Chalan
-
ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి!.. ట్రాఫిక్ పోలీసులనే తికమక పెట్టాడు
బనశంకరి(బెంగళూరు): జరిమానా చెల్లించకుండా తప్పించుకునేందుకు ఓ ద్విచక్రవాహనదారుడు తన బుల్లెట్ బైక్‌కు ముందు, వెనుక వేర్వేరు నంబర్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ పోలీసులను బోల్తా కొట్టించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన మరిగౌడ పలు పర్యాయాలు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడటంతో రూ.29 వేల జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ముందు వైపు ఒక నంబర్, వెనుక వైపు మరో నంబర్ రాయించాడు.దీంతో పలు మార్లు ట్రాఫిక్ పోలీసులు ముందు ఒక నెంబర్ వెనక మరొకటి చూసి చూసి తికమక పడ్డారు. చివరికి ఈనెల 29వ తేదీన మరిగౌడ రాజాజీనగర కూలినగర వంతెన వద్ద సంచరిస్తుండగా ట్రాఫిక్ పోలీసులు అరెస్ట్‌చేసి కోర్టులో హాజరుపరచగా ఆగస్టు 12 వరకు రిమాండ్ విధించారు. చదవండి: నిత్య పెళ్లికొడుకు సతీష్ తెలుగుతమ్ముడే! -
ట్రాఫిక్ చలానా; ఎంత పని జేశినవ్ అక్క..!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ రూల్స్ ఉండేది ఎందుకు.. మనం జాగ్రత్తగా.. సేఫ్‌గా గమ్యం చేరడానికి. హెల్మెట్ ధరించండి.. సీటు బెల్ట్ పెట్టుకోండి.. తాగి డ్రైవ్ చేయకండి వంటి నిమయాలన్ని మన సేఫ్టి కోసం పెట్టినవే. కానీ జనాలు మాత్రం రూల్స్ ఉల్లంఘిస్తూ.. ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతారు. ఇక చలానాల నుంచి తప్పించుకోవడానికి జనాలు వేసే వేషాలు.. పడే పాట్లు చూస్తే.. వీళ్లు ఇక్కడ ఉండాల్సిన వాళ్లు కాదు అనిపిస్తుంది. గతంలో కేబుల్ బ్రిడ్జి మీద ఓ కుటుంబం నంబర్ ప్లేట్ మీద చున్నీ వేసిన ఘటన చూశాం. ఇక మరి కిందరు టీఎస్ తర్వత వచ్చే ఆల్ఫాబెట్ సిరీస్ కనపడకుండా స్టిక్కర్ అంటించడం.. మూతికి పెట్టుకోవాల్సిన మాస్క్ నంబర్ ప్లేట్‌కు పెట్టడం... ఇక బండి మీద వెనక కూర్చున్న ఆడవారు చున్నీ, చీర కొంగుతో బైక్ నంబర్ ప్లేట్ కనపడకుండా చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఎన్ని వేషాలు వేసినా.. ఒక్కసారి ట్రాఫిక్ వారి కంట్లో పడితే.. తాటా తీయడం మాత్రం ఖాయం. అంతేకాదండోయ్.. మనకు అర్థం అయ్యేలా చేయడానికి సూపర్ హిట్ సినిమాల నుంచి మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విట్టర్ ఖాతాలో ఇలాంటి మీమ్‌ను షేర్ చేయగా.. ప్రస్తుతం అది తెగ వైరలవుతోంది. ‘‘చలానాలు పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటించడం ఒకటే ఉత్తమ మార్గం. విన్యాసాలు చేసి తప్పించుకోవడం కాదు’’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలో ఓ బైక్ మీద ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. బైక్ నడిపే వ్యక్తికి మాత్రమే హెల్మెట్ ఉంది. ఇక ట్రిపుల్ రైడింగ్‌కి చలానా పడుతుంది. దాంతో బైక్ మీద కూర్చున్న మహిళ అతి తెలివితో నంబర్ ప్లేట్ సరిగా కనపడకుండా ఉండేందుకుగాను తన కాలిను దాని మీద పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్ నంబర్ ప్లేట్‌ని గుర్తించి.. 2,800 రూపాయల చలానా విధించారు. (చదవండి: ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది?) కావాలని వాహనం సమాచారం దాచినందుకు 500 రూపాయలు.. ప్రమాదకర డ్రైవింగ్‌కు 1,000 రూపాయలు.. ట్రిపుల్ డ్రైవింగ్‌కు 1,200.. వెనక కూర్చున్న వారికి హెల్మెట్ లేనందుకు గాను 100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు. ఇక వీరి ఫోటోతో పాటు షేర్ చేసిన మీమ్ సూపర్. అత్తారింటికి దారేది సినిమాలోని క్లైమాక్స్ సీన్‌ని వీరికి అన్వయిస్తూ.. ‘‘నువ్వేమో 1,300 రూపాయలు కాపాడాలని కాలు పెట్టావ్.. కానీ నువ్వు చేసిన పనికి ఇంకో 1500 రూపాయలు ఎక్కువ పడ్డాయి’’ అంటూ క్రియేట్ చేసిన మీమ్ సూపర్బ్ అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. -
చౌకీదార్‌కు ఫైన్ మోత
సాక్షి, భోపాల్: వాహనం నంబర్ ప్లేట్‌పై చౌకీదార్ అని రాసి ఉన్నందుకు పోలీసులు ఎమ్మెల్యేకు చలాన్ విధించిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బీజేపీ తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘మై భీ చౌకీదార్’ అనే నినాదాన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేసింది. అయితే ఈ నినాదానికి తనపేరును కూడా జోడించి చౌకీదార్ పంధాన అని సొంత కార్ నెంబర్ ప్లేట్ మీద రాయించుకున్నారు మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రాందాంగోర్. బీజేపీ ఎంపీ అభ్యర్థి, ఖండ్వా ఎమ్మెల్యే నందకుమార్ సింగ్‌ను కలవడంతోపాటు పట్టణంలో రంగులపంచమికి హాజరవడానికి రాందాంగోర్ వచ్చారు. ఉత్సవ సమయం కావడంతో పోలీసులు కొన్నిచోట్ల చెక్‌పోస్టులు పెట్టారు. ఎమ్మెల్యే రాందాంగోర్ వాహనాన్ని రోడ్డుపై వెళ్తున్నప్పుడు నెంబర్ ప్లేట్‌ను చూసిన పోలీసులు.. వాహనాన్ని ఆపి నెంబర్ ప్లేట్ చట్టం ప్రకారం ఫైన్ విధించారు. చలాన్ వివరాలను కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలిపారు. తాను ఎటువంటి అతిక్రమణలకు పాల్పడలేదని, పోలీసుల ఫైన్ విధింపులో కాంగ్రెస్ కుట్ర దాగుందని ఎమ్మెల్యే రాందాంగోర్ ఆరోపించారు. -
హెల్మెట్ తప్పనిసరి చేద్దాం
ద్విచక్రవాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలనే అంశం మరోసారి తెరపైకి వ చ్చింది. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుండటంతో ఈ నిబంధనను తప్పనిసరి చేయాలని పోలీసు, రవాణా శాఖలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం రోడ్డు భద్రత చట్టం రూపొందిస్తున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాలు హెల్మెట్ ధరించడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఇది అమలవుతోంది. తాజాగా పొరుగు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఆగస్టు ఒకటి నుంచి దీనిని అమలులోకి తెచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా శిరస్త్రాణం ధరించడాన్ని తప్పనిసరి చేసే నిబంధనను అమలు చేయాలని తాజాగా పోలీసు, రవాణా శాఖలు సంయుక్తంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. సాధారణంగా హెల్మెట్ నిబంధన విషయంలో వాహనదారులు అయిష్టత చూపుతారు. హెల్మెట్ వాడకం అలవాటులేని వారు దాన్ని చిరాకుగా భావిస్తూ వెనకడుగు వేస్తారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే అందుకు సుముఖంగా ఉన్నట్టు కనిపించటం లేదు. రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. రోడ్డు భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇటీవలే జరిగిన రోడ్డు భద్రతా వారోత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఈ సమయంలో హెల్మెట్ నిబంధనను రెండు శాఖలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. అయినా ఇప్పటి వర కు అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. - సాక్షి, హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆచితూచి.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ అదనపు కమిషనర్‌గా పనిచేసిన ఓ అధికారి దాదాపు పదేళ్ల క్రితమే హెల్మెట్ ధారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ అధికారి ఒత్తిడితో దాన్ని తప్పనిసరి చేస్తూ అమలు మొదలైంది. కానీ, వాహనదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటం, హెల్మెట్ కంపెనీల కోసం పోలీసులు హడావుడి చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇటీవల ప్రమాదాల సంఖ్య పెరగటం, దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతపై చర్చ జరుగుతున్న తరుణంలో పోలీసు, రవాణా శాఖలు మళ్లీ దీనిపై దృష్టి సారించాయి. కానీ త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈ నిబంధనపై వాహనదారుల్లో వ్యతిరేకత వస్తే.. అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందనే ఆందోళనే దీనికి కారణంగా తెలుస్తోంది. మరోవైపు దీనిని పట్టించుకోని పోలీసు శాఖ క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అలాగే గత కొన్ని రోజులుగా హెల్మెట్ నిబంధనకు సంబంధించి చలానాలు విధించటాన్ని తీవ్రం చేసినట్టు సమాచారం. సగటున నిత్యం 100కుపైగా చలానాలు విధిస్తున్నట్టు ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. ‘రోడ్డు భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. వాహనదారుల రక్షణ దృష్ట్యా హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలి. దాన్ని అమలు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం అనుమతివ్వడమే తరువాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నందున హెల్మెట్ వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ముఖ్యమంత్రితో చర్చిస్తాం రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ‘హెల్మెట్ ధారణను తప్పనిసరి చేసే విషయంలో తుదినిర్ణయం తీసుకోలేదు. దీనిపై త్వరలో ముఖ్యమంత్రితో చర్చిస్తాం. అంతకుముందు పోలీసు, రవాణా శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తాం. ఆ తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాం’ అని రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు.