అనూహ్యం ఏమీ లేదు. అంతా అనుకున్నదే జరిగింది. అయితే కాస్త ఆలస్యంగా అధికారిక ప్రకటన వెలువడింది. కరోనా దెబ్బకు ఆటలు జరిగే అవకాశం లేని స్థితిలో ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీ అసాధ్యమని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తేల్చేసింది. ఈ ఏడాది అక్టోబర్–నవంబర్‌లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టి20 ప్రపంచకప్‌ను సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పు కారణంగా ప్రభావం పడే మరో రెండు వరల్డ్‌కప్ తేదీలను కూడా ఐసీసీ కొత్తగా ప్రకటించింది.
దుబాయ్: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను నిరాశపరిచే వార్త. 2020 సంవత్సరంలో 20–20 వరల్డ్‌కప్‌ను వీక్షించే ఆనందం దూరమైనట్లే. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు జరగాల్సిన టి20 ప్రపంచకప్ టోర్నీ వాయిదా పడింది. కరోనా దెబ్బకు అంతా తల్లడిల్లుతున్న దశలో ఒక మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని భావించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీని సంవత్సరంపాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ఇక 2021లో ఇదే తేదీల్లో పొట్టి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నవంబర్ 14న ఫైనల్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం 2021లోనే మరో టి20 ప్రపంచకప్ కూడా జరగాల్సి ఉంది. దానిని ఇప్పుడు 2022కు వాయిదా వేశారు. 2023లో భారత్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్‌కప్ మాత్రం అదే ఏడాది కొత్త తేదీల్లో నిర్వహిస్తారు.
తప్పనిసరి పరిస్థితుల్లో...
కరోనా వల్ల దాదాపు అన్ని దేశాల్లో పరిస్థితులు రోజురోజుకూ మరింత ఇబ్బందికరంగా మారుతున్నాయి. టోర్నీకి ఆతిథ్యం ఇవ్వాల్సిన ఆస్ట్రేలియాలో కోవిడ్–19 కేసులు సోమవారం 12 వేలు దాటాయి. తీవ్రత తగ్గించేందుకు అక్కడ కచ్చితమైన నిబంధనలు అమలు చేస్తున్నారు. టోర్నీ నిర్వహణకు సహకరించడం కష్టమేనంటూ గతంలోనే ఆస్ట్రేలియా ప్రభుత్వం పరోక్షంగా చెప్పగా... క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా మే నెలలోనే తమ నిస్సహాయతను వ్యక్తం చేసింది. అయినా సరే ఐసీసీ వేచి చూసే ధోరణిని అవలంభించింది. గతంలో జరిగిన రెండు ఐసీసీ సమావేశాల్లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా సాగదీసి చివరకు ఇప్పుడు ప్రకటించింది.
ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్–వెస్టిండీస్ సిరీస్ తరహాలో బయో బబుల్ సెక్యూరిటీతో టోర్నీ జరపవచ్చా అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే ద్వైపాక్షిక సిరీస్ వరకు ఏదోలా ఇలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నా... ఒక ఐసీసీ ఈవెంట్ విషయంలో ఇది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 16 జట్లను రెండు వారాల ముందు నుంచి ఐసోలేషన్‌లో ఉంచడం, ఇతర ఏర్పాట్లు, సౌకర్యాలు అందించడం అసాధ్యమని అర్థమైంది. భారత్, దక్షిణాఫ్రికా సహా పలు దేశాల నుంచి అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. పైగా ప్రేక్షకులు లేకుండా ప్రపంచకప్ జరపాలనే ఆలోచనను ఆస్ట్రేలియాలో అభిమానుల నుంచి మాజీ ఆటగాళ్ల వరకు దాదాపు అందరూ వ్యతిరేకించారు. దాంతో ఈ ఏడాదికి వరల్డ్‌కప్ మాటను పక్కన పెట్టేయాలని ఐసీసీ అభిప్రాయానికి వచ్చింది.
ఐపీఎల్ రెడీ...
ఐసీసీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్న బీసీసీఐకి 2020లో ఐపీఎల్–13 సీజన్ కోసం మార్గం మరింత సుగమమైంది. వరల్డ్‌కప్ జరగాల్సిన తేదీల్లోనే లీగ్‌ను నిర్వహించే విధంగా బోర్డు ప్రణాళికలు రూపొందించుకునేందుకు సిద్ధమవుతోంది. ఇక యూఏఈ లేదా మరో వేదికను ఖరారు చేయడమే తరువాయి. శుక్రవారం జరిగిన బీసీసీఐ సమావేశంలో దీనిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది.
ఎవరు నిర్వహిస్తారు...?
ఐసీసీ 2020 టి20 ప్రపంచ కప్‌ను 2021లో... 2021లో జరగాల్సిన టోర్నీని 2022లో నిర్వహిస్తామని తేదీలతో సహా స్పష్టంగా ప్రకటించింది. వాస్తవ షెడ్యూల్ ప్రకారం 2023 వన్డే వరల్డ్‌కప్ భారత్‌లో జరగాల్సి ఉంది. సంవత్సరం విషయంలో ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ తేదీలు మారాయి. భారత్‌లో ఫిబ్రవరి–మార్చి మధ్య ఈ టోర్నీ జరగాలి. అయితే రెండు ఐసీసీ టోర్నీల మధ్య ఉండాల్సిన కనీస అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నవంబరుకు మార్చారు.
ఇది భారత్‌లోనే జరుగుతుందని స్పష్టతనిచ్చిన ఐసీసీ... రెండు టి20 వరల్డ్‌కప్‌ల విషయాన్ని మాత్రం దాటవేసింది. పాత షెడ్యూల్ ప్రకారం 2021లోనే టి20 ప్రపంచకప్ నిర్వహించాలని, అవసరమైతే ఆస్ట్రేలియా 2022లో నిర్వహించాలని భారత్ కోరుకుంటుండగా... ఆస్ట్రేలియా మాత్రం తమ వద్దనుంచి వాయిదా పడింది కాబట్టి వచ్చే టోర్నీ ఆతిథ్య బాధ్యత తమదేనని గట్టిగా చెబుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాకపోవడంతో కూడా ఐసీసీ కూడా వేదిక విషయంలో తొందరపడదల్చుకోలేదు.
కివీస్‌లోనే మహిళల వరల్డ్‌కప్...
వచ్చే ఏడాది జరిగే మహిళల వన్డే వరల్డ్‌కప్ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఐసీసీ తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే 2021లో ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు న్యూజిలాండ్‌లో మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతుందని స్పష్టం చేసింది.
నామినేషన్లపై నిర్ణయం లేదు...
శశాంక్ మనోహర్ రాజీనామా చేయడంతో ఖాళీగా ఏర్పడ్డ ఐసీసీ ఇండిపెండెంట్ చైర్మన్ పదవి కోసం ఇంకా నామినేషన్ల ప్రక్రియ మొదలుకాలేదు. సోమవారం నిర్వహించిన సమావేశంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబోయే కొత్త ఐసీసీ చైర్మన్ విషయంలో ఇంకా ఏకాభిప్రాయక కుదరపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
టోర్నీ పేరు తేదీలు ఫైనల్ వేదిక
టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ 2021 నవంబర్ 14 ప్రకటించలేదు
టి20 ప్రపంచకప్ అక్టోబర్–నవంబర్ 2022 నవంబర్ 13 ప్రకటించలేదు
వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్–నవంబర్ 2023 నవంబర్ 26 భారత్
Comments
Please login to add a commentAdd a comment