దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ ఎంపిక విషయంలో ఎలాంటి నిర్ణయమూ వెలువడలేదు. చైర్మన్ పదవి కోసం నామినేషన్ల ప్రక్రియను ఖరారు చేసే ఏకైక ఎజెండాతో సోమవారం సమావేశమైన ఐసీసీ బోర్డు డైరెక్టర్లు తుది నిర్ణయం మాత్రం తీసుకోలేకపోయారు. దాంతో చైర్మన్ ఎంపిక వాయిదా పడింది. శశాంక్ మనోహర్ స్థానాన్ని భర్తీ చేసే వ్యక్తి విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడమే అందుకు కారణం. 17 మంది సభ్యులు పాల్గొన్న సమావేశంలో పలు అంశాలపై ఏకాభిప్రాయానికి రాలేకపోయామని ఐసీసీ బోర్డు మెంబర్ ఒకరు వెల్లడించారు.
చైర్మన్ పదవి కోసం తాను బరిలో ఉన్నానా లేదా అనే అంశంపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఈ పదవిని చేజిక్కించుకునేందుకు పోటీ పడుతున్న కొలిన్ గ్రేవ్స్ (ఇంగ్లండ్), డేవ్ కామెరాన్ (వెస్టిండీస్)లకు కొందరినుంచి మద్దతు లభిస్తున్నా... వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య కూడా అలాగే ఉంది. చైర్మన్ పదవి కోసం ఎన్నికలు నిర్వహిస్తే సభ్య దేశాల మధ్య అనవసరపు భేదాభిప్రాయాలకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుందని... అలా జరగకుండా అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తిని ఎంచుకునే క్రమంలోనే ఐసీసీ తుది నిర్ణయం తీసుకోలేకపోతోందనేది సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment