండరనే ఉద్దేశంతో సెలవు రోజయినప్పటికీ వచ్చే ఆదివారం ఎన్నికలు చేపడుతున్న ట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైభవంగా జరిగే బోనాల పండుగ రోజున జిల్లా పరిషత్ ఎన్నికల తేదీని ఖరారు చేయడాన్ని పార్టీలు తప్పుబడుతున్నాయి. శనివారం కో ఆప్షన్ సభ్యుల పదవులకు దాఖలు చేసిన నామినేషన్లు చెల్లవని, తిరిగి ఎన్నిక రోజున కొత్తగా నామినేషన్లు దాఖలు చేయాలని ఎన్నికల సీఈఓ స్పష్టం చేశారు. పంచుకుందాం రండి! జిల్లా రాజకీయాల్లో శనివారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు టీడీపీ, కాంగ్రెస్‌లు జతకట్టాయి. పరస్పర అవగాహనతో పదవీకాలాన్ని పంచుకోవాలని ఇరుపార్టీలు నిర్ణయించినప్పటికీ, ఎవరూ ముందు పగ్గాలు చేపట్టాలనే అంశంపై పేచీ తెగలేదు. ఒక దశలో లాటరీ పద్ధతిలో ఈ వివాదానికి ముగింపు పలుకుదామని కాంగ్రెస్ భావించినప్పటికీ, టీడీపీ ససేమిరా అనడంతో వెనక్కి తగ్గింది. వరంగల్, మహబూబ్‌నగర్‌లలో మద్దతు ఇస్తున్నందున రంగారెడ్డి జిల్లా పరిషత్‌ను తమకు వదిలేయాలని టీడీపీ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి షరతుకు అంగీకరించిన కాంగ్రెస్ అధిష్టానం... తొలుత తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ అంశం తేలకపోవడంతో సీఎల్పీ నేత జానారెడ్డితో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుందామని ఇరుపార్టీలూ భావించాయి. నల్గొండ జెడ్పీ ఎన్నికల్లో ఉన్న ఆయన నగరానికి చేరుకునేసరికి ఆలస్యమవుతుందని భావించిన రెండు పార్టీలు జిల్లా పరిషత్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించారు. తద్వారా కోరంలేక సమావేశం మరుసటి రోజుకు వాయిదా పడుతుందని అంచనా వేశారు. దీంతో ఇరుపార్టీలూ తాత్కాలికంగా చర్చలకు విరామం ప్రకటించాయి. జంగారెడ్డికి గ్రీన్‌సిగ్నల్! టీడీపీతో సర్దుబాటు ఖరారుకావడంతో కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా ఎనుగు జంగారెడ్డి పేరును ప్రకటించింది. మరో ఇద్దరు జెడ్పీటీసీలు రేసులో నిలిచినప్పటికీ, పార్టీ నేతలు సబిత, ప్రసాద్, కేఎల్లార్ఙ జోక్యంతో వెనక్కి తగ్గారు.ఈ నేపథ్యంలో జంగారెడ్డి అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ఖరారు చే స్తూ విప్ కూడా జారీ చేశారు.అయితే, టీడీపీతో పదవీకాలం పై స్పష్టత రాకపోవడంతో దీన్ని అధికారులకు ఇవ్వలేదు. వేచి చూసి.. వెనుదిరిగి జిల్లా పరిషత్ పీఠం దక్కించుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్న టీఆర్ఎస్... ప్రత్యర్థుల కదలికలను పసిగట్టే ప్రయత్నంలో మునిగిపోయింది. క్యాంపు నుంచి నేరుగాా జెడ్పీకి చేరుకున్న టీఆర్ఎస్ సభ్యులతో జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి ప్రత్యేకంగా పలు దఫాలుగా భేటీ అయ్యారు. ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి సునీత ఒంటిగంట సమయంలో జిల్లా పరిషత్‌కు వచ్చారు. మేజిక్ ఫిగర్‌ను చేరేందుకు ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన మహేందర్‌రెడ్డి ఎప్పటికప్పుడు ప్రత్యర్థుల వ్యూహాలను తెలుసుకోవడంలో బిజీగా గడిపారు. ఇప్పటికే తమతో బేరాలు కుదుర్చుకున్న టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు తాజా పరిణామాల నేపథ్యంలో ఎటువైపు మొగ్గు చూపుతారోననే అంశంపై సన్నిహితులతో చర్చించారు. ఊహించని విధంగా ప్రత్యర్థులు మిలాఖత్ కావడం... ఆ పార్టీలు కూడా భారీ ప్యాకేజీలకు తెరలేపడం మహేందర్‌కు ఇబ్బంది కలిగిస్తోంది. ఎన్నిక వాయిదా పడడంతో మరో వారం క్యాంపులు నిర్వహించాల్సి రావడం కూడా ఆయనకు చికాకు తెప్పిస్తోంది. యాదవరెడ్డి చెట్టాపట్టాల్! కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నవాబుపేట జెడ్పీటీసీ సభ్యుడు యాదవరెడ్డి టీఆర్ఎస్ పంచన చేరిపోయారు. మంత్రి మహేందర్ రెడ్డి వెన్నంటి తిరిగిన ఆయన టీఆర్ఎస్ నేతలతో చెట్టాపట్టాలేసుకోని తిరిగారు. దీంతో ఆయన టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిగా జెడ్పీ బరిలో దిగిన ఆయన... చివరి నిమిషంలో గులాబీ శిబిరానికి చేరువయ్యారు. ఇప్పుడు బహిరంగంగా ఆ పార్టీ నేతలతో దోస్తీకట్టారు. యాదవరెడ్డి చేరికతో టీఆర్ఎస్ బలం కాంగ్రెస్‌తో సమానంగా మారింది. పార్టీ బలాబలాలు సమంగా కావడంతో ఫలితం ఎటువైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
-
మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కేదెవరికో!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అంతు చిక్కడం లేదు. తమ పార్టీవారే చైర్మన్‌గా ఎన్నికవుతారని ఎవరికి వారు మద్ధతు కూడగట్టుకునే పనిలో బిజీ అయ్యారు. చైర్మన్ ఎన్నికకు గడువు సమీపిస్తుండడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పటికప్పుడు స్థానిక రాజకీయాల్లో మార్పులు వస్తుండడంతో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో అంతు చిక్కడం లేదు. మరోవైపు అభ్యర్థులు జారిపోకుండా ఉండేందుకుగాను చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న నాయకులు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తీసుకవెళ్లారు. పాలకవర్గం ఎన్నిక గడువు తేదీ పెరగడంతో క్యాంపు భారం భరించలేకపోతున్నామని కొందరు నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యేది అంతు చిక్కడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడించిన ఐదు రోజుల్లోనే చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. కాగా చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉండడంతో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే ఎమ్మెల్యేలకు ఓటు వేసే ఆవకాశం ఉంటుంది. దీంతో వచ్చే నెల 2న కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడనుంది. ఇందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వచ్చే నెల 5, 9 తేదీల్లో మున్సిపల్ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. కాగా 31 వార్డులకు గాను 11 వార్డుల్లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నలుగురితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉందనే ధీమాతో తామే చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా ఎంఐఎం సైతం టీఆర్ఎస్ మద్దతుతో తాము చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. 8 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం టీఆర్ఎస్కు చెందిన ఇద్దరు సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌లోని కొందరు తమకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్నమొన్నటి వరకు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన ప్రకటించడంతో ఆ ప్రభావం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నికపై పడుతుంది బీజేపీని విమర్శించిన జగ్గారెడ్డికి ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ నేతలే పేర్కొం టున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో అంతు చిక్కడం లేదు. విప్ గండం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతరులకు మద్దతిచ్చే సమయంలో విప్ మేరకే గెలిచిన అభ్యర్థులు పార్టీ అధిష్టాన సూచన మెరకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తే అనర్హుడిగా ప్రకటించే ఆవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే మున్సిపాల్టీకి ఎన్నికలు అనివార్యం కావచ్చని చెప్పవచ్చు. కాంగ్రెస్, టీడీపీలతో సహా ఎంఐఎం సైతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే విప్ జారీ చేయనున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇదివరలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.