
మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కేదెవరికో!
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరిని వరిస్తుందో అంతు చిక్కడం లేదు. తమ పార్టీవారే చైర్మన్‌గా ఎన్నికవుతారని ఎవరికి వారు మద్ధతు కూడగట్టుకునే పనిలో బిజీ అయ్యారు. చైర్మన్ ఎన్నికకు గడువు సమీపిస్తుండడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ఎప్పటికప్పుడు స్థానిక రాజకీయాల్లో మార్పులు వస్తుండడంతో ఎవరు ఎవరికి మద్దతు ఇస్తారో అంతు చిక్కడం లేదు. మరోవైపు అభ్యర్థులు జారిపోకుండా ఉండేందుకుగాను చైర్మన్ స్థానాన్ని ఆశిస్తున్న నాయకులు గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తీసుకవెళ్లారు.
పాలకవర్గం ఎన్నిక గడువు తేదీ పెరగడంతో క్యాంపు భారం భరించలేకపోతున్నామని కొందరు నేతలు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో స్పష్టమైన మెజార్టీ ఏ పార్టీకి రాకపోవడంతో చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యేది అంతు చిక్కడం లేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఫలితాలు వెల్లడించిన ఐదు రోజుల్లోనే చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. కాగా చైర్మన్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎమ్మెల్యేకు ఓటు హక్కు ఉండడంతో ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ప్రభుత్వం ఏర్పాటయ్యాకనే ఎమ్మెల్యేలకు ఓటు వేసే ఆవకాశం ఉంటుంది. దీంతో వచ్చే నెల 2న కొత్త ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడనుంది.
ఇందుకు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సైతం అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం వచ్చే నెల 5, 9 తేదీల్లో మున్సిపల్ చైర్మన్‌కు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. కాగా 31 వార్డులకు గాను 11 వార్డుల్లోనే గెలిచిన కాంగ్రెస్ పార్టీ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలంటే మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీకి చెందిన నలుగురితో పాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఉందనే ధీమాతో తామే చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుండగా ఎంఐఎం సైతం టీఆర్‌ఎస్ మద్దతుతో తాము చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది.
8 స్థానాల్లో గెలిచిన ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు చెందిన ఇద్దరు సభ్యులతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులతో పాటు కాంగ్రెస్‌లోని కొందరు తమకు మద్దతు ఇస్తున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిన్నమొన్నటి వరకు బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. తాజాగా తాను బీజేపీలో చేరడం లేదని ఆయన ప్రకటించడంతో ఆ ప్రభావం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎన్నికపై పడుతుంది బీజేపీని విమర్శించిన జగ్గారెడ్డికి ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ నేతలే పేర్కొం టున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థికి బీజేపీ మద్దతు ఇస్తుందో లేదో అంతు చిక్కడం లేదు.
విప్ గండం
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. దీంతో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో ఇతరులకు మద్దతిచ్చే సమయంలో విప్ మేరకే గెలిచిన అభ్యర్థులు పార్టీ అధిష్టాన సూచన మెరకే ఓటు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ పార్టీ ఆదేశాన్ని ధిక్కరిస్తే అనర్హుడిగా ప్రకటించే ఆవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీతో సహా ఇతర పార్టీలకు స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో తొలిసారిగా విప్ జారీ చేయనున్నారు. ఈ విధానాన్ని అనుసరిస్తే మున్సిపాల్టీకి ఎన్నికలు అనివార్యం కావచ్చని చెప్పవచ్చు. కాంగ్రెస్, టీడీపీలతో సహా ఎంఐఎం సైతం కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజునే విప్ జారీ చేయనున్నట్లు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇదివరలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.