దేశంలోనే నంబర్‌వన్ అవినీతి చక్రవర్తి బాబు
► ఎంపీ వెలగపల్లి, ఎమ్మెల్యే కిలివేటి
సూళ్లూరుపేట : ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రను దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలుపుతానని చెబుతుoటా డని, అయితే ఆయనే దేశంలో నంబర్ వన్ అవినీతి చక్రవర్తిగా పేరు ప్రఖ్యాతులు గడించారని తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్ అన్నారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆధ్వర్యంలో బుధవారం స్థానిక టీవీఆర్‌ఆర్ కల్యాణమండపంలో నవరత్నాల సభ నిర్వహించారు. తొలుత పెళ్లకూరు మండలం చిల్లకూరు సర్పంచ్ బసివిరెడ్డి వెంకట శేషారెడ్డి మృతికి మౌనం పాటించారు.
సభా కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన ఎమ్మెల్యే కిలివేటి ముందుగా అధ్యక్షోపన్యాసం చేశారు. నిరుపేద ప్రజానీకాన్ని ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన నవరత్నాలను బూత్ కమిటీ చైర్మన్లు, గ్రామ కమిటీ చైర్మన్లు ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పారు. నంద్యాల ఎన్నికల ఫలితం చూసి జడవాల్సిన పనిలేదన్నారు. సాక్షాత్తూ ఒక ముఖ్యమంత్రి, క్యాబినెట్లో పనిచేసే మంత్రులు వచ్చి అక్కడే కూర్చుని అధికార యంత్రాంగాన్ని, పోలీసులను వాడుకుని సుమారు రూ.200 కోట్లు ఖర్చు పెట్టి గెలిచారన్నారు. దీనిని గెలుపుగా ఎవరూ భావించాల్సిన అవసరం లేదన్నారు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారన్నారు. గడిచిన పదేళ్ల కాంగ్రెస్‌పాలనలో 51 సార్లు ఎన్నికలు జరిగితే అప్పటి ప్రతిపక్ష టీడీపీ ఒక్కసీటు గెలవలేదని గుర్తుచేశారు.
ముఖ్యఅతిథి ఎంపీ వెలగపల్లి మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడ అవినీతి సంపాదన ఉంటుందో అక్కడ వాలిపోతారన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ రాసుంటే దుగరాజపట్నం ఓడరేవు వచ్చి ఉండేదన్నారు. వైఎస్సార్ హయాంలో ఈ ప్రాంతంలో మేనకూరు, మాంబట్టు, శ్రీసిటీ సెజ్‌లు ఏర్పాటై సుమారు లక్షమందికి పైగా ఉపాధి లభించిందన్నారు. ఈ మూడున్నరేళ్లలో బాబు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. ప్రజల్లో చైతన్యం తెచ్చి వైఎస్ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. టీడీపీ నేతలు సంజీవయ్యను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా లొంగకుండా వైఎస్సార్ సీపీలోనే ఉంటానని చెప్పారని పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ నియోజకవర్గం నేతలు దువ్వూరు బాలచంద్రారెడ్డి, కామిరెడి సత్యనారాయణరెడ్డి, కట్టా సుధాకర్‌రెడ్డి, కట్టా రమణారెడ్డి, నలుబోయిన రాజసులోచనమ్మ, కురుగొండ ధనలక్ష్మి, పాలూరు మహేంద్రరెడ్డి, దేశిరెడ్డి మధుసూదన్‌రెడ్డి, వేణుంబాక విజయశేఖర్‌రెడ్డి, గునిశెట్టి వెంకటేశ్వర్లు, ఆరు మండలాల కన్వీనర్లు పాల్గొన్నారు.